జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ- కొత్త జిల్లాగా ఏర్పడిన సంతోషం ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నది. దీనికి తోడు పరిపాలనా కార్యాలయ భవన సముదాయం జగిత్యాలకు కొత్త చిహ్నంగా ఠీవి గొలుపుతూ రూపుదిద్దుకుంది. కొత్త వైద్యకళాశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ప్రవాసంలో ఉన్న నాలాంటి జగిత్యాల బిడ్డలకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జనసందోహం చూసినప్పుడు హృదయం ఉప్పొంగడం సహజం. కేసీఆర్ ప్రసంగం వినే కొద్దీ పాత జ్జాపకాలు, కొత్త సంబురాలు మెదడులో ముసురుతూనే ఉన్నాయి. ఒకటా రెండా- ఒక మనిషంతటి ఆవేదన, ఒక జీవితమంతటి అనుభవాలు, ఒక జాతి యావత్తూ మరిచిపోలేని అనుభూతులు.
మా నాన్న గుర్రాల చంద్రయ్య ఆర్టీసీల పని చేస్తుండే , అమ్మ సులోచన గృహిణి. సాధారణ కుటుంబం మాది. నాన్న డ్రైవర్ కనుక ఆర్టీసీ అయినా ప్రైవేటు సర్వీసైనా డ్రైవర్లే ఎక్కువగా దోస్తులు. వారి కుటుంబాల మధ్య విడదీయలేని అనుబంధాలు, ఆప్యాయతలు. నా జ్ఞాపకాలకు ఈ నేపథ్యమే పునాది. మా నాన్న ఆర్టీసీల దోస్తులు అన్ని మతాల వాళ్ళు ఉంటుండె. అందరం పెద్ళోళ్ళు, పిల్లలం కలిసి మెలిసి ఉండేది. పండగలకు, పబ్బాలకు మేము పోతుండే, వాళ్ళు వస్తుండె. ఇగ్బాల్ భాయ్ అని మా నాన్న దోస్తు… రంజాన్ పండగకు వాళ్ల ఇంటికి పోతుంటిమి. అన్ని రకాల భోజనం, ఖీర్ తిని ఆలయ్ బలయ్ ఇచ్చుకొని వద్దుము. క్రిస్టియన్ దోస్తులు… వాళ్ళ పండగకు పోయేటోల్లం. వాళ్ళు మా ఇంటికి పండగలకు వచ్చేటోళ్లు.
జగిత్యాలలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ ఉండేవి. అక్కడికి చేరుకోవడం నాకు అలవాటు. కొత్త బస్సు స్టాండ్ పక్కనే రోజూ పది పన్నెండు గంటల మధ్య కనబడే దృశ్యాలు నేను జీవితాంతం మరిచిపోలేనేమో! ఆ ప్రాంతం జనంతో కిటకిటలాడుతుంటుంది. అవి బొంబాయి పొయ్యే బస్సులు. బొంబాయి పోవాలన్నా, గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనుకున్నా ఆ బస్సులు ఎక్కాల్సిందే. ఇంటి మగాయన బస్సులో ఉంటడు. బయట కుటుంబ సభ్యులు ఉంటారు. కొందరు ఏడుస్తుంటారు… కొందరు కొంగు ముఖానికి అడ్డం పెట్టుకొని దుఃఖిస్తుంటారు. పొయ్యేటోడిని బుగులు పెట్టుడు ఎందుకని కొందరు దుఃఖాన్ని కడుపులోకి దిగమింగుకుంటూ ఉంటరు. ఉన్న ఊళ్ల పూట గడువదు. బతుకుదెరువు లేదు. ఇక మిగిలిందల్లా ఎక్కడో ఒకాడికి బతక పోవడమే. ఇంటి కాడ అప్పులు చేసి, బతుకును పణంగా పెట్టుకొని అదృష్టాన్ని పరీక్షించుకోవడం. తాము కష్టాల కొలిమిలో కుమిలి పోయినా, కుటుంబం గట్టెక్కుతుందన్న ఒక ఆశ! దేశం గాని దేశంలో చచ్చిపోతే మృతదేహాన్ని తెచ్చుకునే పరిస్థితి కూడా ఉండదు. బస్సులో కూచున్న వారి భయాలు వారి కండ్లల్లో కనిపిస్తుంటాయి. అయినా భార్యాపిల్లలకు ధైర్యం చెబుతుంటారు. తెలంగాణ దైన్యానికి మాతో సంబంధం లేని కారణాలున్నాయనేది తెలువని అమాయకత్వం మాది. బతకడమంటే గదే అనుకునే రోజులవి. (ఇక నక్సలైట్లు, ఎన్కౌంటర్లు, పల్లెల్లో బీభత్సం మరో బాధామయ గాథ)
పిల్లల్ని ఎట్లయినా బాగా చదివించాలె- ఇది మా నాన్న డ్రైవర్ చంద్రయ్య పట్టుదల. మేం ఉండేది కాకుండా ఇంకొక ఇల్లుండేది. పిల్లల చదువుల కోసం ఆ ఇల్లు కూడా అమ్మిండు. నాకున్నదంతా పెడుతా.. యేమైనా సరే… పిల్లల జీవితాలు మాత్రం బాగుపడాలె.. అనుకునేది. కష్టపడి పిల్లల్ని చదివించిండు. నాకు అంతా ఆటాపాటగా ఉండేది. ఇప్పటి మాదిరిగా పోటీలు పడి చదువడం తెలువదు. గురుకులంలో సీటు రావడం జీవితంలో మలుపు. అదొక రకం జీవితం. గురుకులంలో కూడా రాత్రి కరెంటు పోయేది. చీకటయ్యేలోపే చదువుకోవాలె. కరెంటు పోగానే పిల్లలం గ్రౌండ్లోకి చేరుకునేవాళ్ళం. అక్కడ పిల్లలు పాటలు పాడుతుండేది. తెల్లారితే పరీక్ష ఉన్నా సరే, చీకట్లో పాటల కచేరీలు సాగేవి! మాకు కష్టమేదో, సుఖమేదో తెలువదు. మేం ఇబ్బంది పడుతున్నామనేది కూడా తెలువదు.
