‘పంచాయతీల్లో కాంగ్రెస్ కమాల్’ అంటూ రేవంత్‌రెడ్డిని ఆంధ్ర మీడియా ఆకాశానికి ఎత్తుతున్నది. వినయమో, భయమో, మరికొన్ని చీకటి రహస్యాల కారణంగానో కొందరు మంత్రులు కూడా రేవంత్ వీరుడు, శూరుడు అంటూ భుజకీర్తులు తొడుగుతున్నరు. ‘పట్నాలు, పల్లెలు నా పాలన మెచ్చిన్రు; రాబోయే రోజుల్లో మూడింటా రెండు వంతుల అసెంబ్లీ స్థానాలు కూడా గెలుస్త’మంటూ ఆయనా రంకెలేస్తున్నరు.
ఇవన్నీ నిజమైన పక్షంలో, ఇది వాపు కాదు ఊపు అయిన పక్షంలో వెంటనే ఏమి చేయాలి? He should strike while the iron is hot, కదా? ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పెట్టేయాలి కదా? కానీ, ఏమంటున్నరు ఇప్పుడు? ‘స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం; ఆ తర్వాతే మున్సిపల్, పరిషత్ ఎన్నికలపై నిర్ణయం’ అంటున్నరు! తాను కాలికి బలపం కట్టుకుని తిరిగినా; అధికార పార్టీగా అరాచకాలు చేసినా పల్లె ప్రజలు గంపగుత్తగా గుంపుమేస్త్రీని మెచ్చలేదు. కేసీఆర్ ఒక్క అప్పీల్ కూడా చేయకుండానే బీఆర్ఎస్ పార్టీని పల్లెలు ఆదరించినయి. పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్న ముఖ్యమంత్రి యథాశక్తి ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడుతున్నరు.
విప్లవ కవి మండే సత్యనారాయణ గీతం ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..!’ గుర్తుకువచ్చింది మొన్న మూడు దశల్లోనూ పల్లె పోటు చూసినప్పుడు! సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, తాండూరు, ఆదిలాబాద్, భూత్పూర్, కాళేశ్వరం, కన్నెపల్లి, మీర్ఖాన్ పేట్, రాజుపేట, వరికోల్, అమ్మనబోలు, వేల్పూర్, దేన్యతండా, వీణవంక… ఉత్తరం-దక్షిణం; తూర్పు-పడమర తేడా లేకుండా పల్లెలు కదిలినయి కాంగ్రెస్ నయవంచనకు కర్రుకాల్చి వాత పెట్టినయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు; తెలంగాణకు సంబంధం లేని బీజేపీ వైపు కన్నెత్తి చూడలేదు గ్రామీణులు. తమ బతుకులు బాగుచేయడం బీఆర్ఎస్ వల్లనే అవుతుందని ఓటుపథంగా చెప్పిన్రు. మనందరికీ ఎరుకే- పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీవైపు మొగ్గుచూపుతరు జనం, అందునా మరొక మూడేండ్ల పాలన ముందున్నప్పుడు… అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు కినుక వహిస్తే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాల భాగస్వామ్యంలో తమను పక్కన పెట్టేస్తరేమోనన్న భయమూ; గతంలో ఇచ్చిన హామీలు రాబోయే రోజుల్లో ఏ కాస్తయినా నెరవేరుస్తరేమోనన్న ఆశా జనంపై ప్రభావం చూపి అధికార పార్టీకి ‘ఎడ్జ్’ లభిస్తుంది.
అదీ పనిచేయలేదంటే గుంపుమేస్త్రీ పాలన పట్ల (లేదా పాలనాలేమి!) ఎంత రోసిపోయి ఉంటరు జనం! ఆయన బెదిరింపులను ఎంత నిరసించి ఉంటరు ప్రజలు!! కాబట్టే, బీఆర్ఎస్ పార్టీకి దాదాపు నాలుగు వేల పంచాయతీలను అప్పజెప్పిన్రు. ‘ప్రజా పాలన’కు మరొక రెండున్నర వేలతో సరిపెట్టి… ‘ఒళ్లూ దగ్గర పెట్టుకొని’ అంటూ హెచ్చరించిన్రు! అయినా, రేవంత్ రెడ్డీ..! మీ పాలన బీభత్సంగా బాగుంటే, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అడ్డం పెట్టుకుని ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు రాకుండా అడ్డుపడటం దేనికి! తాము షరీకైన పార్టీలో ఉన్నమని ధైర్యంగా చెప్పుకోలేని బేలతనం వారికి… ‘మీరు మా వాళ్లు, రాజీనామాలు చేయండి, మళ్లీ గెలిపించుకుంటం’ అని చెప్పలేని పిరికితనం మీకు… దేనికి? విషయం స్పష్టం… మీ మేకపోతు గాంభీర్యమంత స్పష్టం; ఒక చోట కాలుమీద కాలేసుకుని, మరొకచోట చేతులు కట్టుకునే మీ నడవడిక అంత స్పష్టం; సుపీరియారిటీ కాంప్లెక్స్ ముసుగులో మీరు దాచుకుంటున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంత స్పష్టాతిస్పష్టం.
