2018, ఫాల్గుణ మాసం.. కోడికూత జాము. పాలమూరు బస్సెక్కి తెలకపల్లికి పయనం గట్టిన. పల్లెలు, పంట పొలాల నిండా పొగమంచు పరుచుకున్నది. కండ్లు పొడుచుకొని చూసినా పల్లేదో.. పంట పొలమేదో కనిపించనంత దట్టంగా మంచు పట్టింది. చెట్టు, చేమ, గడ్డి, గాదం, తీగలు ప్రకృతి ప్రతి మూల రూపాల మీద మంచు బిందువుల పెత్తనం సాగుతున్నది. సంకలు లేపితే చలి ఈడ్సి తంతున్నది. చేతులు దగ్గరికి ముడ్సుకొని బస్సు సీట్లోనే అడ్డమొరిగి కండ్లు మూసుకుంటే.. జ్ఞాపకాల దొంతరలు తెరలుగా తెరలుగా మదిలో మెదులుతున్నయి.
2015, దూరాడి మాసం. సదాశివనగర్, పాత చెరువు. నాటి సీఎం కేసీఆర్ మైక్ అందుకున్నడు. ‘కాకతీయ రెడ్డి రాజులకు దండం పెట్టుకొ ని కొబ్బరికాయ కొట్టిన. నాడు పిడికెడంత మం దితోనే మొండి ధైర్యంతో ముందుకుపోయినం. చావు నోట్లో తలబెట్టి రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. మనందరం మల్లోసారి పిడికిలి పట్టాలె. మన చెరువును మనమే బాగుజేసుకోవాలె. గ్రహచా రం బాగుండి ఒక్క ఏడాది కాలమైతే మళ్లా మూడేండ్ల దాకా సూడకుండా పంటలు పండేట ట్టు మన చెరువులు బాగుజేసుకుందాం’ అని మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టిండు. ‘మా రాజ్యంపై దండెత్తి వచ్చే శత్రు రాజులారా! మమ్ముల్ని ఓడించి మా రాజ్యం గుంజుకున్నా సరే.. బురుజులు, కోటలు కూల్చినా సరే.. మనుషులను చంపినా సరే.. కానీ, మేము కట్టిన చెరువులను మాత్రం ధ్వంసం చేయకండి. అవి ప్రజలకు అన్నం పెట్టే జీవనాధారాలు’ అని కాకతీయుల శిలాశాసన విన్నపాన్ని గుర్తుచేస్తూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.
కాలం సాగిపోతున్నది.. అక్కెరపొర మాసం రానే వచ్చింది. అది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సభ. కేసీఆర్ ప్రసంగం.. “హరిహర బ్రహ్మాదులు దిగివచ్చినా, కోటి చంద్రబాబులు కొంగ జపాలు చేసినా, మీ కండ్ల ముందే పాలమూరు లిఫ్టు కట్టి తీరతాను. ఇదొక్కటే కాదు.. నీళ్ల మంత్రి హరీశ్‌రావు నా పక్కనే ఉన్నరు. వారికి కూడా చెప్తున్న. వచ్చే ఖరీఫ్ నాటి కి కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పాలమూ రు చెరువులను నింపుతాం. మీ పొలాలు పండేదాక మంత్రి హరీశ్ మీ ఎమ్మటే ఉంటరు.. మీకేదన్న కష్టమొస్తే నాకు చెప్తడు’ అని పాలమూరు రైతన్నలకు నాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాట ఇచ్చిండు.
కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, సీతారామసాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టు అనుమతుల కోసం కేసీఆర్ ఎక్కే గడప, దిగే గడపలకు లెక్కే లేదు. కాలచక్రం గిర్రున తిరిగింది.. మూడేండ్లు గడిచాయి. ఈ లెక్కన చూస్తే కృష్ణా జలాలు చెరువుల్లోకి మళ్లి, కల్వకుర్తి లిఫ్టు పరిధిలో ఉన్న తెలకపల్లి చెరువు కూడా నిండాలి కదా..! ఊరంచున పడావు పడిన భూములు ఈ పాటికి పచ్చబడాలి..! నా మనుసులోకి ఆ ప్రాం త ఆలోచనలు చొరబడ్డాయి. ఇదిగో ఈ ఆలోచనలతోనే పాలమూరు బస్సెక్కిన. తెలకపల్లితో నాది 18 ఏండ్ల అనుబంధం. ఊరంచునే పెద్ద చెరువు. పేరుకే పెద్దచెరువు కానీ, చుక్క నీళ్లు నిలబడింది లేదు. కంపదార చెట్లు, లొట్టపీసు పొదలతో నిండి ఉండేది.
