2023 డిసెంబర్ 3నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే రేవంత్‌రెడ్డి ఒక ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రజలకు మరోసారి మాట ఇస్తున్నాం’. ఇదీ ఆ ప్రకటన సారాంశం. నిజానికి తెలంగాణలో తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వ్యామ్యబద్ధమైన పాలన నడిచింది. కానీ కొంతమంది కావాలని అసత్య ఆరోపణలు చేసి, కొంత దుష్ప్రచారం చేశారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు ఈ ఏడో గ్యారెంటీని సైతం తుంగలో తొక్కడం మొదలైంది.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో కక్షసాధింపు రాజకీయాలు, కుట్రపూరిత కేసులు, దాడులు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడం, అరెస్టులు చేసి జైళ్లకు పంపడంతోపాటు కొన్నిచోట్ల భౌతిక దాడులకు తెగబడి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను హత్య చేశారు అధికార కాంగ్రెస్ పార్టీవారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు వెనక్కి తగ్గకపోవడంతో సోషల్ మీడియాను నియంత్రించే కొత్త చట్టం తీసుకొస్తాం అని కొంతకాలంగా రేవంత్‌రెడ్డి అంటున్నారు.
అన్నట్టే ఆయన కర్నాటక అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ (విద్వేష ప్రసంగం) బిల్లును కాపీ చేసి రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 30న తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు-2026 ప్రవేశపెట్టారు. పేరు చూస్తేనేమో విద్వేష ప్రసంగాలను నియంత్రించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించినా, ఆ బిల్లును జాగ్రత్తగా చదివినా, లేదా ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు విన్నా వాళ్ల అసలు ఉద్దేశం అర్థమైపోతుంది. కేవలం రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆన్లైన్ జర్నలిస్టులను టార్గెట్ చేయడమే ఈ విద్వేష చట్టం అసలు లక్ష్యం.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో భావప్రకటనా స్వేచ్చను హరించే పలు ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడిన, రాసిన, లేదా ప్రసారం చేసిన మాటలను ఆధారం చేసుకొని వారిపైన ఇష్టారాజ్యంగా కేసులు పెట్టే అపరిమిత అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా తీసుకొస్తున్నది. హేట్ స్పీచ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ద్వారా కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా, సామాన్యులపై కక్ష సాధించేలా ఉన్నది. హేట్ స్పీచ్ అంటే ఏమిటి, దానికి ఏ శిక్షలు వేయాలి, అనేది ఇదివరకే బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) స్పష్టంగానే వివరించినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి, కొత్త నిర్వచనం ఇచ్చి, కొత్త శిక్షలు వేయాలని అనుకుంటున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అనేకమంది ఆన్లైన్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పలు అక్రమ కేసులు నమోదు చేసింది. కొన్ని నెలల క్రితం ఈ కేసుల మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించడం కిందికి వస్తుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టాలంటే పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
అయితే బుద్ధి మార్చుకోని రేవంత్ ప్రభుత్వం ఈ జడ్జిమెంట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవించి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. దీంతో దాదాపుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కొత్తగా కేసులు పెట్టే అవకాశాలు మూసుకుపోయాయని భావించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఈ కొత్త చట్టం తెచ్చి వారిని ఇబ్బంది పెట్టాలని యత్నిస్తున్నది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ‘హాబిచువల్ అఫెండర్” (తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తి) అనే పదానికి ఇచ్చిన నిర్వచనంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర వెల్లడవుతున్నది. ఒకటికన్నా ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తులను ‘హాబిచువల్ అఫెండర్” గాటన కట్టేసి, వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పరుస్తుంది.
మా ప్రాంతంలో కరెంట్ పోయింది అని ట్వీట్ చేస్తే, లేదా హైడ్రా ఇల్లు కూలగొడుతున్నది అని సోషల్ మీడియాలో పెడితే కూడా కేసులు పెడుతున్న రేవంత్ ప్రభుత్వ హయాంలో తీసుకొస్తున్నామని చెప్తున్న ఈ కొత్త చట్టంలో ఇలాంటి విపరీత నిర్వచనాలు సహజంగానే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ఆన్లైన్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ ‘హాబిచువల్ అఫెండర్లు’గా పరిగణించి వారి మీద ప్రభుత్వం నిర్బంధకాండకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ చట్టం కింద నేరాలు నమోదు చేసే అధికారులకు రక్షణ కల్పించడం వల్ల వారు ప్రభుత్వంలోని తమ బాసులను సంతోషపెట్టడానికి, చట్టాన్ని దుర్వినియోగపరచి అక్రమ కేసులు పెట్టి రెచ్చిపోయే అవకాశం ఉన్నది.
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు పెట్టడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి పరాకాష్ఠ. సీపీఐ, బీజేపీతో పాటు కొంతమంది కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం శుభ పరిణామం. గత్యంతరం లేని పరిస్థితిలో మరింత అధ్యయనం కోసం బిల్లును అసెంబ్లీ సెలెక్ట్ కమిటీకి పంపుతామని స్పీకర్ ప్రకటించారు. ఓవైపు పొద్దున లేస్తే రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకుని ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. కానీ ఆయన పార్టీ సహచరుడు రేవంత్‌రెడ్డి మాత్రం తనను కానీ, తన ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తే వారిని నల్లచట్టాలతో అణచివేయాలని చూస్తున్నారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామనే నినాదంతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి నిజంగానే ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం తీసుకొచ్చారు తెలంగాణలో. సోషల్ మీడియా వేదికగా మతం, కులం, జెండర్ తదితర అంశాల్లో విద్వేషపూరిత కంటెంట్ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో దాని నియంత్రణకు ఎవరూ అడ్డుచెప్పరు. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలను వాడుకొని విద్వేష ప్రసంగాలను, కంటెంట్‌ను కట్టడిచేసే అవకాశం ఉన్నా, అది వదిలేసి కఠినమైన చట్టాలను తీసుకొచ్చే యత్నం వెనుక ఉన్న దురుద్దేశాలను ఉన్న బుద్ధిజీవులు అందరూ ప్రశ్నించాలి. పౌరసమాజపు ప్రతినిధులు ఈ బిల్లును నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. ‘దీనివల్ల మాకేమీ నష్టం లేదు‘ అనే అలసత్వం కనబరిస్తే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద కూడా ఈ నల్లచట్టాన్ని ప్రయోగిస్తే మాట్లాడేవాళ్లెవరూ మిగలరని గుర్తుంచుకోవాలి.
కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత ఈ హేట్ స్పీచ్ బిల్లును తీసుకొచ్చినప్పుడు అక్కడ పౌర సమాజం, మీడియా, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు పౌర హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని సిద్దరామయ్య ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. కానీ ఇది జరిగి మూడు నెలలు దాటినా ఆ రాష్ట్ర గవర్నర్ బిల్లుకు ఆమోదం పలుకలేదు. బిల్లు చట్టంగా మారితే దాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేసేందుకు పలువురు యాక్టివిస్టులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. కర్నాటక చట్టాన్నే కాపీ కొట్టినందున తెలంగాణలోనూ అదే పరిస్థితి ఎదురవడం ఖాయంగా కనిపిస్తున్నది.
– కొణతం దిలీప్