కేసీఆర్ అప్పుడప్పుడు అంటుండే మూడు మాటలు ఇటీవల ప్రజల నుంచి తరచూ వినవస్తున్నాయి. అవి, ఒకటి: కత్తి పరాయోనిదే గాని పొడిచేటోడు మనోడే. రెండు : కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం మరొకన్ని చేయమంటె అయితదా? మూడు: దున్నపోతుకు గడ్డేసి బర్రెను పాలియ్యమంటె ఎట్లిస్తది? ఈ మాటలను ఆయన గతంలో అన్నపుడు తెలంగాణ ప్రజలకు బాగానే నచ్చాయి. నవ్వారు, చప్పట్లు చరిచారు. అవి నిజానికి తమ జీవితానుభవాల నుంచి వచ్చి, తాము కూడా అనేవే గనుక. అయినప్పటికీ చప్పట్లు చరచటంతో మరిచిపోయారు. మరి ఇపుడు తమంతట తాము ఎందుకు మాట్లాడుతున్నట్లు? జవాబు చాలా సులభం.
తమ జీవితాలను నానాటికి అధ్వాన్నం చేస్తున్న కాంగ్రెస్ పాలన వారికి కేసీఆర్ హెచ్చరికలను గుర్తుకుతెస్తున్నది.పైన పేర్కొన్న మూడు మాటలను వివరించి చెప్పుకుంటే అర్థమయ్యేది చాలా ఉంటుంది. వాటిలో మొదటి దానితోనైతే తెలంగాణ వర్తమానమే గాక చరిత్ర కూడా ఎంతో బోధపడుతుంది. ఆ చర్చను కొద్దిసేపు అట్లుంచితే, ఇంతకూ ప్రజలు ఆ మూడు మాటలను ఇపుడు తమంతట తాము ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు? అందుకు సమాధానం పైన చెప్పుకున్నదే. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పరిపాలన వారి కండ్లకు నీరు తెప్పిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకాకపోవచ్చు. పరిపాలన సంతృప్తికరంగా లేకపోవచ్చు. ప్రజలకు అంతమాత్రాన బాధ కలగవచ్చు గానీ కన్నీళ్లు రావు. వీలైనంత సర్దుకుపోతుంటారు. కాని, పంటలు సాగుచేసే కాలం వచ్చి, వానలు లేనపుడు, నదుల్లో వృథాగా పోతున్న నీటిని వీలైనంత ఇవ్వగల అవకాశం ఉన్నా ఆ పని చేయకపోతే? కళ్లముందే పత్తి విత్తనాలు మొలకెత్తక, వరినార్లు ఎండుతుంటే? కళ్ల నీళ్లు రావటమే కాదు, రైతులూ, మొత్తం గ్రామీణుల గుండెలు రగులుతాయి.
తమకు ఇవ్వక ఆ నీటిని రాష్ట్ర పాలకులు ఎవరి కోసం వదులుతున్నారో తెలంగాణ రైతు లు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. పరాయివాడి క త్తి తీసుకుని మనవాడు మనను పొడవటం 1956 నుంచి 2014 వరకు చాలానే జరిగింది. కేసీఆర్ మాట్లాడింది ప్రధానంగా ఆ రోజుల గు రించి అయినా, తర్వాత 2023 నుంచి గల కాలా న్ని కూడా ఆయన దృష్టిలో ఉంచుకున్నారనుకోవాలి. ఎందుకంటే, ఈ రెండున్నర సంవత్సరాలుగా అక్కడి వారికి అనుకూలంగా ఇక్కడి పాలకులు విరామం లేకుండా ఒకటి వెనుక ఒకటి చేయటాన్ని గమనిస్తున్నాము. అట్లా చేస్తున్న వాటిలో నీళ్ల విషయం ఒకటి. ప్రత్యేక రాష్ట్ర ఉద్య మ నినాదంలో నీళ్లు ఒకటి అయి, వాటిని ఉపయోగంలోకి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-23 మధ్య ఏమేమి చేసిందో కళ్లారా చూసి అనుభవించిన వారికి, ఆ వెనుక రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తున్నవన్నీ గమనిస్తున్నపుడు, కత్తి పరాయోనిదే గాని పొడిచేటోడు మనోడే అన్నమాట గుర్తుకు రాకుండా ఎట్లా ఉంటుంది?
