కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నక్సల్స్ రహిత భారతదేశం గడువు మార్చి 31తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌కు పెట్టిన డెడ్‌లైన్ మరో రెండు రోజులే మిగిలి ఉన్నది. ఆరు దశాబ్దాల క్రితం ఆరంభమై 22 రాష్ర్టాలకు విస్తరించి రోజూ ఎక్కడో చోట ఉద్యమ ఆనవాళ్లు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ సమీపంలోని బెంగాయిజోట్ గ్రామంలో 1967లో 25 మేన జరిగిన భూఉద్యమ పోరాటంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో తొమ్మిది మంది కార్మికులు, ఇద్దరు పిల్లలు మరణించడంతో నక్సలిజం మొదలైంది. అలా భూపోరాటం, సగటు మనిషికి కూడు, గూడు, గుడ్డ, గుప్పెడు న్యాయం నినాదంతో జనంలోకి వెళ్లింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ 1975 వరకు వేళ్లూనుకునే ఉన్నది. దొరలు, భూస్వాములు పటేల్, పట్వారీ వ్యవస్థల దోపిడీ విధానాల వల్ల ప్రజలు ఆర్థిక, మానసిక, శారీరక అసమానతలకు గురవుతున్న రోజులవి. అదే సమయంలో 1967లో పశ్చిమ బెంగాల్లో చారు మజుందార్, కానూ సన్యాల్ సీపీఎం నుంచి విడిపోయి నక్సల్బరి నుంచి ఉద్యమం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకటయ్య తదితరులు నక్సలైట్ ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విస్తరింపజేశారు.1969లో జరిగిన శ్రీకాకుళం గిరిజన రైతాంగ ఉద్యమం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. 1969లో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి సమర్థించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వందలాది మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపింది.
తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి నాయకత్వ వైఫల్యంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న తెలంగాణ యువత విప్లవోద్యమాలవైపు ఆకర్షితమైంది. 1969-70 నుంచే తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, డాక్టర్ కొల్లూరి చిరంజీవి, ముప్పాల లక్ష్మణరావు (గణపతి) సీపీఐ-ఎంఎల్ పార్టీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రారంభిచారు, తెలంగాణలో విద్యార్థులు అధిక సంఖ్యలో నక్సలైట్లుగా మారడానికి వరవరరావు, గద్దర్‌తోపాటు విప్లవ రచయితల సంఘం ప్రచురణలు, గేయాలు, విప్లవ సాహిత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు యువతను ప్రేరేపించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిరెడ్డి హత్యానంతరం 1973-74లో విద్యార్థులు పీడీఎస్‌యూ పేరుతో సంఘటితమై ఉద్యమాలు రూపొందించారు. కొండపల్లి సీతారామయ్య, మల్లోజుల కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు (సాహూ), సూరపరెడ్డి జనార్దన్, నారదాసు లక్ష్మణరావు, అల్లం నారాయణ, అల్లం వీరయ్య, బీ విజయకుమార్ తదితరులు 1974 అక్టోబర్ 13న రాడికల్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ పేరును ప్రజాకవి శ్రీశ్రీ ఖరారు చేశారు.
దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో రాడికల్ విద్యార్థి సంఘాల ద్వారానే విప్లవ ఉద్యమాల పోరు జరిగింది. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఆ కాలంలో వందలాది మంది యువకులను పోలీసులు కాల్చి చంపారు, వేలాదిమంది యువకులు జైళ్ల పాలయ్యారు. వరంగల్ ఆర్ఈసీ కాలేజీలో ఇంజీనీరింగ్ చదువుతున్న ఆర్ఎస్యూ నాయకుడు సూరపనేని జనార్దన్, ఎల్బీ కాలేజీ విద్యార్థి లంక మురళీమోహన్‌రెడ్డిని 1975 జూలైలో సిద్దిపేట సమీపంలోని గిరాయిపల్లి గుట్టల్లో చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. దేశంలోని ఆయా రాష్ర్టాలలో పేరు మోసిన ఉద్యమకారులను ఎంతోమందిని కాల్చి చంపారు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తివేశాక అనేక ఘటనలు వెలుగు చూశాయి. 1978-79 ప్రాంతంలో మళ్లీ విప్లవకారులు పెద్ద ఎత్తున ఒక్కటయ్యారు. సభలు, సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తూ ఉద్యమాలకు మళ్లీ ఊపిరి పోశారు. స్వాతంత్య్రం వచ్చి అప్పటికి 33 ఏండ్లయినా వ్యవస్థలో ఏమాత్రం మార్పు రాలేదు. ఏ పేదవాడి కోసమైతే ఉద్యమాలు పుట్టాయో ఆ ఉద్యమాల ఆశలు, ఆశయాలు రవ్వంత కూడా నెరవేరలేదన్న ఉక్రోషంతో యువత మళ్లీ కదం తొక్కింది.
జమీందారులు, జాగిర్దారులు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల పీడ విరుగుడు కాలేదు. ప్రభుత్వం, పాలకులు, అధికార యంత్రాంగం వారికి పెంపుడు అనుకూలంగా మారటంతో ఉద్యమాలు పెల్లుబుకాయి. నక్సలైట్లు 1978లో ‘గ్రామాలకు తరలండి’ పేరుతో ప్రజల దీనస్థితిని తెలుసుకున్నారు.
