నక్సలైట్ ఉద్యమం ఇటీవల తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటుండగా, అగ్రస్థాయి నాయకులు ఒక్కొక్కరుగా ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ పరిణామాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. అందులో పౌరహక్కుల సంఘం వారి వ్యాఖ్యలు కొంత ప్రత్యేకంగా, విచిత్రమైన తర్కంతో కనిపిస్తున్నాయి. అవేమిటో ముందుగా చెప్పుకొని తక్కిన చర్చలోకి తర్వాత వెళ్దాం.
ఇటీవలి లొంగుబాట్లలో మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావుల చర్యలు పెద్ద సంచలనాలను సృష్టించాయి. వారిద్దరు కొన్ని దశాబ్దాల పాటు అజ్ఞాతవాసంలో ఉండి సాయుధ విప్లవ పోరాటం సాగించినవారు. అనేక కష్టనష్టాలకు గురైనవారు. ఇంతకాలం అణచివేతలను ఎదుర్కొన్నవారు. ఇప్పుడు కొన్ని కారణాలు చెప్తూ అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇటువంటి లొంగుబాట్లు ఇది మొదటిసారి కాదు. వార్తలను బట్టి చూడగా ఇంకా కొనసాగవచ్చునని తోస్తున్నది. 55 సంవత్సరాల నక్సలైట్ ఉద్యమం పలు దశలకు లోనైంది. అనేక ఎత్తుపల్లాలున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న పరిణామాలు మరొక దశ. ఈ మొత్తం 55 సంవత్సరాల క్రమానికి కారణాలేమిటి, ఉద్యమ భవిష్యత్తు ఏమి కావచ్చును అనేది జాగ్రత్తగా, లోతుగా జరగవలసిన పరిశీలన.
ఆ ప్రశ్నలు అట్లుండగా, ప్రస్తుత పరిణామాలపై పౌరహక్కుల సంఘం వారి ధోరణి ఒక అదనపు అంశంగా చర్చనీయం అవుతున్నది. మల్లోజుల, తక్కళ్లపల్లిని వారు ‘ద్రోహు’లన్నారు. అదే ధోరణిలో మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకు మల్లోజుల నుంచి స్పందన ఉన్నట్లు లేదు కానీ, తక్కళ్లపల్లి ఒక వీడియోలో కొన్ని మాటలన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
1. పౌరహక్కుల వారి కార్యరంగం, పరిధి ఏమిటి? వారు ఆ పరిధి దాటి మాట్లాడుతున్నారు. 2. పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడే హక్కు, అధికారం, బాధ్యత, వారికెక్కడిది? 3.ఉద్యమంలో, పార్టీలో ఎప్పటినుంచో చోటుచేసుకుంటూ వస్తున్న లోపాలు, బలహీనతల కారణంగా పరిస్థితి ఇంతవరకు వచ్చింది. అంతే తప్ప అకస్మాత్తుగా జరుగుతున్నది కాదు. 4. ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన అణచివేతను తట్టుకొని నిలువగల శక్తి పార్టీకి లేదు. 5. ఆ దృష్ట్యా పోరాట విరమణను ప్రకటించటమా, లేక లొంగిపోవటమా అనే చర్చ పార్టీలో కొంతకాలంగా సాగుతూ వస్తున్నది. పార్టీ ముఖ్య నేతలు, వివిధ స్థాయి కమిటీల నుంచి వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏకాభిప్రాయమనేది అంతిమరూపంలో ఇంకా రాలేదు. కానీ, అటువంటి అనిశ్చితి కొనసాగుతున్నందున, తమ స్థాయిలో తాము ఒక నిర్ణయం తీసుకున్నాము. 6. అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి ఆయుధాలను వదిలేసినా, తమ విప్లవ భావాలను వదలలేదు. ముందుగా కార్యకర్తల ప్రాణాలు కాపాడుకుంటే భవిష్యత్తులో చేయవలసిన కార్యాచరణ ఏమిటో తామంతా కలిసి చర్చించుకుంటాము. 7.పౌరహక్కుల వారు హైదరాబాద్లో కూర్చొని ఏదో మాట్లాడుతుంటారు. రాయగలరు గనుక రాస్తుంటారు. వారికి పోరాటంలోని వాస్తవ పరిస్థితులు తెలియవు.
తక్కళ్లపల్లి మాటలకు ప్రతిగా పౌరహక్కుల సంఘం వారన్నది, 1.కోట్లాది మంది ప్రజలు ఆశలు పెట్టుకున్నారు గనుక, పోరాట విరమణ చేయకూడదు. 2. అట్లా చేసేవారు ద్రోహులు. 3. ఒకవేళ లొంగినా ఆయుధాలను పార్టీకి అప్పగించాలి తప్ప ప్రభుత్వానికి కాదు. 4. లొంగినవారు ప్రభుత్వ ప్రలోభాల వల్లనే ఆ పనిచేశారు. 5.రాగల కాలంలో ఏమీ చేసేదీ ఎందుకు వెంటనే చెప్పలేదు. 6.తీవ్రమైన అణచివేత, ప్రాణనష్టాలు నిజమే. ఉద్యమంలో లోపాలు నిజమే. అయినా పోరాటం కొనసాగించాలి. 7. తాము తమ పరిధినేమీ దాటడం లేదు.
