దేశ వనరులను కాపాడాల్సిన బాధ్యత కేవలం ఆదివాసులదే కాదు, మిగతా వారిపై కూడా ఉంది. సహజ వనరులను కాపాడే క్రమంలో ఆదివాసీల జీవితాలు బలవుతున్నాయి. బీర్సాముండా, గుండాదర్, కుమ్రం భీం పోరాట ఫలితంగా రాజ్యాంగంలో ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ 1/70, 1996 పేసా, 2006 అటవీ హక్కుల చట్టాలు రూపుదిద్దుకున్నాయి. ఆదివాసీల అభ్యున్నతే వీటి లక్ష్యం. కానీ, పాలకులు ఆ చట్టాలను అమలు చేయడం లేదు.
Adivasis | కొద్ది నెలలుగా మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల మీద పెద్దఎత్తున అణచివేత కొనసాగుతున్నది. ఆదివాసీ గూడెంల సమీపంలో వందలాది పోలీసు క్యాంపులను ఏర్పాటు చేసి వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు. మూలవాసీ బచావో మంచ్ నాయకుడు రఘు మాటల్లో ఈ దేశ వనరులను కాపాడేందుకు ఆదివాసులు చేస్తున్న పోరాటాన్ని మిగతా సమాజం పట్టించుకోవడం లేదు. ఇది ఆదివాసీలకు సంబంధించిన సమస్యగా అందరూ చూస్తున్నారు. 1980 నుంచి మావోయిస్టులు ఆదివాసీ సమాజంలోకి, దండకారణ్యంలోకి ప్రవేశించి అక్కడ జరిగే అమానుషం, ఫారెస్టు వాళ్ల దోపిడీలను అరికట్టడం కోసం కృషి చేశారు. కానీ, 1993లో ప్రత్యేక చట్టం వచ్చాక దండకారణ్యంలోని కోట్లాది విలువైన వనరులపై కార్పొరేట్లు, సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారుల కన్నుపడింది.
వనరుల దోపిడీకి ఆదివాసుల భూములను ఆక్రమించేందుకు నాటి నుంచి నేటి వరకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆదివాసీలకు మావోయిస్టులు మద్దతుగా ఉన్నందుకే 2005లో సల్వాజుడుం మారణ హోమాన్ని సృష్టించారు. ఐదేండ్లలో మూడు వేల గ్రామాలను దగ్ధం చేశారు. 450 మందిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ క్రమంలోనే ఎర్రబోరు, డోర్నపాలు, కుంట ప్రాంతాల్లో సల్వాజుడుం బేస్ క్యాంప్‌లుగా మార్చి ఒక్కొక్క క్యాంపులో 50 వేలకు పైగా ఆదివాసీలను నిర్బంధించిన స్థితిని మనందరం చూశాం. చివరికి ప్రొఫెసర్ నందిని సుందర్ పోరాటం, జస్టిస్ సుదర్శన్ తీర్పు కారణంగా సల్వాజుడుం రద్దయిందేమో కానీ, దాని మరొక రూపం డీఆర్జీ నేటికీ వేటాడుతూనే ఉన్నది.
ఆదివాసీల నిర్బంధంపై మాట్లాడినందుకు సునీత పొట్టం అనే ఆదివాసీ, మూలవాసీ బచావో మంచ్ నాయకురాలిని బలవంతంగా అరెస్టు చేశారు. అదేవిధంగా 2021 నుంచి సిలింగేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాయుధ బలగాల క్యాంపులకు వ్యతిరేకంగా మూలవాసీ బచావో మంచ్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆదివాసులందరూ మావోయిస్టులేననే దుర్మార్గమైన ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తున్నది. ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లు, ఆదివాసీల నిర్బంధంపై మాట్లాడుతున్న హక్కుల నేతలను సైతం పోలీసులు బెదిరిస్తున్నారు. ఆదివాసీల సమస్యల గురించి ఎవరూ మాట్లాడొద్దా?
