ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏమాత్రం గౌరవం లేని జాతీయ పార్టీలను రాష్ర్టాల నుంచి తరిమికొట్టాలని, ఇందుకోసం ప్రాంతీయ పార్టీలు ఏకమై కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో ప్రతిపాదించారు. ఒక్కో ప్రాంతీయ పార్టీ అధినేత దగ్గరకు వెళ్లి కలిసి మరీ జాతీయ పార్టీల దుర్నీతిని వివరించారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం కోసం పనిచేయాలని సహేతుకంగా నొక్కిచెప్పారు. జాతీయ పార్టీలతో పొత్తుల ప్రసక్తి లేకుండా ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ప్రాంతీయ అస్తిత్వంతోనే జాతీయ రాజకీయాలు చేయాలని సూచించారు. జాతీయ పార్టీల పంచన చేరకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దామని సూచించారు.
మమత, కేజ్రీవాల్, అఖిలేశ్, నితీశ్, స్టాలిన్, ఉద్ధవ్, పవార్ అందరి దగ్గరకూ వెళ్లి నచ్చచెప్పటానికి కేసీఆర్ ప్రయత్నించారు. అయితే, ఉత్తరాది ప్రాంతీయ పార్టీల నాయకులు కేసీఆర్ మాటలను పెడచెవిన పెట్టారు. ఏదైనా జాతీయ పార్టీ పంచన వెళ్తేనే తమకు ఉనికి ఉంటుందని, నాలుగు సీట్లు గెలుస్తామని కక్కుర్తి పడ్డారు. ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ తాను కాంగ్రెస్‌ను వదిలేది లేదన్నారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీలు కూడా కేసీఆర్ ఆలోచనను తక్కువ అంచనా వేశాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా, ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ముందుకు వెళ్లలేదు కాబట్టి..ఆ పార్టీకి సొంత క్రెడిబిలిటీ అంటూ ఉన్నదని చెప్పలేం. ఇతర పార్టీలు కూడా ఏదో ఒక జాతీయ పార్టీతో అంటకాగకపోతే వెళ్లలేమన్న ఆలోచనతో ఉండటం వల్లనే ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయా? అనే అనుమానం కలుగుతున్నది. తాజాగా, బెంగాల్, తమిళనాడు, కేరళం ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి.
కాంగ్రెస్ ధృతరాష్ట్ర కౌగిలిలో కేజ్రీవాల్, మమత, స్టాలిన్ పార్టీలు నలిగి ముక్కలు ముక్కలయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇండి కూటమి పేరుతో అన్ని పార్టీల మద్దతును కాంగ్రెస్ తీసుకున్నది. కూటమి పేరుతోనే ఎన్నికల్లో ఆయా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని స్నేహం నటించి సీట్లు పెంచుకున్నది. కానీ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు ఇండి కూటమితో పార్లమెంట్లో తనకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీలకు కాంగ్రెస్ పూర్తిగా చెయ్యిచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై బీజేపీ కంటే ఎక్కువగా విమర్శలు గుప్పించింది రాహుల్ గాంధీయే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయినప్పుడు కేజ్రీవాల్ వెన్నంటి నిలిచిన రాహుల్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కేజ్రీవాల్‌ను అదే లిక్కర్ స్కాంలో దోషిని చేసి దుమ్మెత్తిపోసి బీజేపీ గెలుపునకు రాచబాట వేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన మమతను తాజాగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ బోనులో నిలబెట్టి.. మొట్టమొదటిసారి బెంగాల్లో బీజేపీ అధికారపీఠం ఎక్కటానికి చక్కగా దోహదపడ్డారు. తమిళనాడులో డీఎంకే సైతం కాంగ్రెస్ బంధనాలను ఎందుకు వదిలించుకోవటం లేదో అర్థం కాదు. వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ 1961లోనే తన ఉనికిని కోల్పోయింది. అస్సాంలో బీజేపీతో డైరెక్టుగా తలపడి సోదిలోకి లేకుండా ఓడిపోయింది.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి కాళ్లా వేళ్లాపడి మద్దతు పొందిన ప్రాంతీయ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పక్కలో బల్లెంలాగా మారిపోయి..బీజేపీకి లైన్‌క్లియర్ చేస్తూ వచ్చింది. ‘కొట్లాడటానికి చేతకానివాడు.. పక్కకు పోడంట.. కాట్లాడే వాళ్ల కాళ్లల్ల కట్టెలు పెడతాడంట’..ఇందుకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.
బీజేపీ నాయకత్వం కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ వస్తున్నది. వారి వ్యూహాలను కాంగ్రెస్ అర్థం చేసుకోవటం లేదు. 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటిదాకా దూకుడుగా వ్యవహరించిన బీజేపీ.. ఒక్కసారిగా తనకు తానుగా వెనక్కిపోయింది. తన మిత్రపక్షంలో ఉన్న నాయకుడిని అర్జెంటుగా కాంగ్రెస్‌లోకి జంప్ చేయించి.. తనకున్న ఓటు షేర్‌ను పూర్తిగా వదులుకొని కాంగ్రెస్‌ను తెలంగాణలో గెలిపించింది. అస్సాంలో బీజేపీ సొంతంగా గెలువలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాల్లో సైతం సొంతంగా తలబడి గెలువలేదు.