రెండు వైపుల నుంచి వినవస్తున్న మాటలు ఇట్లుండగా, ఉమ్మడి ఏపీ కాలం నుంచి గల పౌరహక్కుల ఉద్యమాన్ని ఒకసారి చూద్దాం. నక్సలైట్ ఉద్యమం ఎంతకాలంగా ఉన్నదో పౌరహక్కుల ఉద్యమం కూడా ఇంచుమించు అంతకాలంగా ఉన్నది. ఇందులో మనకు స్థూలంగా మూడు దశలు, ధోరణులు కనిపిస్తాయి. మొదటిదశలోని సంఘాలకు ప్రజల సమస్యల కారణంగా నక్సలైట్ ఉద్యమం పట్ల చాలా సానుభూతి ఉండేది. కొందరికి ఏకీభావాలు కూడా ఉండేవి. మొత్తంమీద ఆ సంఘాలన్నీ అటు ప్రజలపై, ఇటు నక్సలైట్లపై ప్రభుత్వ అణచివేతను వ్యతిరేకించేవి. బూటకపు ఎన్కౌంటర్లు అనే వాటిపై నిజ నిర్ధారణ కమిటీలు వేయటం, నివేదికల ప్రకటన, కోర్టులలో కేసుల దాఖలు, శవాలకు పోస్టుమార్టం ఆదేశాల సాధన, విప్లవకారులపై చర్యలు అయినా రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి మాత్రమే ఉండాలనే వాదన మొదలైనవి చేసేవి. వీటి ప్రభావం సమాజంపై చాలానే ఉండేది. సమాజం నుంచి, కోర్టుల నుంచి ప్రభుత్వం తగినంత ఒత్తిడికి గురై, తరచూ ఆత్మరక్షణలో పడేది. ఆ స్థితిలో ప్రభుత్వం, పోలీసులూ ఈ సంస్థలను నక్సలైట్ అనుకూలురని ఆరోపించేవి. నక్సలైట్ల హింస పౌరహక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించేవి. అందుకు వారి సమాధానం, తాము అనుకూలురమో, వ్యతిరేకులమో కాదని, ప్రజల సమస్యల దృష్ట్యా తాము ఉద్యమిస్తున్నామని, చట్టబద్ధంగా పాలించగలమంటూ ఏర్పడిన ప్రభుత్వాలు అందుకనుగుణంగా వ్యవహరించాలన్నది మాత్రమే తమ వాదన అని చెప్పేవి.
పౌరహక్కుల ఉద్యమంలో ఇది మొదటి దశ కాగా, రెండవది బాలగోపాల్తో మొదలైంది. ఆయన, రాజ్యహింస అయినా, నక్సలైట్ల హింస అయినా అందుకు బాధితులు సామాన్యులు అయినప్పుడు వ్యతిరేకించదగ్గవే అని సూత్రీకరించారు. నక్సలైట్ల నిర్హేతుక హింస వల్ల కలుగుతున్న నష్టాలను వివరించారు. ఉద్యమంతో పాటు సాధారణ పౌరహక్కులపై కూడా దృష్టిపెట్టాలన్నారు. ఆ సూత్రీకరణలు సరైనవని భావించిన పలువురు పౌరహక్కుల కార్యకర్తలు ఆయన ప్రారంభించిన కొత్త హక్కుల సంఘంలో చేరారు. ఆ సంఘం బాలగోపాల్
మరణం తర్వాత ఇప్పటికీ అవే సూత్రాల ప్రకారం పనిచేస్తున్నది.
పౌరహక్కుల ఉద్యమంలో ఇది మొదటి దశ కాగా, రెండవది బాలగోపాల్తో మొదలైంది. ఆయన, రాజ్యహింస అయినా, నక్సలైట్ల హింస అయినా అందుకు బాధితులు సామాన్యులు అయినప్పుడు వ్యతిరేకించదగ్గవే అని సూత్రీకరించారు. నక్సలైట్ల నిర్హేతుక హింస వల్ల కలుగుతున్న నష్టాలను వివరించారు. ఉద్యమంతో పాటు సాధారణ పౌరహక్కులపై కూడా దృష్టిపెట్టాలన్నారు. ఆ సూత్రీకరణలు సరైనవని భావించిన పలువురు పౌరహక్కుల కార్యకర్తలు ఆయన ప్రారంభించిన కొత్త హక్కుల సంఘంలో చేరారు. ఆ సంఘం బాలగోపాల్ మరణం తర్వాత ఇప్పటికీ అవే సూత్రాల ప్రకారం పనిచేస్తున్నది.