కాళేశ్వరంలో తలెత్తిన చిన్న సమస్యను సరిదిద్దే అవకాశం ఉండి కూడా ఆ పని చేయక గత ప్రభుత్వంపై రాజకీయ కక్ష కోసం ఉపయోగించుకోవటం, ఆచరణ రీత్యా అసాధ్యమైన తుమ్మిడిహట్టి గురించిన హంగామాలు, వివిధ ఎత్తిపోతల ప్రాజెక్టులు ముందుకు సాగకపోవటం, మిషన్ కాకతీయ పథకం కింద ఫలితాలనిచ్చిన వేలాది చెరువులు తిరిగి మెల్లగా దెబ్బతింటుండటం నుంచి మొదలుకొని ప్రస్తుతం కన్నెపల్లి వగైరాల వరకు చాలా చాలా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని, మంత్రుల నుంచి మొదలుకొని, అధికారపక్షం నాయకుల వరకు అందరిదీ ‘మనోడే పొడవటం’ కథే.
ఇంతటి ద్రోహాన్ని ఊహించటం కూడా కష్టంగా ఉంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు సీమాంధ్ర ప్రాబల్య వర్గాల మోచేతి నీళ్లు తాగితే తప్ప తమకు మనుగడ లేని స్థితిలో వీరుండవచ్చు. ఆ కాలమంతా తెలంగాణ ప్రజలకు, వారి ఉద్యమాలకు కూడా బయటివారి కత్తులతో వెన్నుపోట్లు, ఎదురుపోట్లు పొడిచి ఉండవచ్చు.
కాని ప్రజలు తమ ఉద్యమాలతో స్వరాష్ట్రం సాధించిన తర్వాతనైనా ఇది మా గడ్డ అనే స్పృహ కలగకుండా, ఇప్పటికీ బయటివాడి ప్రయోజనాల కోసం, వాడి కత్తిని తీసుకుని ఇక్కడి రైతాంగాన్ని, ప్రజలను పోట్లు పొడవటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు నీటిపారుదల శాఖ సలహాదారులు, అధికారుల నియామకమే అవతలివారి ఆదేశాల ప్రకారం జరుగుతున్నపుడు, ఇక్కడి పాలకుల పథకమే బయటివారి కత్తులతో మనను పొడవటమని అర్థం కావటం లేదా?
అర్థం అవుతున్నది గనుకనే తెలంగాణ రైతులకు, ప్రజలకు కేసీఆర్ మాటలు లేదా హెచ్చరికలు బలంగా గుర్తుకు వస్తున్నాయి. పదే పదే. వ్యవసాయానికి ముఖ్యమైన విద్యుత్రంగం కోసం కేసీఆర్ 2014లో అధికారానికి వచ్చిన వెంటనే ఏమేమి చేశారో, అప్పటి నుంచి పదేళ్లపాటు సరఫరాలు ఏవిధంగా జరిగాయో చూసిన రైతులకు, ఇపుడు ఆ రంగంలోకి కూడా బయటి అధికారులు చొరబడుతుండటంతో ఏమి జరుగుతున్నదో కనిపిస్తున్నది. ఇది కూడా బయటివాడి కత్తితో మనను మనవాడు పొడటమే.
ఇక్కడ కొందరికి ఇటువంటి స్వభావం ఎందుకు వచ్చిందన్నది చరిత్రలో వెనుకకు వెళ్లి అర్థం చేసుకోవలసిన విషయం. అందుకు పరిష్కారం ఏమిటో కూడా ప్రజలు తెలుసుకోవాలి. లేనట్లయితే ఇటువంటి సమస్యలు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. యథాతథంగా ఇట్లా పొడిచేవారంటూ తయారుకావటంలో ఆశ్చర్యం లేదు. బయటివారి ఆశలకు లొంగి తమ రాజ్యపు కోట రహస్యాలు చెప్పటం, అర్ధరాత్రి కోట ద్వారాలు తెరవటం వంటివి చరిత్రలోనూ ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే, చరిత్రలో వలె ఏదో చెదురుమదురు వ్యక్తుల కేసులు గాక, ఇటువంటి ద్రోహులు ఏకంగా ఒక తరగతిగా తయారయ్యారు.
