‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ర్టాలు దూకుడుగా వెళ్తున్నాయి. మరోవైపు మల్లోజుల వేణుగోపాల్‌రావు, తక్కళ్లపల్లి వాసుదేవరావు లాంటి కీలక నేతలు ‘సాయుధ పోరాట పంథా’ను వీడి, ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు మల్లోజుల వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ డీజీపీకి తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలను అప్పగించారు. వీరితోపాటు దాదాపు 350 మంది సాయుధ పోరాటానికి స్వస్తి పలికారు. దీనిపై అగ్రనేతల లొంగుబాటని, జనజీవన స్రవంతిలో కలవడమని, విప్లవ ద్రోహమని ఎవరికి వారు తమ దృక్పథాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా మావోయిస్టులు లేదా ఇతర విప్లవ పార్టీల నక్సలైట్లు లొంగిపోయినప్పుడు కనిపించే దృశ్యాలకు భిన్నంగా ఈసారి సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. లొంగుబాట్ల సందర్భాల్లో పోలీసు అధికారులు కుర్చీల్లో కూర్చొని, లొంగిపోయిన నక్సలైట్లను వారి వెనుక నిలబెట్టుకొని మీడియా సమావేశాలు నిర్వహించడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ, ఇందుకు భిన్నంగా మల్లోజుల బృందం యూనిఫామ్‌తో వేదిక మీదకు వచ్చి ముఖ్యమంత్రికి ఆయుధాన్ని అప్పగించడం, చిరునవ్వులు చిందిస్తూ సీఎంతో కరచాలనం చేయడం, వారికి ఫడణవీస్ భారత రాజ్యాంగ ప్రతిని అందజేయడం ఈసారి ప్రత్యేకం. లొంగిపోతున్న ప్రతి నక్సలైట్ నాయకుడితో ప్రభుత్వాలు, పోలీసులు.. ఇంతే ‘మర్యాద’గా ఎందుకు వ్యవహరించడం లేదన్నది ఆసక్తికర ప్రశ్న. అంతెందుకు.. మల్లోజుల ఎపిసోడ్‌కి, తక్కళ్లపల్లి ఎపిసోడ్‌కి మధ్య కూడా తేడా కనిపించింది. మల్లోజుల ఆయుధాల అప్పగింత కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాగా, తక్కళ్లపల్లి కార్యక్రమానికి డీజీపీ మాత్రమే వచ్చారు.
అయితే, మహారాష్ట్ర ప్రభుత్వాధినేత నుంచి ‘మర్యాద’ పొందిన మల్లోజుల, తక్కళ్లపల్లి తదితరులు మావోయిస్టు శిబిరం నుంచి తీవ్ర విమర్శలే ఎదుర్కొంటున్నారు. వారిని విప్లవ ద్రోహులుగానూ, అడవికి పట్టిన చెదగానూ, ప్రాణభయంతో శత్రువుకు లొంగిపోయిన పిరికివాళ్లుగానూ మావోయిస్టు శిబిరం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ‘ప్రజల రక్తమాంసాలతో, చెమట చుక్కలతో సమకూర్చుకున్న ఆయుధాలను శత్రువుకు అప్పగించే అధికారం, హక్కు మీకెక్కడిది?’ అని ప్రశ్నిస్తున్నది. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా, తగిన శిక్ష విధించాలని విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నది. 2011 నుంచి దండకారణ్యంలో విప్లవోద్యమం గడ్డుస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మల్లోజులలో వ్యక్తివాదం, అహంభావం, తీవ్రమైన పెత్తందారీతనం (బ్యూరోక్రసీ) వంటి అన్యవర్గ ధోరణులు పేరుకుపోయాయని, ఆయనలోని సుఖలాలస, స్వార్థం, ప్రాణభీతి ఈ లొంగుబాటుకు దారితీశాయని అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. 2020 డిసెంబర్లో కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రవేశపెట్టిన స్వీయాత్మక విశ్లేషణతో కూడిన పత్రాన్ని తిరస్కరించినట్టు వెల్లడించింది. ఇన్నాళ్లూ తమకు మార్గదర్శిగా ఉన్న నాయకుడు ‘పంథా’ మార్చుకుంటే దానిని జీర్ణించుకోలేని వారి నుంచి విమర్శలు రావడం సహజమే.
