స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ బీసీలకు పెద్దపీట వేయకపోవడమే అందుకు నిదర్శనం. 42 శాతం రిజర్వేషన్ కోర్టులో నిలవదని తెలిసీ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలుచేస్తామని ప్రకటించటం విడ్డూరం. జస్టిస్ ఈశ్వరయ్య చెప్పినట్టు తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ద్వారా రక్షణ కల్పించినప్పుడే 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆస్కారం ఉంటుంది. బీహార్, మహారాష్ట్రలలో రిజర్వేషన్ల పెంపును ఎన్నికలు జరిగిన తర్వాత, చట్టబద్ధత పూర్తయిన తర్వాత కూడా నిలిపివేయాల్సి వచ్చింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ తరహాలో పావులు కదుపుతున్నట్టుగా అర్థమవుతున్నది. బీసీలపై ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించేందుకు బీసీ ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా వేరే పార్టీలపై నిందలు వేసేందుకు ప్రయత్నం చేస్తే బీసీల చేతిలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉంటాయి. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గుర్తెరిగితే మంచిది.
– బాస్ హనుమంతు నాయుడు,(జోగులాంబ గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి)
తెలంగాణకు రావాల్సిన గోదావరి, కృష్ణా నీళ్లను దోచుకెళ్లేందుకు ఢిల్లీలో ఉన్న బీజేపీ అండతో ఏపీ ప్రభుత్వం బనకచర్ల పేరుతో కుట్రలు చేస్తున్నది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎం పీలు ఆ కుట్రలను అడ్డుకునేందుకు ఒక్క ప్రయత్నమైనా చేశారా? అంటే లేనే లేదు. అస లు ఏపీ బనకచర్ల కట్టడం లేదంటూ అబద్ధాలు చెబుతూ తెలంగాణకు అన్యాయం తలపెడుతున్నారు. మన హక్కులను కాపాడాల్సిన వారు దోపిడీకి వంతపాడుతుండటం శోచనీయం. గతంలో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణే శ్వాసగా కొట్లాడారు. మన హక్కుల కోసం, మనకు రావాల్సిన నిధుల కోసం పార్లమెంట్ సాక్షిగా రాజీలేని పోరాటం చేశారు. కానీ, నేడు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎవరి ప్రయోజనం కోసం పదవులను వాడుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. ఈ రెండు జాతీయ పార్టీలు.. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష అన్నట్టుగా చెట్టపట్టాలేసుకుని ఒకరినొకరు కాపాడుకుంటూ కాలం గడుపుతున్నాయి తప్ప, ఓట్లేసి ఢిల్లీకి పంపిన మన గురించి, మన కష్టాలు తీర్చే మార్గాల గురించి మాత్రం ఆలోచించడం లేదు. తెలంగాణ హక్కులను పదేండ్లు కాపాడింది, హక్కుల సాధన కోసం పోరాడిందెవరు? ఇప్పుడు మన హక్కులను పరాయి రాష్ర్టాల పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నదెవరు? మన హక్కులు మనకు దక్కాలంటే మన గొంతును ఢిల్లీలో బలంగా వినిపించేదెవరో ఇకనైనా తెలుసుకోవాలి.
– నాయిని అనురాగ్‌రెడ్డి
తెలంగాణ అంటేనే ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్. అరువై ఏండ్ల అవమానాలను భరించిన ఈ గడ్డ ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించుకున్నది. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల చెంత తాకట్టు పెడుతున్నాడు. ఇంతటి దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఏ తెలంగాణ పౌరుడూ ఊహించలేదు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి దిశగా పయనించాలని ప్రజలు కోరుకున్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గద్దెనెక్కిందో లేదో తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది. అందుకే, యావత్ తెలంగాణ ప్రజా మరో ఉద్యమం చేసేందుకు నడుం బిగుస్తున్నది. కృష్ణార్జునులైన కేటీఆర్, హరీశ్‌లు ఇప్పటికే తెలంగాణకు కమాండర్లుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కుట్రలను, కుయుక్తులను ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేస్తూనే, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణను రక్షించే బాధ్యత మనందరిది.
– నరేశ్ మైనాల, (కేటీఆర్ సేన, వరంగల్ జిల్లా అధ్యక్షుడు)
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పతాకగా 2010 బాటలో బతుకమ్మగా ప్రారంభమైన ‘బహుజన బతుకమ్మ’ నవ తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా సాగి 2025, ఆగస్టు 17 నాటికి 15 ఏండ్లు పూర్తిచేసుకున్నది. ‘ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ-ప్రకృతి విధ్వంసమే ప్రజలపై యుద్ధం’ అనే అంశంపై బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు, శ్రేయోభిలాషులందరు హాజరుకానున్నారు. బాగ్‌లింగంపల్లి అరుణోదయ కార్యాలయం ముందుగల హాలులో ఆగస్టు 17, ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమాలోచనల సమావేశానికి సకాలంలో వచ్చి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం.
– విమలక్క, ప్రొఫెసర్ కె.లక్ష్మి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ, తెలంగాణ