ఉమ్మడి ఏపీలో తెలంగాణ గోస అందరినీ కదిలించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గానీ ఈ బాధలు తీరవని అన్ని వర్గాలు భావించాయి. అందుకే, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మేధావి, ఉద్యోగ, ప్రజా సమూహాలు తెలంగాణ సాధన కోసం ఒక్కటయ్యాయి. అయితే ఇదంతా కేసీఆర్ ముందుపడిన తర్వాతే. ఈ సకలజనుల ఐక్యతను పిడికిలిలా ధరించి ఉద్యమాన్ని ముందుకు నడిపింది కూడా ఆయనే. ఎన్నేండ్లు, ఎన్ని ఆందోళనలను చేపట్టినా రాజకీయంగా ఎదుర్కొంటే తప్ప రాష్ట్రం సిద్ధించదన్న సంకల్పంతో కేసీఆర్ నాడు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కాల ఉద్యమానికి తన రాజకీయ చతురతను జోడించి స్వరాష్ట్రం కల సాకారమయ్యేందుకు ఆయన కృషిచేశారు.
ఉద్యమకాలంలో రాజకీయ శక్తులు ఎన్నికల సమరం ద్వారా చట్టసభల్లో ప్రజల కాంక్షను వినిపించగా, మిగతా వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి పాలకులపై ఒత్తిడిని పెంచాయి. మొత్తం కళలన్నీ తెలంగాణ గానం చేశాయి. తెలంగాణ ధూం ధాం, రచయితల వేదికలు ప్రజలను ఒక్క తాటిపైకి రప్పించాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు తెగించి ‘జై తెలంగాణ’ అన్నారు. యువత, విద్యార్థులు ఆత్మత్యాగాలకు సిద్ధపడ్డారు. మేధావి వర్గం తమ తమ భావజాల రేఖలు దాటి తెలంగాణ చరిత్రను, అస్తిత్వాన్ని తెలుపుతూ రాష్ట్ర ఆవశ్యకతను గట్టిగా వినిపించింది. మేధావులు పత్రికల్లో వరుసగా వ్యాసాలు రాస్తూ, టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొంటూ, వేదికలపై ప్రసంగాలు చేస్తూ వాస్తవిక పరిస్థితులను ప్రపంచం ముందుంచారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అప్పటి వరకు వీరందరి ఆకాంక్ష ఒక్కటే.. ‘తెలంగాణ రావాలె, ప్రజల బతుకులు మారాలె’ అని తప్ప సొంత లాభం, పదవుల కాంక్ష వారికి లేదు. విద్యార్థి, ఉద్యోగ దశల్లో కమ్యూనిస్టు భావజాలానికి కట్టుబడి అప్పటికే పలు సామాజిక సమస్యలపై పోరాడుతున్నవారు ఈ మేధావి వర్గంలో ఎక్కువగా ఉన్నారు. అంతవరకు వారిది ప్రజాపక్ష, ప్రతిపక్ష పాత్రనే. ప్రభుత్వాలను నిలదీయడమే తప్ప పాలనలో పాలుపంచుకోలేదు. పాలకులవైపు ఉండటమంటే ప్రజలకు దూరమవడమే అనే భావన కూడా ఉండేది. ప్రగతిశీల ఉద్యమ నేపథ్యంతో ప్రభుత్వ సత్కారాలను సైతం ఎందరో తిరస్కరించేవారు.
