తెలంగాణ గడ్డపై గౌడన్నల కష్టం ప్రాచీనమైనది, అత్యంత సాహసోపేతమైనది. ఆకాశానికి, భూమికి మధ్య వేలాడుతూ, ప్రాణాలను పణంగా పెట్టి కల్లు గీసే గీత కార్మికుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో, సంసృతిలోనూ కీలక పాత్రధారి. కానీ, నేడు ఆ గీతన్నల బతుకులు ఛిద్రమవుతున్నాయి. తాటి చెట్టు నుంచి ప్రమాదవశాత్తూ పడి ఎంతోమంది దుర్మరణం చెందుతుండగా, వేలాదిగా గాయపడుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా కుటుంబాలకు సవ్యంగానే ఆర్థిక భరోసా ఇచ్చింది. రేవంత్ సరార్ గీత కార్మికులపై శీతకన్ను వేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం పాతాళానికి పడిపోయింది. గీత కార్మికుడు చెట్టు పైనుంచి పడి మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా తక్షణమే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నేతలు భరోసా ఇచ్చారు.
ప్రమాదం జరిగిన 15 రోజుల్లోనే పరిహారం నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడేలా చేస్తామన్నారు. గీత వృత్తిని గౌరవప్రదంగా మారుస్తామని, ఆధునిక పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు వాస్తవ పరిస్థితి చూస్తే..గీతన్నలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని స్పష్టమవుతున్నది. రెండున్నరేండ్లు గడుస్తున్నా. పెంచిన రూ.10 లక్షల పరిహారం బాధితులకు అందకపోగా..గతంలో మాదిరిగా రూ.5 లక్షల పరిహారమైనా ఇప్పించండంటూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 200 మందికి పైగా గీత కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది వెన్నెముక విరిగి, కాళ్లు, చేతులు పడిపోయి మంచాన పడ్డారు. వీరిలో ఒకరికి కూడా పైసా సాయం అందలేదు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం..‘నిధులు లేవు’, ‘పాలసీ ఇంకా ఖరారు కాలేదు’ అంటూ కుంటిసాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నది.
గతంలో ప్రారంభమైన రక్షణ కవచం (సేఫ్టీ కిట్స్) పంపిణీని ఈ ప్రభుత్వం అటకెకించింది. గీత కార్మికులకు అత్యాధునిక మోకు ఇస్తామని చెప్పినా, అది ఎప్పుడు వస్తుందో చెప్పలేని స్థితిలో ఉన్నది. ‘నీరా’ను ఒక ఆరోగ్య పానీయంగా ప్రమోట్ చేస్తామని, గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. హైదరాబాద్‌లోని ‘నీరా’ కేఫ్‌లు కళ తప్పాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘నీరా’ సేకరణ కేంద్రాలు లేవు. మారెటింగ్ సదుపాయం కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది.
అబారీ శాఖ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయంలో అత్యధిక భాగం మద్యం అమ్మకాల ద్వారా ఉంటున్నది. కల్లును కూడా అబారీ శాఖే పర్యవేక్షిస్తుంది. మరి ఆ శాఖ ద్వారా వస్తున్న ఆదాయంలో కనీసం ఒక శాతం కూడా గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయలేకపోవటం అత్యంత దారుణం. గీత కార్మికులు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నప్పటికీ, వారి ఐక్యత లేకపోవటాన్ని ప్రభుత్వం ఆసరాగా తీసుకుంటున్నది. పెండింగ్‌లో ఉన్న వందలాది క్లెయిమ్స్‌ను పరిష్కరించటానికి కనీసం వెయ్యి కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించలేదు. గీత కార్మికుల కుటుంబాలకు మొండిచేయి చూపింది.
గీత కార్మికులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం నేరుగా నామినీ ఖాతాలో పడేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వ్యవస్థను రూపొందించారు. కానీ, ఇపుడు ఆ వ్యవస్థ కుప్పకూలింది. పెంచిన పరిహారం కోసం కొత్త జీవో విడుదల చేయటంలో, బడ్జెట్ కేటాయించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెకిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గౌడన్నల సంక్షేమానికి కేటాయించే పద్ధతిని అనుసరించింది.
కానీ ప్రస్తుత ప్రభుత్వం అబారీ శాఖను కేవలం రాబడి వనరుగా మాత్రమే చూస్తున్నది. మద్యం దుకాణాల లైసెన్సుల ద్వారా వచ్చే వేల కోట్లు ఇతర పథకాలకు పోతున్నాయి తప్ప, గీతన్నల ప్రాణాలకు రక్షణగా నిలబడటం లేదు. ఇకనైనా 50 ఏండ్ల్లు నిండిన గీత కార్మికులకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలి. ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం తరఫున ఉచితంగా రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి. హరితహారం కింద నాటే మొకల్లో ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– రాజు పిల్లనగోయిన