పెద్దాపూర్ గురుకులంలో చదువుకునేటప్పుడు (5 వ తరగతిల) మాకు దగ్గర్నే నిండుగా పారుతున్న కెనాల్ చూస్తుంటిమి. ఆ కెనాల్లనే ఈత నేర్చుకున్న. వినాయకుడిని సాగనంపటానికి పెద్ద కెనాల్ పోతుంటిమి. 10 వ తరగతికి వచ్చేసరికి పెద్ద కెనాల్ పూర్తిగా పారినట్టు చూడాలె. వినాయక నిమజ్జనం చేయడానికి కూడా నీళ్ళు లేకుండె. ఇన్ని నీళ్ళు జల్లి అయిపోయిందనిపించేది.బహిరంగ సభలో కేసీఆర్ మాటలకు జనం కేరింతలు వినబడుతున్నయి. నా మనసులో పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.
నా చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైంది. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ మరిచిపోలేను. చదువు పూర్తయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక స్థాయికి వచ్చిన. దక్షిణాఫ్రికాకు వచ్చి ఇక్కడ స్థిరపడిన. అయినా తెలంగాణ యాది మరువలే. ఉద్యమం ప్రతి దశలో ఏ దేశంలో ఉన్నా ఇక్కడి జనంతో మమేకమయినం. కేసీఆర్ నిరాహార దీక్ష. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే మాట. మమ్మల్ని వెంటాడేది. తెలంగాణ వాడినని ధైర్యంగా చెప్పుకోలేని రోజులవి. తెలంగాణ వచ్చిన తరువాత మూడు సార్లు జగిత్యాల పోయిన. జగిత్యాల వాళ్ళం ఏ దేశంలో ఉన్నా మాట్లాడుకుంటనే ఉంటం. జగిత్యాల అభివృద్ధి గురించే మా సంభాషణలు సాగుతుంటయి. మా బడికి కూడా పోయి చూసిన. ఇప్పుడు కేసీఆర్ గురుకులాలను పెంచుడు ఎంతో సంతోషమనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత తపన పడుతరో మాకు తెలుసు. రాత్రిపూట కూడా చదువుకోవచ్చు. మా బడి దగ్గరి కెనాల్ల మళ్ల నీళ్ళు పారుతున్నయి. చిన్నప్పుడు ఈతలు కొట్టుడు, వినాయక నిమజ్జనాలు.. అన్నీ గుర్తుకొస్తున్నయి. కేటీఆర్ ప్రసంగాలు పిల్లలకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చేవిగా ఉంటాయి. మన పిల్లలకు అట్లా చెప్పెటోళ్ళుండాలె. పొలాలకు నీళ్ళొస్తున్నయి. ఇప్పుడు బొంబాయి, దుబాయి పోతెనే బతుకుడనే బాధలు లేవు. బొంబాయి బస్సులన్నీ మామూలు టూరిస్టు బస్సులుగా మారినట్టు తెలిసింది.
నా పిల్లలను జగిత్యాలకు తీసుకువచ్చినప్పుడు నాకు కలిగే ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఏ దేశంలో ఉన్నా నా విశ్రాంత జీవితం గడిపేది మా జగిత్యాలలోనే. తెలంగాణ తెచ్చుకున్నం, అభివృద్ధి చేసుకుంటున్నం. ఇంత సంబురంలోనూ ఏదో గుబులుగా ఉన్నది. విద్వేష రాజకీయాలు మన దేశాన్ని ఎటు తీసుకుపోతయనే భయం ఉన్నది. దేశాన్ని కాపాడాలనేది కేసీఆర్ పట్టుదల. సాధారణంగా నాయకుల ప్రసంగాలు విని మరిచిపోతుంటం. కానీ కేసీఆర్ చెప్పినట్టు బహిరంగ సభ నుంచి ఎవరి ఊరికి వారు పోయిన తరువాత ఆయన చెప్పిన మాటల గురించి చర్చించుకోవాలె. మనం ఎట్లా అభివృద్ధి సాధిస్తున్నమో తెలుసుకోవాలె. మత రాజకీయాల ప్రమాదాన్ని గ్రహించాలె. చర్చించుకున్నప్పుడే నిజాలు బయటికి వస్తయి. కలిసిమెలిసి ఉండే సామరస్య సంస్కృతి మనది. సామరస్యం, శాంతి లేకపోతే అభివృద్ధి ఉండదు. కేసీఆర్ సూచించినట్టు మేధావులంతా మత విద్వేషాల రాజకీయాలను తిప్పికొట్టడం ఎట్లా అనేది చర్చించాలె.
– గుర్రాల నాగరాజు(దక్షిణాఫ్రికా నుంచి..)