ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించినట్టు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ఆ కీర్తికాంతుల్లో దర్జాగా ఓలలాడాలి. కానీ, అలా జరగడం లేదు. అందుకు విరుద్ధంగా రోజు విడిచి రోజు పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి గురించి గుండెలు బాదుకుంటూ ఆవేశపూరిత ప్రసంగాలు ఎందుకు చేస్తున్నట్టు? మోదీ ఉపయోగిస్తున్న వైవిధ్యభరితమైన భాష అనాలోచితమైందిగా భావించడానికి వీల్లేదు. 32 దేశాలకు ఏడు అఖిలపక్ష ప్రతినిధివర్గాలతో దౌత్య రాయబారాలు పంపించిన తర్వాత అం దుకు భిన్నంగా ఈ ఆవేశకావేశాలు ఏమిటా? అని విస్మయం కలుగుతున్నది. మోదీ దూకుడు ను ప్రపంచ నేతలు సానుకూలంగా తీసుకోరు. అదేవిధంగా జైషే మహమ్మద్, లష్కరే తోయి బా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వ డం ద్వారా భారత్‌పై పాక్ యుద్ధం జరుపుతున్నదనే సందేశానికి తోడ్పాటునూ అందించరు.
మోదీ వాగాడంబరం స్థానిక ఒత్తిళ్లతో స్వదేశీ ప్రజల కోసం ఉద్దేశించినట్టుగా కనిపిస్తున్నది. ఇంతకూ ఏమిటవి? టీవీలకు, పత్రికలకు పతా క శీర్షికలు సమకూర్చాలనే దుగ్ధ కారణమా? ఆయన ఉపయోగిస్తున్న సినీ ఫక్కీ డైలాగుల కొత్తదనం పదేపదే ఉపయోగించే రొడ్డకొట్టుడు ప్రసంగాలు చేసే రాజకీయ నాయకుల కంటే మోదీని భిన్నంగా నిలబెడుతున్నది. ప్రతి ప్రసంగంలో ఆయన కథనాన్ని మార్చి మీడియాకు రోజుకో పతాక శీర్షికను సమకూరుస్తున్నారు. కీలకమైన బీహార్ ఎన్నికల్లో బీజేపీని ఏకైక అతిపెద్ద పార్టీగా గెలిపించాలన్న ఉద్దేశంతో మోదీ అలా మాట్లాడుతున్నారనేది మరో వివరణ. కీలకం ఎందుకంటే, జనతాదళ్ (యునైటెడ్) నేత నితీశ్‌కుమార్‌కు రాష్ర్టానికి మరో విడత సారథ్యం వహించే శారీరక, మానసిక క్షమత ఎంతమాత్రం లేనట్టుగా కనిపిస్తుండటం. ఏదేమైనప్పటికీ, బీహార్ ఎన్నికలు మాత్రం కుల సమీకరణాల ఆధారంగా జరుగుతాయి. కాబట్టి, మోదీ చేస్తున్న గుండెలు బాదుకునే ప్రసంగాలు ప్రధానంగా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నవి కాకపోవచ్చు.
పాకిస్థాన్‌పై సైనిక చర్య ప్రారంభించిన భారత్.. పీవోకేను చేజిక్కించుకోలేదని మితవాదవర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. భారత రక్ష ణ దళాలు విజయం సాధిస్తున్నాయని, పాక్ రక్షణ వ్యవస్థలను బద్దలు కొడుతున్నాయని మే 7-10 వరకు మీడియా సమావేశాల్లో ప్రభు త్వం చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో హఠాత్తు గా కాల్పుల విరమణకు అంగీకరించడం వారిని విస్మయానికి గురిచేసింది. కాల్పుల విరమణ అనేది పాకిస్థాన్ బెదిరిపోయి అడిగినందుకా లేక ట్రంప్ బెదిరింపులు, వాణిజ్య ప్రోత్సాహకాల కోసమా? అనే వివరణలతో వారికి నిమిత్తం లేదు. ఉన్నపళంగా యుద్ధాన్ని ఆపివేయడం వారికి నచ్చలేదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ సైనిక, రాజకీయ వ్యూహం గురించి తన మద్దతుదారులను ఒప్పించేందుకు తగిన బహిరంగ వైఖరిని మోదీ రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సైనిక చర్య కొనసాగుతుందని ఆయన ఇస్తున్న హామీ రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని, ఉద్రిక్తతలను పెంచుతుంది. ఆయన మద్దతుదారులు కోరుకునేది అదే. అందుకే ‘సిందూర్’కు ఇప్పటికీ కొనసాగుతున్న మిలిటరీ ఆపరేషన్‌గానే ముద్రవేస్తున్నారు. చర్య కొనసాగుతున్నదని, దీర్ఘకాలిక యుద్ధం జరుగుతున్నదని భరోసా ఇస్తే మద్దతుదారుల్లో మోదీ తరహా దుందుడుకు నాయకత్వ శైలికి ప్రాసంగికత, ఆవశ్యకత ఉన్నాయన్న నమ్మకం ఏర్పడుతుంది. పార్లమెంటులో గుచ్చిగుచ్చి అడిగే ప్రశ్నలను తప్పించుకునేందుకు ‘కొనసాగుతున్న ఆపరేషన్’ వెనుక దాక్కునేందుకు వీలు కలుగుతుంది.
మితవాద మద్దతుదారుల వంటి వారి నుంచి వచ్చే స్వదేశీ ఒత్తిళ్లు రెండు దేశాల మధ్య మరో విడత సైనిక ఘర్షణకు దారితీస్తుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఈ నేపథ్యంలో ఈ దుందుడుకు మాటలు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చి, శత్రుత్వాన్ని పెంచి, ఉద్రిక్తతలకు ఆజ్యం పోయకుండా చూడాల్సి ఉంది. ఎందుకంటే పహల్గాం పాకిస్థాన్‌లో లేదు.