ఇదే విధంగా సోనిసూరీ అనే ఆదివాసీ హక్కుల కార్యకర్తను నిర్బంధించారు. చనిపోయిన భర్తను చూసేందుకు కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతను అణచివేస్తున్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కగార్ మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఆదివాసీల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల దోపిడీకి సహకరిస్తున్నాయి. ప్రభుత్వాలే దళారీగా మారి పెట్టుబడిదారులకు సహజ వనరులను అప్పగించడం దారుణం.
2009లో మావోయిస్టు పార్టీ దేశానికి ప్రమాదకరమని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. చెప్పినట్టే ఏకపక్ష దాడులకు దిగారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సాయుధ బలగాలు మధ్యభారతంలోకి ప్రవేశించాయి. అదే ఇప్పుడు ఆపరేషన్ కగార్గా మారింది. ఇప్పుడు దంతెవాడ, బస్తర్ ప్రాంతాలతో పాటు బీజాపూర్ జిల్లా కూడా ఇనుప ఖనిజపు పుట్టినిల్లుగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఇనుప ఖనిజ నిల్వలను వెలికితీసేందుకు ఒక స్టీల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం 2005లో ఒప్పందం కుదుర్చుకున్నది. దానికి తోడు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిల్వలను వెలికితీసేందుకు పనిచేస్తున్నది. కంపెనీలతో జరిగిన ఒప్పందాల వల్లనే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతున్నది. తద్వారా ప్రజలను చంపైనా సరే వనరులను అప్పగించాలనే స్థితికి ప్రభుత్వాలు చేరిపోయాయి.
ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తున్నందున వాటిని అణచివేసేందుకు అనేక రకాల ఆపరేషన్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆదివాసీ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్, 2017లో ఆపరేషన్ సమాధాన్, నేడు ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీల హత్యాకాండ కొనసాగుతున్నది. వేలాది మంది ఆదివాసీలు ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఏడాది జనవరి 1న బీజాపూర్ జిల్లా ముగ్ధుం గ్రామానికి చెందిన 6 నెలల సోడి మంగ్లీతో మొదలైన హత్యాకాండ 275కు చేరింది. తెలంగాణలోనూ సెప్టెంబర్ 5న రఘునాథపాలెంలో ఏడుగురిని హతమార్చారు. డిసెంబర్ 1న ఆరుగురికి విషం పెట్టి మరీ కాల్చిచంపారు. కనీసం ఆ మరణాలపై సత్యశోధన చేయడానికి కూడా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లేదు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నిషేధిత ప్రాంతంగా మారిపోయింది. హక్కుల సంఘాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఎమర్జెన్సీ కాలంలోనూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదు. అందుకే ప్రజలు స్పందించాలని కురుసం శంకర్, రఘు లాంటి మేధావులు కోరుతున్నారు.
ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ అణచివేతలు ఎన్నడికీ విజయవంతం కావు. తెలంగాణ ఉద్యమమే అందుకు నిదర్శనం. మావోయిస్టుల సాకుతో ఆదివాసీలను నిర్బంధిస్తే ఉద్యమాలు ఆగవు. ప్రజాస్వామిక పోరాటాలను నిషేధించిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించవు. పాలించే నైతిక హక్కును పాలకులు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. మూలవాసీ బచావో మంచ్‌పై నిషేధం ఎత్తివేయాలి. మరీ ముఖ్యంగా ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
ఆదివాసీలపై చేస్తున్న హత్యాకాండ పట్ల ప్రజల నుంచి మద్దతు దక్కని పక్షంలోనే ప్రభుత్వాలు అత్యంత దారుణంగా నరమేధాన్ని సృష్టిస్తాయి. ఈ విధానాన్ని మనమంతా ఖండించాలి. దేశ మూలవాసులైన ఆదివాసుల జీవించే హక్కును కాపాడుదాం. ఆపరేషన్ కగార్, ఆదివాసీ హననానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం.
– నారాయణరావు