నాడు పీపుల్స్‌వార్, నేడు మావోయిస్టు పార్టీ విస్తరణలో, కీలక యాక్షన్స్‌లో ప్రముఖ పాత్ర పోషించిన మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు, వారి అనుచరులు ప్రాణభయంతో లొంగిపోయారా? విప్లవద్రోహం, నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా? అనేది భవిష్యత్తులో వారి ప్రవర్తన, నడవడిక నిగ్గు తేలుస్తాయి.
నిజానికి, ‘ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, సాయుధ పోరాట పంథాను వీడి, జనజీవన స్రవంతిలో కలుద్దాం’ అంటూ మల్లోజుల చేసిన ప్రతిపాదనను పార్టీ ఆమోదించి ఉంటే.. పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. మల్లోజుల ఆకాంక్షించిన విధంగా, ప్రభుత్వంతో చర్చలు జరిగి, పార్టీ మొత్తంగా అరణ్యవాసం వీడి బయటకు వచ్చి ఉంటే.. నిస్సందేహంగా భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేది. ఇప్పుడు మల్లోజుల, తక్కెళ్లపల్లి తదితరులను తప్పుపడుతున్న వారిలో చాలామంది దానిని ‘చారిత్రక సంఘటన’, ‘వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సమయ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం’, ‘రేపటి యుద్ధం కోసం ఇవాళ చేసుకున్న శాంతి ఒప్పందం’.. ఇలా రకరరాలుగా అభివర్ణించి ఉండేవారేమో!
మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎట్లా గడపబోతున్నారు? ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకో, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవితం గడుపుతారా? ఇంతకాలం తాము పోరాడిన గడ్చిరోలిలోనే సహజ వనరుల తవ్వకాలు జరుపుతున్న ‘లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ’ కంపెనీ ఇస్తామంటున్న ఉద్యోగ ఆఫర్‌ను స్వీకరిస్తారా? మాజీ నక్సలైట్, మంత్రి సీతక్క మాదిరిగా పాలక పార్టీల్లో చేరతారా? నయీం మాదిరిగా సెటిల్మెంట్లు, భూదందాలు చేస్తా రా? లేకపోతే ‘నవ సమాజ స్థాపన’ అనే లక్ష్యానికి కట్టుబడి ఇతర పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా? మరో కమ్యూనిస్టు పార్టీకి పురుడుపోస్తారా? అలా చేస్తే.. ప్రభుత్వాలు, పోలీసులు ఇదే ‘మర్యాద’ను కొనసాగిస్తా యా? భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన స్పష్టత కాని, ఏకాభిప్రాయం కాని వివిధ రాష్ర్టా ల్లో, వివిధ తేదీల్లో బృందాలుగా వెళ్లి ఆయుధా లు అప్పగించిన వివిధ స్థాయి నేతల మధ్య ఉన్నదా? ఇన్ని రకాల సందేహాలు వ్యక్తంకావడానికి కారణం.. గతంలో లొంగిపోయినవారు ఆ తర్వాత ఆచరిస్తున్న
గతంలో చాలామంది పలు కారణాల వల్ల లొంగుబాటు మార్గా న్ని ఎంచుకున్నారు. కానీ, ఈసారి సైద్ధాంతిక విబేధాలతో బయటకు వస్తున్నారు. అదీ ఒకరిద్దరు వ్యక్తులుగా కాకుండా ప్రాంత కమిటీలవారీగా, బృందాలవారీగా ప్రభుత్వానికి ఆయుధాలను అప్పగిస్తున్నారు. అజ్ఞాత జీవితం వీడి బయటకు రావాలని ఇతర సహచరులకూ పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాన్ని ‘సాధారణ లొంగుబాటు’గానో, ‘విప్లవద్రోహం’గానో పరిగణించడం, వారిని శత్రుపూరిత వైఖరితో నిం దించడం సబబు కాదు.
వీరంతా కొన్ని దశాబ్దాలుగా తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, కష్టాలకు ఓర్చుకొని ప్రజల కోసం పనిచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పంథా వల్ల లాభం లేదనుకొని బయటకు వస్తున్నామన్నారు. ఒకసారి రహస్య జీవితంలోకి, సాయుధ పోరాట మార్గంలోకి వెళ్లినవారు అమరులయ్యే దాకా అదే దారిలో వెళ్లాలని కోరుకోవడం సమర్థనీయం కాదు. ఇప్పుడు రహస్య జీవితం, సాయుధ పోరాట మార్గం విడనాడి, ఆయుధాలు అప్పగించినవారు రేపటి నుంచి ఎలా జీవించబోతున్నారనేది సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.
– కందిబండ కృష్ణప్రసాద్ 91827 77010