ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష అనేది ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అత్యంత శాంతియుతమైన నిరసన రూపం. స్వాతంత్య్ర పోరాట కాలంలో గాంధీజీ దీనిని సత్యాగ్రహం పేరుతో ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆనాడు దేశ స్వాతంత్య్ర సాధనలో ఈ పోరాట రూపం కీలక పాత్ర పోషించడమే కాకుండా దేశదేశాల్లోని ప్రజలకు స్ఫూర్తిగా నిలిచింది. అధికార పీఠాలను కదిలించి ప్రజల ఆకాంక్షలను సాధించడంలో ఇప్పటికీ ఇదొక సర్వోన్నత ఆయుధంగానే కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం చేసేందుకు కేసీఆర్ ఈ మార్గాన్నే ఎంచుకోవడం ఇటీవలి చరిత్ర. హక్కుల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో ఇదంతా గుర్తుకు రావడం సహజమే.
విద్యారంగంలో చోటుచేసుకున్న అవకతవకలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ఏర్పడిన అనిశ్చితికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిరసన పట్ల కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశించినంత స్థాయిలో లేకపోవడం ప్రజాస్వామ్యవర్గాల్లో చర్చకు దారితీస్తున్నది. పైగా నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తిపై ఎన్నడూ లేని స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరుగడం ఆందోళన కలిగిస్తున్నది. వాంగ్చుక్ను బలవంతంగా దీక్షాస్థలి నుంచి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఏమాత్రం సిద్ధంగా లేకపోవడం గమనార్హం. గాంధీజీ ఆశయాలు, ఆదర్శాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని పాలక వ్యవస్థ ఇప్పుడు దేశాన్ని ఏలుతుండటం అందుకు కారణమని అనుకోవాలా?
2011లో అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక నిరాహార దీక్ష ఈ సందర్భంగా సహజంగానే మనకు గుర్తుకు వస్తుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో అన్నా హజారే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానాన్ని ప్రజా ఉద్యమ కేంద్రంగా మార్చారు. జనలోక్‌పాల్ కోసం ఆయన చేసిన దీక్షకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ ఆ ఉద్యమానికి పూర్తి మద్దతు పలుకడం గమనార్హం. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం తలవంచాలని, అన్ని డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
నాడు అన్నా దీక్ష ప్రజాస్వామ్యవాణి అయితే, నేడు వాంగ్‌చుక్ దీక్ష ఎందుకు అదే గౌరవాన్ని పొందడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాఉద్యమాలను ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిన రాజకీయ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలను ఎందుకు భిన్నంగా చూస్తున్నది? ప్రభుత్వం మారినప్పుడల్లా నిరసనల పట్ల వైఖరి మారిపోవడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల నిరసనలను తక్కువ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇది రాజకీయ నైతికతకు సంబంధించిన ప్రశ్న.
అన్నాహజారే ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘ప్రజల గొంతు వినాలి’ అని బీజేపీ వత్తిడి తెచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు నైతిక బాధ్యత వహించాలని హితబోధ చేసింది. కానీ ఇప్పుడు అదే నైతిక ప్రమాణాన్ని కేంద్రంలోని తమ ప్రభుత్వానికి వర్తింపజేయడానికి సిద్ధంగా లేదనేది స్పష్టంగానే తెలిసిపోతున్నది. ఒక ప్రభుత్వ విభాగంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు, ‘జవాబుదారీతనం ఎక్కడ?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ప్రశ్నలను తప్పించుకోవడం కంటే, వాటిని ఎదుర్కొని ప్రజలకు నమ్మకం కలిగించడం ఎంతైనా అవసరం.