తెలంగాణలో బీజేపీ వెనక్కిపోవటం వల్ల గెలిచిన కాంగ్రెస్ పార్టీ..కేరళంలో గెలవటానికి సీపీఐని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ను బీజేపీ కోవర్ట్ అని ప్రచారం చేయటం దుర్మార్గమైన వ్యవహారం. అంతేకాదు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ను అక్కడికి పంపించి మరీ ఈ రకమైన ఆరోపణలు చేయించింది. ఇండి కూటమిలో కలిసి పనిచేసిన మిత్రులకు కాంగ్రెస్ చేసిన తీరని ద్రోహం ఇది. ఇదే సీపీఐ తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీటుకు, ఒక నామినేషన్ పోస్టుకు కక్కుర్తిపడి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండటం దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాల తరబడి ఏలిన కమ్యూనిస్టులు మూడు రాష్ర్టాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థితిలో ఉన్నారు. వేర్వేరు రాష్ర్టాల్లో ఆయా ప్రాంతీయ పార్టీల పంచన చేరి, లేదా కాంగ్రెస్‌ను బతిమిలాడుకొని..ఒకటో అరో సీటుతో సంతృప్తి పడే పరిస్థితి నెలకొన్నది.
ముందే గమనించిన కేసీఆర్: దేశంలో మారుతున్న ఈ రాజకీయ పరిణామాలను కేసీఆర్ 2022 లోనే అంచనా వేశారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలు దేశమంతా ఏకం కావాలని ఆకాంక్షించారు. దానికి తెలుగు రాష్ర్టాల్లోని ఒక సెక్షన్ మీడియా పెడర్థాలు తీసింది. ఎద్దేవా చేసింది.
తనను కాదని దూరం వెళ్తే..పార్టీ
పరిస్థితి ఏమవుతుందో, 2019 ఎన్నికల్లోనే బీజేపీ.. తెలుగుదేశం పార్టీకి రుచి చూపించింది. ఎన్నికలైన మరుక్షణమే.. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించి మోడీ పంచన చేరిపోయారు చంద్రబాబు. ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ ఆ పార్టీని మింగేస్తుందని ఆయనకూ తెలుసు. బీహార్‌లో నితీష్ కుమార్ శకానికి ఈమధ్యనే ముగింపు పలికారు. ఆయన కుమారుడు నిషాంత్, తండ్రి పార్టీ జేడీయూను ఎంతవరకు ముందుకు తీసుకుపోగలరో ఇప్పుడిప్పుడే అంచనా వేయలేం.
మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పని అయిపోయింది. హర్యానా, జార్ఖండ్‌లో ప్రాంతీయ పార్టీలు కనపడకుండా పోయాయి. ఇక ఉత్తరాదిన మిగిలింది, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీయే. మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ.. ఆయా రాష్ర్టాల్లో సీట్లు అమ్ముకుంటూ..ఇంకా ఉనికిలో ఉంటున్నది తప్ప యూపీలో అధికారంలోకి వచ్చే స్థాయిలో లేదు. సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే ఉత్తరాదిన బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నదిగా చెప్పుకోవచ్చు.
తమిళనాడులో విజయ్ పార్టీ (టీవీకే) అధికారంలోకి రావటం ప్రాంతీయ పార్టీల ప్రస్థానంలో ఆహ్వానించదగ్గ పరిణామం. తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వానికే ఓటర్లు పెద్దపీట వేస్తారని మళ్లీ రుజువైంది. జయలలిత లేకపోయినా అన్నాడీఎంకే మంచి ఫలితాలను సాధించింది కానీ, ఇండిపెండెంట్‌గా పోటీ చేయకుండా, బీజేపీ మద్దతు తీసుకోవడం ఆ పార్టీకి ప్రమాదఘంటిక అని చెప్పవచ్చు. తాజా ఫలితాల్లో అన్నాడీఎంకే కారణంగా 3.66 శాతం ఉన్న బీజేపీ ఓటు..11.24 శాతానికి పెరిగింది అంటేనే బీజేపీ అడుగేమిటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ కోసం చేసిన మాదిరిగానే, తమిళనాడులో అన్నాడీఎంకే కోసం..పార్టీ కోసం పనిచేస్తున్న అన్నామలైని బీజేపీ పక్కకు తప్పించింది.
ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కొద్దోగొప్పో మిగిలింది తెలుగు, తమిళ రాష్ర్టాల్లోనే. ఈ రెండు రాష్ర్టాల్లో ప్రాంతీయ చైతన్యం గొప్పది. కనీసం ఇక్కడైనా ఆ అస్తిత్వ చైతన్యాన్ని కాపాడుకుంటారా? లేదా, జాతీయ పార్టీల మాయలో పడి..మాయమైపోతాయా? బీజేపీ ఎత్తుగడను అర్థం చేసుకోలేక కాంగ్రెస్ వేస్తున్న తప్పటడుగులు..ఒక్కో రాష్ట్రంలో బీజేపీకి రాచబాట పరుస్తూ పోతున్నాయి. అన్నింటికీ మించి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ గుప్పిట్లోంచి బయటపడి తమ కండ్లకు కప్పుకొన్న పొరలు విప్పుకొని, తమ ప్రాంతీయ అస్తిత్వాలను నిలబెట్టుకుంటాయా?
– కోవెల సంతోష్ కుమార్