తెలంగాణ వచ్చాక ఈ మేధావి వర్గంలో చాలామందికి ప్రభుత్వ పదవుల్లో, పాలక మండళ్లలో అవకాశాలు లభించాయి. దొరికినవారు ప్రభుత్వ విధుల్లో సంతోషంగా తమ పాత్రలను పోషించారు. హోదాల వల్ల వారికెంతో సంతృప్తి కూడా దక్కింది. ఊహించని పదవులను కట్టబెట్టిన కేసీఆర్కు దండాలు పెట్టారు. పదేండ్ల కేసీఆర్ పాలనను సమర్థిస్తూ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కీర్తిస్తూ మాట్లాడారు. పత్రికల్లో వ్యాసాలు రాశారు. కొందరు పుస్తకాలు రాశారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో తమ పూర్వాశ్రమపు కమ్యూనిస్టు భావజాలాన్ని తుడిచేసుకున్నారు. ప్రభుత్వ వాహనం, లక్షల్లో వేతనం, నలుగురిలో గొప్పతనం కొత్త మైకాన్ని ఇచ్చాయి. అధికారం ఇచ్చిన కొత్త రుచులు ఇష్టంగా మారాయి.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక గత పాలకుల వద్ద గౌరవం, హోదాలు దక్కనివారిని కాంగ్రెస్ పార్టీ చేరదీయడం మొదలుపెట్టింది. అది ఓ రాజకీయ ఎత్తుగడ. అందులో భాగంగానే అందెశ్రీని కాంగ్రెస్ అక్కున చేర్చుకుంది. కోదండరాం ఎమ్మెల్సీ అయ్యారు. ఇందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పెట్టే అమ్మను వదులుకొమ్మని ఎవరూ చెప్పరు. అయితే, కేసీఆర్ పాలనను విమర్శించినవారిలో రెండు రకాల వారున్నారు. కొందరేమో పదవులకు ఆశపడి, ఇవ్వని కారణంగా విమర్శించినవారు, మరికొందరేమో తమ సహజ ప్రవృత్తితో విమర్శించినవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మొదటి రకాన్ని సంతృప్తిపరచి కేసీఆర్పై వారు విరుచుకుపడేలా వారిని తయారు చేసుకుంటున్నారు. వీరిలో రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు ఉన్నారు. తెలంగాణ వచ్చిందనే తృప్తి కన్నా కేసీఆర్ తమకు ఏ పదవి ఇవ్వలేదన్న కసి వారి విమర్శల్లో కనబడుతుంది. అదంతా వారి వ్యక్తిగతం.
కేసీఆర్ హయాంలో ఎందరో రచయితలు, మేధావులు పదవులు పొందారు. వారి పదవీకాలం కూడా పూర్తయింది. కొందరికి తిరిగి పదవులు దక్కాయి, కొందరికి దక్కలేదు. దక్కనివారిలో కొందరు వెంటనే విమర్శాపర్వం ఎత్తుకున్నారు. కొందరేమో మరో అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో అకాడమీ, కార్పొరేషన్లకు పెద్దలుగా ఉన్నవారు రాజీనామా చేయక తప్పలేదు. బీఆర్ఎస్ తిరిగి గెలిస్తే వీరి పదవులకు ఢోకా ఉండేది కాదు. కేసీఆర్ వీళ్లను కావాలని దూరం చేసుకోలేదు. ఈ లెక్కన పదవులు దక్కినవారైనా అన్నివేళలా కేసీఆర్కు అనుయాయులుగా ఉండాలి. తెలంగాణ వచ్చాక పదవులు వద్దనుకొన్నవారిని ఏమనలేం. పదవులు దక్కనివారిని కూడా తప్పుబట్టలేం. కానీ, తెలంగాణ రాకతో కేసీఆర్ హయాంలో పదవులు, గౌరవాలు పొందినవారు కాంగ్రెస్ పంచన చేరడమే ఆక్షేపణీయం. నిజానికి, బీఆర్ఎస్ హయాంలో పదవుల్లో ఉన్నవారు కేసీఆర్, రేవంత్ పాలనల మధ్య వ్యత్యాసాలపై, మంచి చెడులపై బహిరంగంగా మాట్లాడాలి. కానీ, చాలామంది వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారు. హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైనా నోరెత్త డం లేదు. రేవంత్రెడ్డి చేపడుతున్న తెలంగాణ చిహ్నాల మార్పుపై మాట్లాడటం లేదు.
తెలంగాణ తల్లిని అప్పుడు మెచ్చుకున్న నోళ్లే ఇప్పుడు కొత్త విగ్రహాన్ని కూడా మెచ్చుకోవడం విడ్డూరం. ఇదే అదనుగా ముఖ్యమంత్రి ఒక్కొక్కరిని చేరదీసి తమవైపు తిప్పుకొంటున్నారు. ఇప్పుడు భావజాలాలు ఉత్త ముచ్చట్లే.
కాంగ్రెస్ చరిత్ర కూడా అవసరం లేదు. ప్రజా యుద్ధనౌక బిడ్డకు కాంగ్రెస్ ఇచ్చిన పదవే ముఖ్యం. విప్లవ సాంస్కృతిక సంస్థ సారథి కాంగ్రెస్ మంత్రితో వేదిక పంచుకుంటారు. కవులు, కళాకారులకు దక్కే సత్కారాలు వారి హక్కు. అయితే ఎవరు ఇస్తే వారి భజన చేయడం వారికి శోభనివ్వదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎప్పుడూ ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఉండే తెలంగాణ రచయితలు, కళాకారులు, మేధావుల సంఖ్య తగ్గిపోతున్నది. ఇది తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధం.