గాంధేయవాదాలు కలపండి గంగలో.. తుక్కు సిద్ధాంతాలు తొక్కండి తుంగలో.. నేతలము మీ నుదుటి రాతలమురా మేము.. మంత్రులము అధికార తంత్రులమురా మేము.. అంటూ రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ పాలకులు. ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా రక్షణ కల్పించాల్సిన మంత్రులు భక్షణకు ఎగబడుతున్నారు. అధికార గణం అవినీతికి పాల్పడకుండా నిగరానా వేసి పాలనను సజావుగా కొనసాగించాల్సిన మంత్రులు తామే భూముల ఆక్రమణ, అడ్డగోలు దందాలతో కేసుల్లో ఇరుక్కుపోయి ఇగిలిస్తున్నారు. పెద్దల కనుసన్నల్లో, అధికార అండదండలతో మైనింగ్, ల్యాండ్ మాఫియాలు బుసలు కొడుతున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కో తరహాలో తన హోదాను, అధికారాన్ని బాహాటంగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాసేవకు, వ్యాపారాలకూ పొంతన కుదరదు.
ప్రయోజనాల ఘర్షణ తలెత్తకుండా ఉండాలంటే మంత్రులు తమ పేరు మీద వ్యాపారాలు లేకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడి మంత్రులు తమ పేరు మీదున్న వ్యాపార సంస్థల కోసం బరి తెగిస్తున్నారు. బూడిద నుంచి భూముల దాకా కాదేదీ స్కామ్‌కు అనర్హం అంటూ తలా ఇంత దోచుకోవడం మీదే మనసు పెడుతున్నారు. స్కాంగ్రెస్ మార్కు పాలన సాగిస్తూ అవినీతి ఎముకలు మెడలో వేసుకుని ఊరేగుతున్నారు. ఓ మంత్రి ఓఎస్డీ తుపాకీ తీసి ఓ కంపెనీ అధికారిపై గురిపెడతాడు.
మంత్రుల మధ్య వాటాలు తేలక వీధికెక్కి వీరంగం వేస్తున్నారు. అసైన్డ్ భూముల కోసం మరో మంత్రి అడ్డంగా ఎగబడుతున్నారు. ఎక్సైజ్ బ్రాండ్లను తిమ్మిని బమ్మిని చేసి కోట్లు దండుకుంటున్నారు. రింగురోడ్డును అష్టొంకర్లు తిప్పి పైసా వసూల్‌కు పాల్పడ్డారు. రామగుండం థర్మల్ బూడిదనూ బుక్కేందుకు ఓ మంత్రి తయారయ్యారు. ఇసుకను బొక్కేందుకు మరోమంత్రి ఎగబడుతున్నారు.
ఈ కుంభకోణాల సందడిలో ఓ మంత్రి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. సొంత కంపెనీకి ఎంతోకొంత మేలు చేసుకుని అధికార పరమార్థాన్ని చాటిచెప్తున్నారు. ఈయన భూకబ్జాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలు నేడు ప్రజల ముందే ఉన్నాయి. మంత్రి కంపెనీ అక్రమాలు నిజమేనని సభాముఖంగా ఒప్పుకున్న సీఎం సభాసంఘం వేయమంటే మాత్రం పారిపోతారు. ఢిల్లీలో అగ్రనేత మాటకు, ఇక్కడి సర్కార్ పెద్దల మాటకు పొంతన ఉండదు. అక్కడ సభాసంఘం వేయాలని డిమాండ్లు వినిపిస్తారు. ఇక్కడ అవే డిమాండ్లను కొట్టిపారేస్తుంటరు.
మంత్రుల అక్రమాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ లోపలా వెలుపలా తమవంతు బాధ్యతగా అడుగడుగునా నిలదీస్తున్నది. సర్కార్ పెద్దల బండారం బయటపెడ్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నది. సమాధానం లేని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నది. సభలో గొంతు నొక్కుతున్నది. సభ వెలుపల ప్రశ్నకు సంకెళ్లు వేసేందుకు సమాయత్తమవుతున్నది. విద్వేష ప్రసంగాలకు పేరెన్నికగన్న సర్కార్ పెద్ద అదే పేరుతో ప్రశ్నల నోరునొక్కేందుకు సరికొత్త చట్టాన్ని తెస్తుండటం విడ్డూరం.
ప్రభుత్వానికి అవినీతి నిర్మూలనపై, ప్రజల ఆస్తి పరిరక్షణపై నిజంగా ఆసక్తి ఉంటే మంత్రులను బర్తరఫ్ చేయాలి. సభాసంఘాలు వేయాలి. విచారణలు జరిపించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. భూములను, సహజవనరులను కాపాడి చూపించాలి. మంత్రుల ముఠాను అదుపు చేయాల్సిన మేస్త్రీ తానే స్వయంగా అక్రమాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం సోదరుల పేరిట జరుగుతున్న భూబాగోతాలు, కంపెనీల టక్కుటమారాలు బహిరంగ రహస్యమే.
అవి చాలవన్నట్టుగా అల్లుని కంపెనీకి, బావమరిది కంపెనీకి అప్పనంగా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారు. మంత్రులను కుంభకోణాలే కాకుండా క్రిమినల్ కేసులూ వెన్నంటి ఉంటున్నాయి. వీఐపీ కేసులను పోలీసులు చూసీ చూడనట్టు వదిలేసి మెతకగా వ్యవహరించడం మరో వైపరీత్యం. అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంగా రికార్డు సాధించిన వ్యక్తి పాలనలో ఇంతకన్నా ఎక్కువ ఏమీ ఆశించలేం.