అంతర్జాతీయంగా చూసినపుడు వలస పాలకులకు 18, 19, 20వ శతాబ్దాల్లో స్థానికుల నుంచి ఒక కాంప్రడార్ క్లాస్, లేదా దళారీ వర్గం తయారై ఉపయోగపడింది. ఇండియాలో, ఇతర వలస దేశాల్లో కూడా ఆ వర్గంలోని వారు పేదలు కాదు. వేర్వేరు విధాలుగా స్థితిమంతులే. ఈ వర్గం బయటివారికి ఉపయోగపడటం వలసల కాలంలో మాత్రమే జరగలేదు. ప్రజలు ఉద్యమించి స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా కొనసాగింది. కాకపోతే కొంత తక్కువ స్థాయిలో. స్వాతంత్య్రానంతరం ఆ స్పృహతో కళ్లు తెరిచిన వారిలో మార్పు రాగా, కొందరికి అది జరగలేదు.
అదే పరిస్థితిని తెలంగాణలో చూడవచ్చు. నిజాం కాలం నాటి భూస్వామ్య వ్యవస్థలో ఆయన దయపై ఆధారపడిన తరగతి, ఆ పాలన పోయి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూస్వామ్య దశ నుంచి బయటపడి ఆధునిక ఆర్థిక దశలోకి ప్రవేశించలేకపోయింది. అటువంటి మార్పు త్వరగా జరిగేది కాదన్నది కూడా వాస్తవం. మొత్తానికి అవే పరిస్థితుల మధ్య పదేళ్లయినా గడవకుండానే ఆంధ్ర రాష్ట్రంలో విలీనం జరిగింది. తెలంగాణ భూస్వామ్య తరగతి ఆధునిక తరగతిగా ఇంకా పూర్తిగా మారనందున, వారితో తెలంగాణ జాతి భావన పెంపొందలేదు. అందుకు తగినట్లు మరొకవైపు సీమాంధ్రలో ఆర్థికాభివృద్ధితోపాటు తెలుగుజాతి భావనలు, వాదనలు, విస్తరణ కాంక్షలు మొదలయ్యాయి. శాసనసభలో వారిది మెజారిటీ అయింది. బ్రిటిష్ పాలనపై మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో కాంగ్రెస్ ఉద్యమంలో భాగస్వాములైనందున, స్వాతంత్య్రం వచ్చేసరికి ఢిల్లీలో పలుకుబడి ఏర్పడింది. ఈ వేర్వేరు అంశాలన్నీ ఒకటి కావటంతో సీమాంధ్రుల ప్రాబల్యం నడవగా, తెలంగాణవారిది అన్నివిధాలుగా మైనారిటీ పరిస్థితి అయింది.
అదే సమయంలో గుర్తించవలసిన కీలకమైన విషయం ఒకటున్నది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హామీల ఉల్లంఘనకు, అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మధ్య మధ్య ఉద్యమిస్తుండినపుడు, కాంగ్రెస్ నాయకులకు కనీసం అందువల్లనైనా తెలంగాణ స్పృహ, తెలంగాణ జాతి స్పృహ కలిగి ఉండినట్లయితే పరిస్థితి మరొక విధంగా ఉండేది. వారు సంఖ్యల రీత్యా మైనారిటీ అయినా, ప్రజలతో గొంతు కలిపి నిలబడి ఉంటే చాలా మార్పు కనిపించేది.
