ఒకరి భాష ఒకరు నేర్చుకున్నారే కానీ, ఎదుటివారి భాషను అవమానపరచటం వంటి అనాగరిక చేష్టలు ఎవరూ చేయలేదు. అందుకే, తెలంగాణ వైవిధ్యాల ప్రపంచం అయింది మొదటినుంచీ. పరభాషల మీద ఇటువంటి గౌరవం చూపించబట్టే 15 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ఒక పీవీ నరసింహారావు, 5 భాషల్లో పాండిత్యం ఉన్న ఒక సదాశివ తెలంగాణలో మాత్రమే వెలిశారు. కానీ, ఆంధ్రవారు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచీ వైవిధ్యాన్ని వైరుధ్యంగా మార్చారు. దానికీ ఒక బలమైన కారణం ఉంది. ఆంధ్ర ప్రాంతం భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన ఇంగ్లిషువారి కింద నాలుగు వందల ఏండ్ల బానిసత్వాన్ని అనుభవించింది. పైగా వారికి రెండే భాషలు తెలుసు.
పాలకుల భాష, పాలితుల భాష. అంటే అధికార భాష, బానిసత్వ భాష. అందుకే వారికి రెండు వైవిధ్యాల మధ్య సమానత్వం ఉండాలన్న భావన ఉండదు. పై అధికారికి చెప్పులు కడుగుతారు, కిందవారిని కాళ్ల కింద అణచివేస్తారు. అటువంటి సంస్కృతి తెలంగాణలో లేదు. కాబట్టే, ఈ ప్రాంతంలో అన్ని భాషలు, సంస్కృతులు ఆదరణ పొందాయి. ఎంతోమంది తెలుగుతో పాటు సంస్కృతంలో పాండిత్యం ఉండి రచనలు చేసినవారు, మల్లినాథసూరి వంటి భాషా దిగ్గజాలు గౌరవం పొందారు. తన రచనలను ఆదరించిన ఒక ముస్లిం రాజుకి హిందూ కవి ‘మల్కిభ రాముడు’ అన్న బిరుదు ఇవ్వటం భాషా సంస్కారం ఉన్న తెలు గు నేలలోనే సాధ్యం!
దాదాపు ఒక శతాబ్ద కాలం ఒకరికి ఒకరు తెలిసి, అర్ధ శతాబ్దం కలిసి ఒక రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణవారికి పదాల, జాతీయాల విషయంలో వివాదాలు రావటం చూస్తున్నాం. ఒకసారి శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విపక్ష నేత చంద్రబాబుని ‘తాట వలుస్తా’ అన్నాడు. ఆంధ్ర, రాయలసీమ నేతలకు ఆ మాట తప్పనిపించలేదు, అది ఆ ప్రాంతాల్లో సహజంగా వాడే భాష గనుక. అదే ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎవరినీ ఉద్దేశించి కాకుండా జనాంతికంగా ‘నాలుక కోస్తారు’ అనగానే ఆంధ్ర నాయకులలో ప్రకంపనలు మొదలయ్యాయి.
నిజానికి తెలంగాణలో చాలా సహజంగా వాడే పదం అది! నిష్పాక్షికంగా ఆలోచిస్తే నాలుక కోసినా మనిషి బతుకుతాడు, తాట (చర్మం) వలిస్తే బతుకుతాడా? తెలంగాణ జాతీయమే తక్కువ ప్రమాదకరం కదా! అయినా భాష అర్థం కానప్పుడు ఇలాగే సమస్యలు వస్తాయి. రెండూ వేరు భాషలు కదా!