బతుకమ్మ నిమజ్జనానికి తప్ప దానితో ఊరుకు ఉపయోగం లేదు. మేతకు దిక్కులేక సావుకు దగ్గరైన పశువుల చర్మం ఒలుచుకొని ఊరి చర్మకారులు జంతు కళేబరాలను, బరెంక బొక్కలను సేద్యం లేని భూముల్లోకి విసిరేసేవాళ్లు. వాటికోసం రాబందులు వచ్చి వాలేవి. రాబందులను దగ్గర నుంచి నేను చూసింది తెలకపల్లిలోనే. ఈ బీడుబడ్డ పంట భూముల నుంచి పశ్చిమంగా పరుగు దూరం పోతే ప్రజాకవి గోర టికి జన్మనిచ్చిన ఊరు గౌరారం. నాడూ, నేడూ గోరటి వెంకన్న సంచారజీవే. తెలకపల్లి ఊరంచు న ఈత తోపులుండేవి. స్వచ్ఛమైన కల్లు దొరికేది. అది తాగిన వెంకన్న గొంతు నుంచి జాలువారే రాగానికి సురులు, అసురులైనా వంత పాడాల్సిందే.
తెలంగాణను విస్మరించిన ఆంధ్రా పాలనలో కరువు ఆవరించి ఈతవనం ఎండిపోయింది. పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకున్నట్టు ప్రకటించిండు కానీ, రూపాయి ఖర్చుచేయలేదు. ఊరు వల్లకాడైంది. పాలమూరంతా చావు డేర యింది. రైతు ఆత్మహత్యలు, వృద్ధుల ఆకలిచావులకు అడ్డాగా మారింది. జనం వలసలు పోయిం డ్రు. ఈ గోస తట్టుకోకనే ‘పల్లే కన్నీరు పెడుతుందో’ అని గోరటి కన్నీరు మున్నీరుగా విలపించిన జ్ఞాపకాల తెరలకు అడ్డం పడుతూ… బస్ కండక్టర్ ‘రాకొండ.. రాకొండ’ అని కేక పెట్టిం డు. దిగ్గున మేల్క తట్టింది.. నలిసిన కండ్లు రాకొండ శివారులోని టప్పమర్రి కోసం వెతుకుతున్నయి. రెండు శతాబ్దాల కాలం నాటి మర్రి అది. వెనుకటి రోజుల్లో శ్రీశైలం వెళ్లే యోగులకు, సిద్ధులకు, బైరాగులకు ఆశ్రయమిచ్చిన మహావృక్షం. వరుస కరువులకు టప్పమర్రి తలవంచిం ది. దాని ఆనవాళ్ల పొడ జూసుకుంటా నాటి బీడు భూముల వైపు చూస్తే.. కనురెప్పలు వాల్చనియ్యని అద్భుత దృశ్యం.
కనులు నమ్మలేనంత ఆశ్చర్యం. మూడేండ్ల కింద కేసీఆర్ చెప్పిన ప్రతి మాటకు వాస్తవ రూపం. నాడు మృత కళేబరాల కోసం రాబందులు వాలిన నేలమీద జీవ వైవి ధ్యం పరిఢవిల్లుతున్న సదృశ్యం. తీరొక్క కొంగ జాతులు ఎగురుతున్న అద్భుతం కనిపించింది. పొదలు, తుప్పలు, కంపదారలేవీ కనిపించలేదు. వరి మళ్లతో ఎవుసం జోరు మీదుంది. వేసంగి కరిగట్టుకు మడులు దున్నుతున్నరు. బురద మట్టిలోంచి వచ్చే పురుగుల కోసం గుడ్డి కొంగలు ఒంటి కాలుమీద జపం చేస్తున్నయి. ఎరగారు కొంగలు.. ఆలేటి కొంగలు.. పెద్ద బూడిద కొం గలు.. నల్లకాళ్ల కొంగలు.. నలుపు రెక్కల కొంగ లు.. నల్ల మెడ కొంగలు.. నత్తగొట్టు కొంగలు.. తెల్లరెక్కల కొంగలు.. తెల్ల వంకర ముక్కు కొంగ లు.. పాముతల నీటి కాకులు గుంపులు పొలం మీదకు వచ్చి వాలుతున్నయి. రైతు అదిలిస్తే గాల్లోకి ఎగురుతున్నయి. అప్రయత్నంగానే పెద్ద చెరువు కట్టమీదికి మనుసు మళ్లింది. కట్టెక్కి చూస్తే.. నిండు గంగాళంగా మారిన సకల జీవకోటికి ఆదెరువు ఆ చెరువు.
