అభివృద్ధిలో అంగలు వేస్తున్న హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలువాల్సిన మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సంక్షోభంలో చిక్కుకుని పట్టాలు తప్పుతున్నది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ సీఎం రేవంత్‌రెడ్డి మొదలుపెట్టిన స్వాధీన ప్రహసనంతో అవస్థలు పడుతున్నది. ఒకరకంగా చెప్పాలంటే త్రిశంకుస్వర్గంలో వేలాడుతున్నది. సీఎం దుందుడుకు, దుస్సాహసిక నిర్ణయాలే ఇందుకు తార్కాణం. సర్కార్ వైఖరితో విసిగిపోయిన ఎల్ అండ్ టీ కాడి పడేసేందుకు సిద్ధమైంది. రెండో దశ విస్తరణ మాటేమోగానీ మొదటి దశను నడపడం తన వల్ల కాదంటూ చేతులెత్తేసింది. దాంతో పాలక ప్రభుత్వమే మెట్రోను స్వాధీనం చేసుకుంటుందని రేవంత్ అనాలోచితంగా ప్రకటించడం అందర్నీ విస్మయపరిచింది.
ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో మొదలుపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం ఉన్నపళంగా చేపట్టాల్సిన అవసరం ఏమిటి? అనేది ప్రశ్న. పైగా స్వాధీనానికి పరిహారంగా రూ.13,538 కోట్లు ఎల్ అండ్ టీకి చెల్లించాలని, అదీ అప్పుచేసి ఇవ్వాలనుకోవడం భావ్యమా? అనేది మరో ప్రశ్న. మెట్రో పరిధిలోని వేల కోట్ల ఆస్తుల పందేరం కోసమే ఈ తతంగానికి తెరతీశారని ఆరోపణ ఉన్నది.
ఆశ బారెడు ఉండొచ్చు. అయితే అందుకు తగ్గ ఆచరణ లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. మెట్రో రైల్ విషయంలో అదే జరిగింది. మెట్రోకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ఒప్పందమైతే చేసుకున్నది. కానీ అందుకు అవసరమైన అప్పును సాధించడంలో దారుణంగా విఫలమైంది. ఆస్తుల మదింపు, లాభనష్టాల బేరీజు లేకుండానే భారత రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) రుణం కోసం దరఖాస్తు చేస్తే అది కాస్తా తిరస్కరణకు గురైంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్లే రుణం ఆగిపోయిందని రుసరుసలాడటం, మీ చేతకానితనం వల్లే రుణం మంజూరు కాలేదని ఆయన ఎదురు దాడికి దిగడం ఓ ప్రహసనం.
ఇంత జరిగాక అదే కిషన్‌రెడ్డిని వెంటపెట్టుకుని ఢిల్లీకి వెళ్లి రుణం కోసం సీఎం పైరవీలు చేయడం విడ్డూరం. స్వరాష్ట్ర సాధన నాటికి మెట్రో పనులు మొదలై నత్తనడక నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు వేగం పుంజుకొని 2017లో మెట్రోరైల్ పట్టాలెక్కింది. మెట్రో విస్తరణకు కేసీఆర్ హయాంలోనే పునాదులు పడ్డాయి. కొవిడ్ కాలంలో సంస్థ ఎదుర్కొన్న నష్టాలను తగ్గించేందుకు గత సర్కార్ రూ.100 కోట్ల సాయం కూడా ప్రకటించింది.
మొదటి దశను సజావుగా కొనసాగనిస్తూ, రెండో దశకు సిద్ధం కావాల్సిన తరుణంలో మొత్తమంతా తలకిందులు చేస్తూ సర్కార్ స్వాధీనానికి రేవంత్ ఒంటెత్తు పోకడలతో పరుగులు పెట్టారు. ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అనేట్టుగా రుణం రాకపోవడంతో బోల్తాపడ్డారు. ఇంతకూ రుణం ఎప్పుడొస్తుందో తెలియదు గానీ ఈలోగా బ్యాంకుకు నెలనెలా వడ్డీ కట్టక తప్పని పరిస్థితి. అదికాస్తా తడిసి మోపెడవుతున్నది. ఈనెల15 నాటికి సర్కార్ రూ.130 కోట్లు మిత్తీ రూపంలో చెల్లించాల్సి వచ్చింది.
తనకు చెందాల్సిన భూమిని సర్కార్ వేలం వేసిందని అంటూ కోర్టుకు వెళ్లినందుకు ఎస్బీఐ మీద సీఎం నిర్హేతుకంగా కక్షగట్టారు. సర్కార్ ఖాతాలన్నీ ఉపసంహరించుకుని ప్రతీకారం తీర్చుకోబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ క్యాప్స్‌కు తాజాగా మదింపు బాధ్యతను అప్పగించాల్సి రావడం వైపరీత్యం. కొత్తగా జరిపే మదింపులో సంస్థ విలువ తగ్గినట్టుగా తేలితే ప్రభుత్వం ఎల్ అండ్ టీతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమవుతుంది? ఇదివరకు ఐడీబీఐకి చెల్లించిన కన్సల్టెన్సీ ఫీజు బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్‌కు మళ్లీ ఫీజు చెల్లించాల్సి వస్తున్నది.
అట్టహాసంగా మొదలుపెట్టిన స్వాధీనం కాస్తా ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్ల చిక్కుల్లో పడి దిక్కులు చూస్తున్నది. ముందుచూపు లేకుండా రుణం కోసం వెళ్లడం కాంగ్రెస్ సర్కార్ అసమర్థ నిర్వహణకు నిలువెత్తు నిదర్శనం. స్వాధీనత పేరిట జరిగిన కుప్పిగంతుల పుణ్యమా అని ఇప్పుడు మెట్రో భవిత ఊగిసలాటలో పడింది. అందుకు రేవంత్ బాధ్యత వహిస్తారా?