‘అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక‘ అన్నారు ప్రజాకవి కాళోజీ. ఇప్పుడు సిరా చుక్క కంటే మైకుల బలం ఎక్కువైంది. అంటే ప్రింట్ మీడియాను మించి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రజలను బాగా కదిలిస్తున్నాయి. అవి మరింత ప్రభావవంతంగా జనంలోకి పోతున్నాయి. ప్రశ్న ప్రగతికి బాటలు వేస్తున్నది..కానీ అదేమిటో ప్రశ్న అంటే పాలకులకు గిట్టదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నకు తావులేకుండా పోతున్నది. నాడు ప్రశ్నించినందుకు, ప్రశ్నించమని బోధించినందుకు సోక్రటీస్ మహాశయుడికి విషమిచ్చి చంపారు. మత విశ్వాసాలను ప్రశ్నించినందుకు, తప్పు అని నిరూపించినందుకు అనేకమంది శాస్త్రవేత్తలు శిక్ష అనుభవించారు. అది రాచయుగాలనాటి మాట. మరి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదనుకుంటున్న ఈ రోజుల్లోనూ అదే పరిస్థితి నెలకొనటం దుర్మార్గం.
ప్రొఫెసర్ నాగేశ్వర్ పాత్రికేయ వృత్తిలో తలపండిన విశ్లేషకుడు, విమర్శకుడు. గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్ విశ్లేషించారు. దానిపై కూటమి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చినందుకు ఆయన క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కానీ నాగేశ్వర్‌ను అరెస్టు చేయటానికి ఇంటి ఆయన ఇంటి వద్దకు ఆంధ్ర పోలీసులు రావటం అవసరం లేదేమో. ఆయన తన వద్దనున్న సమాచారంతో విశ్లేషించారు. అందుకు అరెస్ట్ చేయాలా? జైల్లో వేయాలా? రాజకీయ విశ్లేషణలు ఎప్పుడూ అందరికీ నచ్చవు. క్షమాపణ చెప్పి, వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా అరెస్టుకు హడావుడి చేయటం కక్షసాధింపు ధోరణిగానే కనబడుతున్నది.
కేంద్రం పెంచిన పెట్రో ధరలకు నిరసనగా జగిత్యాల జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. జగిత్యాల ఆర్టీసీ డిపో డ్రైవర్ అశోక్ బస్సు నడుపుతూ వెళ్తుండగా ధర్నాలో కూర్చున్న తన మిత్రుడితో యథాలాపంగా ‘ముందు ధాన్యం, మక్కలు కొనండి.. తర్వాత ధర్నాలు చేయవచ్చు’ అని పలికిన మాటలు కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారాయి. ఆ వీడియో జగిత్యాల డిపో మేనేజర్‌కు వాట్సాప్ ద్వారా చేరటంతో, వెనువెంటనే అశోక్‌ను విధుల నుంచి తప్పించారు. డ్రైవర్ ప్రభుత్వాన్నేమీ ప్రశ్నించలేదు, నిలదీయలేదు. అకాల వర్షాలు పడి ధాన్యం పాడైపోతున్నందున ముందుగా కాంటాలు వేసి ధాన్యం కొనుగోలు చేపట్టాలని సలహా ఇచ్చాడు.
అందుకు చాలా పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. ఆర్టీసీ యాజమాన్యం చాలా చురుకుగా వ్యవహరించింది. ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు, యూనియన్ల నుంచి వచ్చిన నిరసనలు, ఒత్తిడికి తలొగ్గిన యాజమాన్యం చివరకు ఆ చర్యను ఉపసంహరించుకున్నది. మంత్రి కల్పించుకొని డ్రైవర్ అశోక్ అద్దె బస్సుల్లో పనిచేస్తున్నాడని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇంత రచ్చనా? సలహా స్వీకరించే సహృదయం అధికార పార్టీ నేతలకు లేదా?
అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ల కొనుగోళ్ల విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినందుకు బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంటే అవినీతిని ప్రశ్నించకూడదా? ఎందుకంత భయపడి జైలుకు పంపారు? విచారణకు ఆదేశించవచ్చు కదా! రాష్ట్రంలోని 38,310 మంది అంగన్వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ఫోన్లు కొనుక్కోమని కేంద్రమంత్రి రూ.54 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 4జీ ఫోన్లను కొని అంగన్వాడీలకు అందజేసింది. ఈ అంశంపై ప్రశ్నించినందుకు చెప్పుతో కొడతానని అనటం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకే చెల్లింది. అంటే ప్రశ్నిస్తే చెప్పుతో సమాధానం చెప్తారా?
ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛలో ప్రథమ స్థానంలో ఉన్న నార్వేను మన ప్రధాని మోదీ గతవారం సందర్శించారు. అక్కడి ప్రముఖ జర్నలిస్టు ఒకరు ప్రశ్నించగా ఆయనేమీ పట్టించుకోకుండా వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. పలు విమర్శలు, వివాదాలకు దారితీసింది. ప్రధాని మోదీ పుష్కరకాలంగా మీడియాకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సహజంగానే కొందరు పాలకులకు ప్రశ్నించే వారంటే సహించలేని లక్షణం ఉంటుంది.
మోదీ కూడా ఆ క కోవకు చెందినవారే. ఇక తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ గురించి ఎంత తక్కువగా మాట్లాకుంటే అంత మంచిది. విమర్శలను పాలకులు జీర్ణించుకోవటంలేదు. తమ విధానాలను ప్రశ్నించిన, విమర్శించిన సోషల్ మీడియా యూజర్లు, యూట్యూబర్లను అరెస్ట్ చేయిస్తున్నారు. విమర్శలు, విశ్లేషణలు మీడియాలో భాగం. కానీ కేసులు పెట్టటం, అరెస్టు చేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. నాలుగవ స్తంభం పునాదులు పెకిలించినా, బీటలు వారినా ప్రజాస్వామ్య సౌధం ప్రమాదంలో పడుతుంది. పాలకులు ఈ విషయం గుర్తించాలి.
– శ్రీ శ్రీ కుమార్