ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ధోకా ఇచ్చింది. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నది. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. ప్రజలను నయవంచనకు గురిచేసి రెండున్నరేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్నది. దీంతో కాంగ్రెస్‌ను దోషిగా బంధించి ప్రజల ముందు ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ ఎత్తుగడ వేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర సభ్యులతో కలిసి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. దీంతో ఆరు గ్యారంటీల మాయాజాలంతో నిలువునా వంచిస్తున్న రేవంత్ ప్రభుత్వం బోనులో నిలబడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఒక ముఖ్యమంత్రి ఫైలు మీద సంతకం చేశాక రెండున్నరేండ్లుగా చట్టబద్ధతకు నోచుకోని వైనంపై ప్రతిపక్షం ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టడం తెలంగాణలోనే తొలిసారి. బిల్లు చర్చకు వచ్చి ఆమోదం పొందాలంటే స్పీకర్ అనుమతి, అధికారపక్షం సహకారం తప్పనిసరి. ఈ ఉదంతంలో పరిణామాలు ఫలితాలు ఎలా ఉన్నా అంతిమంగా బీఆర్ఎస్దే పైచేయి కానున్నది. కాంగ్రెస్ రాజకీయంగా ఇరకాటంలో పడనున్నది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ విస్మరించిన హామీల విషయంలో చట్టబద్ధత కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్న బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలుకనున్నది.
75 ఏండ్ల పార్లమెంట్ చరిత్రలో ఆమోదం పొందిన ప్రైవేట్ మెంబర్ బిల్లుల సంఖ్య పద్నాలుగు. ఆఖరుగా 1970లో ఇండియన్ పీనల్ కోడ్ అమెండ్మెంట్ బిల్లు ఆమోదం పొందింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బహుభార్యత్వం నేరం’లో అప్పటికే అమలులో ఉన్న శిక్షాస్మృతిలోని సెక్షన్ 494, 495 చట్టాలు పేర్కొన్న శిక్షలను మరింత కఠిన తరం చేయడానికి 1986లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాటి బీజేపీ ఎల్పీ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత 2014 వరకు ఎన్నికల వాగ్దానాల చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లులు ఆమోదం పొందిన సందర్భం లేదు.
రేవంత్‌రెడ్డి ఎల్బీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీల ఫైలు మీద సంతకం చేయడం, ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వాటికి చట్టబద్ధత కల్పించే ప్రస్తావన చోటుచేసుకున్నాయి. మాట నిలబెట్టుకున్న మహనీయుడు అంటూ రేవంత్ వందిమాగధులు స్తోత్రపాఠాలు వల్లించారు. ఆ గ్యారెంటీలు ఈనాటికీ అమలుకు నోచుకోకపోవడం వల్ల వ్యవహారం ఇంతవరకు వచ్చింది.
తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు అతీగతీ లేదు. కానీ ఇతర రాష్ర్టాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఘనంగా అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు, ప్రసంగాల ద్వారా అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు దారుణంగా మోసపూరిత ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న ప్రైవేట్ బిల్లు కాంగ్రెస్ మెడకు మరింత బిగుసుకుంటుంది. బీఆర్ఎస్ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో పుట్ట పగిలి గుట్టు బయట పడితే త్వరలో జరుగబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ కపట నాటకం బయటపడక మానదు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఇతర రాష్ర్టాల ఎన్నికల్లో 6 గ్యారెంటీల ఎండమావులను చూపించి దారుణంగా భంగపడింది. మీడియా, సోషల్ మీడియా విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీల ఘోర వైఫల్యం దాచిపెట్టడం అంతసులువు కాదని ఆ పార్టీ పెద్దలు గ్రహించలేకపోయారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఆరు గ్యారెంటీలతో ఊరేగినా కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. అయినా అవే గ్యారెంటీల గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలతో మరిన్ని రాష్ర్టాలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నది.
ఎన్నికలకు రెండు నెలల ముందు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సెప్టెంబర్ 17న జరిగిన విజయభేరి సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు శ్రీధర్‌బాబు వాగ్దానం చేశారు. రేవంత్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి వాగ్దానాల అమలుకు 100 రోజుల గడువు చాలు అన్నారు. గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికారు. ఆరు గ్యారెంటీల కార్డులు ఇంటింటికీ పంచిపెట్టారు. ఈ కార్డులు భద్రంగా దాచుకోవాలని నాటి సీఎల్పీ లీడర్ భట్టివిక్రమార్క ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ఆ కార్డులు చూపిస్తేనే పథకాలు వర్తిస్తాయని చెప్పుకొచ్చారు.
ఆ మాటలు నేడు ఎంత హాస్యాస్పదం! తీరా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సహా నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన హామీల ఊసే తీయలేదు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఒక అబద్ధాల పుట్ట అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో పాలకుల వాగ్దానాలు ప్రజల హక్కులుగా మారాలంటే చట్టబద్ధత ఒక్కటే శరణ్యం. అందుకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వచ్చే శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ‘మీరు చెప్పిందే కదా.. సంతకం చేసిందే కదా.. చట్టబద్ధం చేయండి’ అని ప్రభుత్వాన్ని న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల పక్షాన కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లోని సభ్యులంతా బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రైవేట్ బిల్లు చర్చకు నోచుకోకుండా, చట్టంగా మారకుండా, సభ ప్రవేశ ద్వారం దగ్గరే ఆగిపోతే గ్యారెంటీలపై కాంగ్రెస్ పార్టీ బండారం బహిర్గతం అవుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టుగా అయిపోయింది.
వాగ్దానాల అమలుకు 100 రోజుల గడువు చాలు అని రేవంత్‌రెడ్డి అన్నారు. వాటికి చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికారు. మరీ విడ్డూరంగా గ్యారెంటీల కార్డులు ఇంటింటికీ పంచిపెట్టారు. ఈ కార్డులు భద్రంగా దాచుకోవాలని, కార్డులు చూపిస్తే పథకాలు వర్తిస్తాయని నాటి సీఎల్పీ లీడర్ భట్టివిక్రమార్క ప్రజలకు చెప్పారు. ఆ మాట నేడు ఎంతటి హాస్యాస్పదం!
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238