1978 డిసెంబర్ 8న నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో ఉద్యమ పోరాటం మరింత పటిష్టమైంది. ఈ సభ తర్వాత కొండపల్లి సీతారామయ్య తన సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ(సీవోసీ)ని 1980 ఏప్రిల్ 22న పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)గా మార్చారు. 1981 ఏప్రిల్ 20న పీపుల్స్‌వార్ ఇంద్రవెల్లి గిరిజన మహాసభలు తెలంగాణలో ప్రకంపన సృష్టించాయి. పోలీస్ కాల్పుల్లో దాదాపు 18 మంది మరణించగా వందలాదిమంది క్షతగాత్రులయ్యారు.
1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తమ ఎన్నికల ప్రచారంలో నక్సలైట్లే దేశభక్తులని ప్రకటించారు. తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టారు. నక్సలైట్లు రాష్ట్రవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని విస్తరిస్తూ మద్యపాన నిషేధం అమలు డిమాండ్ తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మద్యపానం నిషేధాన్ని అమలు చేశారు. నక్సలైట్లు తమ డిమాండ్ల సాధన కోసం రాజకీయ నాయకులు, అధికారులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. పోలీసులు, నక్సలైట్లకు మధ్య పోరు తీవ్రమైంది. నక్సలిజాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు నక్సల్స్ సానుభూతిపరులపై కేసులు పెడుతూ దాడులు చేస్తూ ఎన్కౌంటర్లకు పాల్పడ్డారు. 1989లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్లపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పరిస్థితిని నక్సలైట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. యువత పెద్దసంఖ్యలో నక్సలైట్లలో కలిసిపోయారు. ఎంతోమంది మహిళలు సైతం ఉద్యమంలో చేరారు. ఉత్తర తెలంగాణలో నక్సలైట్ల ఒత్తిడితో కొందరు భూస్వాములు, దొరలు తమ భూములను పేదలకు పంచారు. చాలామంది దొరలు, భూస్వాములు, బడా రాజకీయ నాయకులు గ్రామాలను వదిలి పట్టణాల్లో తలదాచుకున్నారు. చాలామంది నక్సలిజంలో చేరి తమ స్వార్థ ప్రయోజనాలు వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు పనులు చక్కబెట్టుకునేందుకు బెదిరింపులకు దోపిడీ దొంగతనాలు కూడా పాల్పడ్డారు. వారిని కట్టడి చేసేందుకు నక్సలైట్లు కొందరిపై హింసాత్మక చర్యలకు దిగారు.
సీపీఐ (ఎంఎల్), పీడబ్ల్యూజీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) తదితర ఉద్యమ పార్టీలన్నీ ఏకమై 2004 సెప్టెంబర్ 21న సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2005లో నక్సలైట్లతో శాంతి చర్చలకు పిలుపునిచ్చారు, చర్చలు విఫలమయ్యాయి. నక్సలైట్లపై ప్రభుత్వం మళ్లీ నిషేధం అమలు చేస్తూ క్రమంగా నక్సలైట్లపై తీవ్ర ఒత్తిడి పెంచింది.
2006 నుంచి 2014 వరకు మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది. కేసీఆర్ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నక్సలైట్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను ప్రేరేపించి ఉద్యమానికి సన్నద్ధం చేశారు. అప్పటికే పోలీసు బలగాలు నక్సలైట్లపై అన్ని రకాలుగా అణిచివేత ధోరణితో ఎన్కౌంటర్లను తీవ్రతరం చేశారు. నక్సలిజంలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. దళ నాయకులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వదిలి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్లారు.
నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ఏర్పాటు చేసి 50 వేల మంది సైనికులను రంగంలోకి దింపింది. అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు సాంకేతిక నైపుణ్యంతో చర్యలు చేపట్టింది. రెండేండ్లుగా నక్సల్స్‌కు, పోలీసు బలగాలకు భీకరపోరు జరుగుతూనే ఉన్నది.
నిరుడు మే 21న జరిగిన పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు 21 మంది కీలక నేతలు హతమయ్యారు, అక్టోబర్ 6న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తోపాటు పలువురు కీలక నేతలు లొంగిపోయారు, 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు పదివేలకు పైగా నక్సలైట్లు లొంగిపోగా వేల మంది హతులయ్యారు. మార్చి 31 వరకు నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్రం తీసుకున్న భీష్మ శపథానికి మరో మూడు రోజులే గడువున్నది. ఆది నుంచి నక్సలిజంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుతో పూర్తిగా నక్సలిజం తుడిచి పెట్టినట్టు అవుతుందని కేంద్రం భావిస్తున్నది. ఆయన భారతదేశంలో ఉన్నారా? విదేశాల్లో ఉన్నారా? అన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. త్వరలోనే ఆయనను లొంగిపోయాలా చేయాలన్నది పోలీసుల ప్రయత్నంగా కనిపిస్తున్నది. ఈ మూడు రోజుల్లో నక్సల్స్‌ను పూర్తిగా నిర్మూలించినట్టు కేంద్ర ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– మంగళారపు లక్ష్మణ్
98663 35567