తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. హింస పెట్రేగిపోతున్నది. నేరాల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. మూడు సంవత్సరాల్లో (20232025) సుమారు 6.76 లక్షల నేరాలు నమోదయ్యాయి. 2024లో నేరాల సంఖ్య 2023తో పోలిస్తే పెరిగింది. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు తెలంగాణలో ఆందోళనకరంగా ఉన్నాయి.
2023లో 2.13 లక్షల కేసులు నమోదైతే, 2024లో 2.34 లక్షల కేసులు నమోదయ్యాయి. 2025లోనూ సుమారు 2.29 లక్షల కేసులు నమోదయ్యాయి. గత రెండున్నర సంవత్సరాల్లో 2,200కు పైగా హత్యలు, 2,100కు పైగా అత్యాచారాలు, మహిళలపై నేరాలు 58,678కు పైగా, సైబర్ నేరాలు 50,236, మహిళల కిడ్నాప్/అపహరణ కేసులు 5,152కు పైగా, బాలికలపై అత్యాచారాలు 4,458కు పైగా జరిగినట్టు రికార్డులను బట్టి తెలుస్తున్నది. మహిళలపై నేరాల రేటులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సైబ ర్ నేరాల్లో రెండో స్థానంలో ఉన్నది.
పోలీసుల మెతక వైఖరి కారణంగా ఇటీవల ఘోరాలు సంభవిస్తున్నాయి. పట్టపగలు ప్రజలు చూస్తుండగానే దారుణంగా హత్యలు చేయడం, పోలీసుల సమక్షంలోనే భార్యలను భర్తలు నరికి చంపడం, అక్రమ సంబంధాలు, ప్రేమ మైకంలో భార్యలు భర్తలను, భర్తలను భార్యలు అంతమొందించడం లాంటివే అందుకు నిదర్శనం. పోలీసులనే హత మారుస్తూ, దాడులు చేసి గాయపరుస్తున్న ఘటనలు చూస్తే పోలీసులకే రక్షణ కరువైందని స్పష్టం అవుతున్నది.
మే 8 వ తేదీన పదవీ విరమణ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సతీమణిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిజామాబాద్‌లో ఒక సీసీఎస్ కానిస్టేబుల్ని ఒక నేరస్థుడు హత్య చేసిన ఘటన హల్చల్ సృష్టించింది. జగద్గిరిగుట్ట హత్య కేసు నిందితుడిని పట్టుకునే సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో దాడి జరిగింది. ఉప్పల్ బందోబస్తు డ్యూటీలో ఉన్న ఒక ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై గుంపు దాడి చేసి కాలర్ పట్టుకుని కొట్టడం వల్ల ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల ఘర్షణలో అడ్డు వచ్చారని ఒక కానిస్టేబుల్‌పై దాడిచేసి గాయపరిచారు.
హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతంలో మే 8వ తేదీన జరిగిన బీటెక్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన పెను సంచలనంగా మారింది. హైదరాబాద్ నడిమధ్యన, జనం, పోలీసులు చూస్తుండగానే హత్యలు చేసిన రౌడీలు కత్తులు, గొడ్డళ్లు గాలిలో ఊపుతూ వికటాట్టహాసం చేస్తూ పారిపోయిన ఉదంతాలు ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యం, అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ఘరానారౌడీలు, గూండాలు రెచ్చిపోతున్నారు.
రాష్ర్టంలో రకరకాల అవినీతికి పాల్పడుతూ పట్టుబడిన పోలీసు సిబ్బంది, అధికారుల గురించి రోజూ వార్తలు వెలువడటం చూస్తున్నాం. క్రమం తప్పకుండా పోలీసులపై అవినీతి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు రాష్టంలో రౌడీషీటర్లు, గ్యాంగ్‌లు చేసిన దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, భూదందాలు, బెదిరింపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలువురు రౌడీషీటర్లు భూవివాదాలు, కాంట్రాక్ట్ సెటిల్మెంట్లు, ఫైనాన్స్ వసూళ్లలో పాల్గొన్నట్టు కేసులు నమోదయ్యాయి. వరంగల్‌లో గ్యాంగ్‌ల మధ్య గొడవలు, కత్తులదాడి ఘటనలు చోటు చేసుకొన్నాయి. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో భూకబ్జా, బెదిరింపుల కేసుల్లో రౌడీషీటర్లు అరెస్టయ్యారు.
గత రెండున్నర సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా ఇబ్బడిముబ్బడిగా జరిగాయి. 55,837 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 18,200 మంది మరణించారు. 45,423 పైగా గాయపడ్డారు. 2024, 2025లో ప్రమాదాల సంఖ్య 2023తో పోలిస్తే సుమారు 13 శాతం పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో జాతీయ రహదారులు, వాహనాల రద్దీ, పట్టణీకరణ కారణంగా ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
– ఎం.నారాయణ స్వామి