ఈ రెండు దశల వెనుక ఇప్పుడు మూడవ దశను చూస్తున్నాము. యథాతథంగా పౌరహక్కుల ఉద్యమం మూడవ దశలోకి ప్రవేశించిందా అన్నది చర్చించవలసిన విషయం. కానీ, మొదటి దశ ఉ ద్యమం ఒక కొత్త ధోరణిలోకి ప్రవేశిస్తున్నదని మాత్రం చెప్పవచ్చు. అది, ఆ కాలంలో లేనివిధంగా సాయుధ పోరాటాన్ని నక్సలైట్లను ప్రత్యక్షమైన రీతిలో, నేరుగా బలపర్చటం. అది తక్కళ్లపల్లి వాసుదేవరావు, మల్లోజుల లొంగుబాట్లకు ప్రతిగా, తక్కళ్లపల్లి వీడియోకు స్పందనగా వారి వ్యాఖ్యలలో స్పష్టంగా కనిపిస్తున్నది. పౌరహక్కుల ఉద్యమం మొదటిదశలో ఉద్యమం పట్ల ప్రగాఢమైన సానుభూతి గలవారు, ఏకీభావం సైతం కలవారు చాలామందే ఉండిరి. కానీ వారంతా, ‘పౌరహక్కులు’ అనే నిర్వచన పరిధికి లోబడి మాత్రమే వ్యవహరించారు.
అంతకుమించి మాట్లాడలేదు. సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, లొంగిపోయినవారిని ద్రోహులనడం, ఆయుధాల గురించి మాట్లాడటం, సాయుధ పోరాటంపై కోట్లాది మంది ప్రజలు ఆశలు పెట్టుకునే ఉన్నారనటం వంటివి ఎప్పుడూ వినరాలేదు. ఈ మూడవ ధోరణిలో అంతా భిన్నంగా ఉంది. ఆ విధంగా వారు చేస్తున్నది ఏమిటి? పౌరహక్కుల వారిపై ప్రభుత్వం, పోలీసులు మొదటిదశలో ఏ విమర్శలైతే చేయగా వాటిని వారు అప్పుడు నిరాకరించారో, ఆ విమర్శలు సరైనవేనన్న విధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. అందువల్ల హక్కుల సిద్ధాంతానికి సూత్రరీత్యా గాని, ఆ ఉద్యమానికి ఆచరణ రీత్యా గాని కలిగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక నష్టాల గురించి వారు ఏమి ఆలోచించారో తెలియదు. వారికి ఇతరత్రా కూడా ఏమి అవగాహనలున్నాయో బోధపడటం లేదు.
లొంగుబాట్ల గురించి ఇతర విప్లవకారులు ‘ద్రోహులు’ వగైరా భాషను ఉపయోగించినా, ఇతర వ్యాఖ్యలు చేసినా అది వారి సైద్ధాంతిక అవగాహన, ఉద్యమ అవగాహన అయినందున ఇతరులు ఆక్షేపించదగింది లేదు. ఆ చర్చ ఆయా విప్లవ వర్గాల మధ్య జరుగుతుంది. ఇరువురి చర్యలను గమనించి పరిస్థితులను అర్థం చేసుకోవడం బయటి సమాజం చేసే పని. కానీ, పౌరహక్కుల వారిలో ఇటువంటి కొత్త ధోరణి అన్నది గతంలో ఎప్పుడూ లేని ఒక విచిత్రమైన తర్కంగా కనిపిస్తున్నది.
అనేకానేక త్యాగాలతో కొన్ని దశాబ్దాల పాటు సాగుతున్న ఒక ఉద్యమంలో, ఇటువం టి దశ ఒకటి, ఇంతపెద్ద ఎత్తున వస్తున్నదంటే, దానివెనుక ఎంతకాలంగా ఎన్నెన్ని పరిణామాలు చోటుచేసుకొని ఉండాలి. అదేమీ ఆలోచించక, కేవలం వ్యక్తులను, హక్కుల వారు కేవలం తమ ఆదర్శాత్మక నిర్దేశాల ప్రకారం చెప్పేవాటిని అనుగుణంగా విప్లవకారులు పనిచేయటం లేదని, తాము మాత్రం హైదరాబాద్లో నీడపట్టున గడుపుతూ నిందించటం చెప్తున్నదేమిటి? ఇది ఏ విధంగా చూసినా వారి పౌరహక్కుల కార్యపరిధిని దాటి వ్యవహరించడమే. తమ ఈ కొత్త ధోరణితో వారు తమ విశ్వసనీయతకు గత యాభై ఏండ్లుగా లేని నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
– టంకశాల అశోక్