కాని వారికి స్వప్రయోజనాలు తప్ప అటువంటి స్పృహలేవీ లేకపోవటంతో, టికెట్లు, పదవులు, కాంట్రాక్టులు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం అవతలి వారికి లొంగిపోయారు. అట్లా లొంగిపోవటమన్నది అంతర్గత వలస పాలకుల ప్రయోజనాలకు ఉపయోగపడి, తెలంగాణ ప్రయోజనాలకు హానికరంగా మారి, తమకు మాత్రం ఏవో కొన్ని లాభాలనివ్వటమనే ప్రక్రియ, వారిని దళారీ తరగతిగా మార్చింది. తెలంగాణ ప్రజల ఉద్యమాలను వలసపాలకులు అణచివేసినపుడల్లా తాము ప్రజల వైపు నిలవటానికి బదులు అణచివేతకు సహకరించటం వారిని మరింత నికరమైన దళారులను చేసింది. అదం తా సీమాంధ్ర వర్గాలకు అనువుగా మారి, వారు కూడా ఈ దళారీతనాన్ని పెంచి పోషించారు.
ఇవన్నీ ఇంతగా చర్చించుకోవటం ఎందుకంటే, మనం ప్రస్తుతం చూస్తున్న ‘బయటివాడి కత్తి, ఇక్కడివాడి వెన్నుపోట్లు’ అనే స్థితికి మూలాలు, ఈరోజుకు కూడా కొనసాగింపులన్నవి ఈ విధంగా ఉన్నాయి. అటువంటివారు కొందరు ఎప్పుడూ ఉంటారనుకున్నా, జరుగుతున్న దానిపట్ల కాంగ్రెస్లో ఎవరికీ నోరు పెగలకపోవటమన్నది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. దానిని బట్టి, అందరికన్నా పైస్థాయిలో చంద్రబాబు, రెండవస్థాయిలో రేవంత్రెడ్డి ఉండగా, తక్కిన కాంగ్రెస్వాదులంతా మూడవస్థాయిలో చేరి తమ తమ ప్రయోజనాల కోసం రాజీపడి కళ్లు, చెవులు, నోరు మూసుకుంటున్నారనుకోవాలి. ఆ మేరకు అంతిమ విశ్లేషణలో ఈ తక్కినవారు ఉప దళారులవుతున్నారు.
అందువల్ల, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హెచ్చరికలు సహజంగానే గుర్తుకువస్తున్నాయి. పొడిచేది మనవాడే అన్న మాటకు తక్కిన రెండు మాటలు తార్కికమైన పొడిగింపు అవుతాయి. 2023లో ఎందుకైతేనేమి కత్తి కాంగ్రెస్కు ఇచ్చినపుడు, సమస్యలపై యుద్ధం చేయాలని ఇపుడు బీఆర్ఎస్ను కోరటంలోని విడ్డూరమేమిటో, గడ్డి దున్నపోతుకు వేసి పాలు మాత్రం బర్రె నుంచి ఆశించటం ఎంత అర్థం లేనిదో తెలంగాణ రైతులకు, ప్రజలకు ఇపుడు బాగా అర్థమవుతున్నది. ఈ విషయాలు మొదట గ్రహించలేనివేమీ కాదు. కాని ఒక్కోసారి భ్రమలది పైచేయి అయినపుడు ఇట్లా జరుగుతుంటుంది. విచక్షణ పనిచేయదు.
అయితే, ప్రజల బాగుకు, రాష్ట్రం మేలుకు కట్టుబడిన ఏ నాయకత్వమైనా అదే ప్రకారం వ్యవహరిస్తుంది తప్ప తాత్కాలిక పరిణామాలను బట్టి విధానాలను మార్చుకోదు. దూరదృష్టితో ముందుకుపోతుంది. బీఆర్ఎస్ చేస్తున్నది అదే. గత రెండున్నరేళ్లలో ప్రజలకు అంతా అర్థమైనందున కేసీఆర్ హెచ్చరికలు గుర్తుకు వస్తున్నాయి గనుక, ఆ ప్రభావాలు రాగల కాలంలో కనిపిస్తాయి. ఇక చేయవలసిందేమిటో వారికి వేరే చెప్పనక్కరలేదు.
– టంకశాల అశోక్