తెలంగాణ ప్రాంతంవారు ఆడపిల్లని పుట్టింటికి ‘తోలుకొస్తాం’ అంటే ఆంధ్రావారు ఎక్కిరిస్తారు. ‘మేం పశువులని మాత్రమే తోలుకొస్తాం, పుట్టింటికి ఆడపిల్లని ‘తీసుకొస్తాం” అని వేళాకోళం చేస్తారు. అది వింటే తెలంగాణ వారికి నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక శవాన్ని మాత్రమే ‘తీసుకొస్తాం’ అని వ్యవహరిస్తారు, బతికి ఉన్నవాళ్లని కాదు! దీనికి చక్కటి ఉదాహరణ ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో ఉంది. ‘సార్ రాయుడు వచ్చాడు’ అని సెక్రెటరీ చెప్పగానే, విలన్ రావుగోపాలరావు అడుగుతాడు. ‘వచ్చాడా, తీసుకొచ్చావా?’ అని. అంటే బతికి ఉన్నాడా, లేడా? అని అర్థం అన్నమాట! అంటే ఒక్క పదం కూడా రెండు ప్రాంతాల వారి మధ్య చిచ్చుపెట్టగలిగినంత వేరు భాషలు తెలుగు, ఆంధ్రం! తెలంగాణవారి మారుమూల పల్లెల్లో ఉన్న భూములు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు కబ్జా చేయగలరేమో కానీ, శ్రీకాకుళం నుంచో, కడప నుంచో వెళ్లినవారికి తెలంగాణవారి స్వచ్ఛమైన తెలుగు భాష అర్థం చేసుకోవటం మాత్రం సాధ్యం కాదు. ఒకే అక్షరాలున్న ఇంగ్లిషు, ఫ్రెంచ్, జర్మన్ లాగే ఆంధ్రం, తెలుగు వర్ణమాల ఒకటే కలిగి ఉంటాయి. కానీ, పూర్తి వేరు భాషలు. ‘వచ్చింది’ అన్నది స్త్రీ లింగానికి వాడినప్పుడు ‘వచ్చిండు’ అన్నదే సరైనది కదా, ‘వచ్చాడు’ ఎక్కడినుంచి వచ్చిండు?’ అని అడిగాడు ఒక తెలంగాణ భాషావేత్త ఒకసారి.
తెలుగు అన్న పదాన్ని మొట్టమొదటగా శంకరంబాడి సుందరాచారి అన్న కవి తన పాటలో లాలిత్యం కోసం తస్కరించి ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ సృష్టించాడు. అప్పుడు తెలుగువాళ్లంతా నిజాం ప్రభుత్వంలో (1942) వేరే దేశంగా ఉండటంతో వారికి ఈ భాషా కబ్జా సంగతి తెలియదు. 1956 తర్వాత ఆ మల్లెపూదండ నిజమైన తెలుగువారి మెడలో ఉరితాడై బిగిసింది. 1969 ఉద్యమం తర్వాత ఆంధ్ర రాజకీయ నాయకులకు తెలంగాణ విడిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే ఎన్టీ రామారావు తన పార్టీకి ‘తెలుగు దేశం’ అని పేరు పెట్టుకున్నాడు తెలివిగా! నిజానికి ప్రస్తుతం ఆ పార్టీ తెలుగుదేశం కాదు, ఆంధ్రదేశం కాదు, చంద్రదేశం! ఎందుకంటే 9 ఏండ్లు రాష్ట్రం విడిపోయాక ఇంకో ఐదేండ్లు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు ఆంధ్రకు, తెలంగాణకు ఎవరికీ ఏమీ మంచి చెయ్యలేదు. తొమ్మిదేండ్లలో హైదరాబాద్‌ను నిర్మించా నని డప్పు కొట్టుకునే ఆయన ఆంధ్ర ప్రాంతంలో అటువంటి ఇంకొక్క నగరాన్ని 14 ఏండ్లలో కూడా నిర్మించలేకపోయాడు.
ఈ భాషా వైవిధ్యాన్ని గౌరవించలేని ఆంధ్ర వారు వైరుధ్యాలు మాత్రం సృష్టించగలిగారు. భావ సమైక్యత సాధించలేనివారు ఇతర ప్రాంతాల్లో ఉండటానికి తగరు. రేపు అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిస్తే, కాలిఫోర్నియా రాష్ర్టాన్ని ఆంధ్ర రాష్ట్రంగా ప్రకటించాలని అక్కడి ఆంధ్ర ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేసినా ఆశ్చర్యం లేదు, చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించినట్టు. తమవి కాని వేరే ప్రాంతాలకు వలసవెళ్లినవారు వినయంగా ఉండాలి కానీ, విజయులమని భ్రమపడకూడదు.