పట్నం ప్రజలకు ప్రభుత్వ కాపుర లక్షణం కాలిగోళ్ల నాడే అర్థమైంది. కాబట్టి, జీహెచ్ఎంసీ పరిధిలో నాడు గొయ్యి తవ్విన్రు; ఇప్పుడు కండ్లు తెరిచిన పల్లె జనం బొందపెడుతున్నరు! రేవంత్ సహా ఆ పార్టీ తోపులు, తురుములు అని చెప్పుకొనేవాళ్ల ఇలాకాలో బొక్కబోర్లా పడ్డరు మూడు విడతలవారీగా!
మొన్న పల్లెల్లో కాంగ్రెస్ చేసిన అరాచకాలకు అంతూపొంతూ లేదు. తమ అభ్యర్థులు గెలవరనుకున్న చోట్ల బలవంతపు ‘ఏకగ్రీవాలకు’ తెరలేపిన్రు. ‘సర్పంచ్ మాకు, ఉప సర్పంచ్ మీకు’ అంటూ బేరా లు పెట్టిన్రు. పదవులు, పైసలు, కాంట్రాక్టులతో ప్రలో భ పెట్టిన్రు. లొంగినవారికి ఇందిరమ్మ ఇండ్లు; లొంగనివారికి ‘బట్టలు ఊడదీసి కొట్టే ఇందిరమ్మ రాజ్యం’ గ్యారెంటీలు చూపిన్రు. నూతన్‌కల్‌లో మల్లయ్య కిరాతక హత్య, నల్లగొండలో మూత్రం తాగించడం, కుపన్కోట్, పాషాపూర్ తండాల్లో గెలిచిన బీఆర్ఎస్ వారిని రక్తాలు కారేలా కొట్టడం, సోమార్పేటలో ట్రాక్టర్‌తో తొక్కించడం, శాంతిగూడెంలో పోలింగ్ ఏజెంట్ మహేష్ తలను తలుపుకేసి బాదడం, టేకులపల్లిలో ఓటరుపైనే దాడి… ఒకటీ రెండని కాదు, రాష్ట్రమంతా ఇదే ‘ఇందిరాగాంధీయిజం!’
అన్నిటినీ తట్టుకొని నిలిచిన పల్లె జనానికి వందనం. వారి అభిమానంతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు అభినందనం. ఓడిపోయినవారి పోరాటపటిమకు సలాం. కాంగ్రెస్ దౌర్జన్యాల బాధితులకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఎట్లా అండగా ఉన్నదో, రేపు 22న కొలువుదీరిన తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కేసీఆర్ స్ఫూర్తితో, మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్య దార్శనికతతో పాలించాలె. భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతికి ఉన్న హక్కుల్లాగానే గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కూ పాలనపై సర్వాధికారాలు ఉంటయి. సుప్రీంకోర్టు సైతం మీ గ్రామసభ తీర్మానాలను కాదనలేదు. కాబట్టి, ఎవరి ఒత్తిడికీ లొంగకుండా ప్రజాపక్షం వహించాలి. రెండేండ్లలో పల్లెసీమల్ని చిదిమేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాల్లో బుద్ధిగా వ్యవహరిస్తుందని అనుకోలేం. బలవంతంగా భూములు గుంజుకోవడం, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, నిధులు దారిమళ్లించడం మొదలుకొని అన్నిరకాలుగా గ్రామీణ జనాన్ని గోస పెట్టి తీరుతుంది. అది వారి డీఎన్ఏ.
ఇక్కడే కొత్త పాలకవర్గం గొప్పగా వ్యవహరించాలి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని ప్రభ మళ్లీ పల్లెల్లో రావాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార గణం సామ దాన భేద దండోపాయాల్ని మీపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటరు. వెరవకండి- కేసీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులందరూ ఉన్నరు మీ వెనుక!