60 ఏండ్ల దరిద్రాన్ని కడిగిపారేసి పచ్చబడ్డ తెలంగాణ ఆనవాళ్లకు పాలమూరు ఒక్కటి చాలు. నాడు కేసీఆర్ చెప్పినట్టే 2018 ఖరీఫ్ నాటికే కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1.6 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల ఎకరాలకు, భీమా నుంచి 1.4 లక్షల ఎకరాలకు, కోయిల్‌సాగర్ ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నరు. తొలి దశ మిషన్ కాకతీయతో 62,899 ఎకరాలకు, రెండో దశ కింద 94,309 ఎకరాలకు, మూడో దశ ద్వారా 65,840 ఎకరాలకు, ఆఖరి దశతో 45,2 89 ఎకరాల కలిపి చెరువు కింది 2.68 లక్షల ఎకరాలకు నీళ్లందినయి.
రాష్ట్రమంతటా రూ.9,155 కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జల పెరిగింది. ఆ బలంతో 15.05 లక్షల ఎకరాల్లో పచ్చదనం విచ్చుకున్న ది. కాళేశ్వరం, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానే రు, కడెం, సీతారామ, భక్తరామదాసు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టులకు రూపం పోసి 2022-23 నాటికి ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి ఏకంగా 1.22 కోట్ల ఎకరాలు సాగుకు అచ్చుగ ట్టి, 3.62 కోట్ల టన్నుల ధాన్యమిచ్చే ఆకుపచ్చ తెలంగాణకు హామీ ఇచ్చి కేసీఆర్ దిగిపోయారు.
కొత్త పాలకులు ఉన్న వనరులను పోతం జేసి అన్నదాతకు మరింత జవం ఇస్తారేమోననుకుం టే.. ఉన్న ప్రాజెక్టుల ఉసురు తీస్తున్నరు. ఆకుపచ్చ తెలంగాణపై కేసీఆర్ సంతకాన్ని చెరిపే విభ్రమకు తహతహలాడుతున్నరు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టింది. అటు గోదావరి మీది కాళేశ్వరం ఇటు కృష్ణా మీది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, కల్వకుర్తి ప్రాజెక్టులను పండబెట్టింది. ఏడాది కాపురం పదేండ్ల ఎన్కకుపోయింది. యాళ్ల తప్పి న కరెంటయ్యింది. చెరువులకు నీళ్లొస్తయని ఎదురుచూస్తుంటే.. కండ్లళ్ల నీళ్లొస్తున్నయి. ఎటుజూసి నా ఎండుగాలమే.. రైతు ఎవుసం గాసానికే ఎల్లేటట్టు లేదు. జూరాల, భీమా, నెట్టెంపాడు రన్నింగ్ ప్రాజెక్టులను క్లోజింగ్ ప్రాజెక్టులుగా మార్చేసిన్రు.
గతేడాది యాసంగిలో భీమా ప్రాజె క్టు కింది ఆయకట్టుకు ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించింది. మళ్లీ ఈ ఏడాది అదే పరిస్థితి. పాలమూరు ప్రాజెక్టు కింది వట్టెం రిజర్వాయర్ పంపు మోటర్లు మునిగిపోయినయి. వాటిని ఇప్పటివరకు పట్టించుకోలేదు. 88 పిల్లర్ల మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండు పిల్లర్లు పర్రెలు పాస్తే.. ఆ పర్రెల్లోకి పుర్రెలు దూర్చి రాజకీయం చేసిన్రు. నిండు కుండ తీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు మసిపూసి పడావుబడ్డదని ప్రజలను మత్పరించే పాచికలు వేసిన్రు. ఎన్కటికో మాటున్నది.. ‘తంతెకోడు.. మంతెకోడు ముదనష్టపోడు మోపైతడని’ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నానుడి. మన తంతెకోడు మోపైండు, మనం మరో నాలుగేండ్లు భరించక తప్పదు.
కేసీఆర్ రాజనీతిజ్ఞుడు. పాణము, పట్టము ఎప్పటికీ స్థిరం కాదని నమ్మిన స్థితప్రజ్ఞుడు. రాచరిక చరిత్ర, రాజకీయ చతురత తెలిసిన జ్ఞాని. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసక ఉపద్రవం ఏదో ఒక రోజు వస్తుందని పదేండ్ల కిందటే పసిగట్టిండు.
నీటి ప్రాజెక్టుల మీద పగ పెంచుకుంటే కోటి ఎకరాల మాగాణి తడి తప్పుతుందని భయపడ్డారు. అందుకే మిషన్ కాకతీయ పనులకు శ్రీకా రం చుట్టిన తొలిరోజే కాకతీయ శిలాశాసనం మీది విన్నపాన్ని ప్రస్తావిస్తూ.. ‘మమ్ముల్ని ఓడించినా సరే.. బురుజులు, కోటలు కూల్చినా సరే.. మనుషులను చంపినా సరే.. కానీ, మేము కట్టిన చెరువులను మాత్రం ధ్వంసం చేయకండి’ అని ఇప్పటి పాలకులకు సవినయంగా మనవి చేశారు.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు