స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జనం ముందు నిరూపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న నాటకానికి తెరపడే సమయం వచ్చేసింది. పంచాయతీరాజ్, పురపాలక ఎన్నికల్లో అన్ని బలహీనవర్గాలకు ఇచ్చే కోటాలన్నీ కలిపితే, అవి 50 శాతానికి మించకూడదని తెలంగాణ హైకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చివరి నాటకంతో చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలను ఎలా మాయ చేయాలా? అని ఆలోచిస్తున్నది.
బీసీ జనాభాకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను మొదట తామే 42 శాతానికి పెంచుతున్నామంటూ కాంగ్రెస్ సర్కారు మొదటినుంచీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది. వాస్తవానికి తెలంగాణలో బీసీల జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే ప్రకారం 57.6 శాతం ఉందని తేలినా, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి వెనుకబడిన తరగతులు చైతన్యంతో ఉన్న నేలపై గొప్ప సామాజిక విప్లవం తీసుకొస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ చోటా నేత వరకూ గత కొన్ని వారాలుగా ఎనలేని ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు, బీహార్‌లో గతంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం జరిపిన కులగణనతో ఏ మాత్రం పొంతన లేని రేవంత్ సర్కారు కులాల జమాబందీపై కూడా ఢిల్లీ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలాంటి సొంత డబ్బాల మోతను తెలంగాణ ప్రజలు నమ్మరు. అయితే, దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఈ గొప్పల ముదుసలి పార్టీ కాంగ్రెస్ (గ్రాండ్ ఓల్డ్ పార్టీజీవోపీ) తెలుగునాట గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఏనాడూ వెనుకబడిన తరగతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోలేదు. అన్ని విధాలా బీసీలను బలోపేతం చేసే చట్టాలు చేయలేదు. అలాంటిది, 2023 ఆఖరులో బొటాబొటి మెజారిటీతో శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత బీసీలను బురిడీ కొట్టించడానికి, ఉత్తుత్తి సాధికారత వారికి వచ్చేలా కృషి చేస్తున్నామని చూపించుకోవడానికి కొన్ని నెలలుగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ‘42 శాతం బీసీ స్థానిక ఎన్నికల కోటా’ను బ్రహ్మాస్త్రంగా ఎంచుకోవడమే ఆలోచనాపరులకు వింతగా కనిపిస్తున్నది.
2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఈ 23 మాసాల్లో వెనుకబడిన కులాల అభ్యున్నతికి చేసిందేమీ లేదని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 జారీచేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు కనీసం మూడోవంతు ప్రాతినిధ్యం అయినా కల్పించలేదు. అలంకారప్రాయమైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిని ఓబీసీ కుటుంబంలో జన్మించిన నాయకుడికి ఇవ్వడం ఒక్కటే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చేసిన గొప్ప సామాజిక న్యాయం. ఇది మినహా తెలంగాణ సర్కారు బీసీల కోసం ప్రత్యేకంగా తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలు గాని, చర్యలు గాని కనిపించడం లేదు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటా ఎలా ఇవ్వాలి? అనే అంశంపై రేవంత్ సర్కారుకు స్పష్టత గాని, నిజాయితీ గాని లేవు. చిత్తశుద్ధి లేకుండా రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలను మోసగించడానికి వేసిన పన్నాగం ఆరంభం నుంచీ గందరగోళంగా సాగింది.
బీసీల కోటాను స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతానికి పెంచడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నించామని, న్యాయస్థానాలే అడ్డుపడ్డాయని చివరికి సమర్థించుకోవడానికి కాంగ్రెస్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నది. అందుకే బీసీ కోటాను పెంచుతూ గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ, అసెంబ్లీలో తీర్మానం, ప్రభుత్వ జీవో, దాని అమలుకు మరో రెండు జీవోలు (41, 42 జీవోలు) జారీ వంటి అడ్డగోలు గొలుసుకట్టు ప్రక్రియ ద్వారా ఆడిన ‘చట్టపరమైన, విధానపరమైన’ నాటకాలు రక్తికట్టలేదు. బీసీల సాధికారతకు కాంగ్రెస్ అంకితభావంతో పనిచేస్తున్నదని సాధారణ ప్రజానీకాన్ని నమ్మించలేకపోయాయి రేవంత్ సర్కారు ఎత్తుగడలు.
దశాబ్దాల పోరాటం, బడుగు వర్గాల ఎన్నో త్యాగాల తర్వాత 2014లో సాధించుకున్న తెలంగాణలో వెంటనే జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సాగనంపారు కొత్త రాష్ట్ర ప్రజానీకం. బీఆర్ఎస్ సుపరిపాలన తర్వాత నాలుగున్నర సంవత్సరాలకు 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టారు తెలంగాణ జనం. అయితే, దాదాపు రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి పొరపాటు చేశామా? అని ప్రజలు ఆలోచిస్తున్న సమయంలో స్థానిక ఎన్నికలు హడావుడిగా జరిపించి, బీసీలకు 42 శాతం కోటా నినాదంతో విజయం సాధించాలన్న కాంగ్రెస్ వ్యూహానికి న్యాయస్థానాలు అడ్డుకట్ట వేయడం న్యాయకోవిదులకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏ మాత్రం కాదు. అయితే, ఎందరెందరో తెలివైన పాలకులను వారి నిర్వాకాల కారణంగా ఎన్నికల్లో నిర్భయంగా ఓడించిన తెలంగాణ ఓటర్లను కేవలం ’42 శాతం కోటా’ నిర్ణయం అమలు ద్వారా ఆకట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం వారి అహంభావానికి, అంచనాలకు మించిన ధీమాకు అద్దంపడుతున్నది.
అధికారంలో ఉండగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి పట్టని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి బీసీ పక్షపాతిగా అవతారమెత్తడానికి ప్రయత్నించడం నిజంగా దుస్సాహసమే. 1990 ఆగస్టు మాసంలో నాటి నేషనల్ ఫ్రంట్ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రభుత్వం పూర్వపు మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ (అది కూడా తొలిసారి) ఆదేశాలు జారీచేసి విప్లవాత్మక సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది. అదేస్థాయిలో తాము తెలంగాణలో బీసీలకు మునుపెన్నడూ లేని విధంగా మేలు చేసే చర్యను 42 శాతం కోటా రూపంలో తీసుకున్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది.
2023 ఏడాది ఆఖరి మాసంలో తెలంగాణలో తొలిసారి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ నాటకాలకు తెరతీసింది. అంతకుముందు తెలంగాణలో దశాబ్దం పాటు రాజ్యాంగబద్ధంగా, ప్రజల మద్దతుతో జనరంజకంగా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వ పరిపాలన సాగింది. ప్రజాపాతినిధ్య వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది. అయితే, తెలంగాణ పుట్టిన పదేండ్లకు ఆలస్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమది మాత్రమే ప్రజలు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం అనే రీతిలో ‘ప్రజాపాలన’ అనే మాటకు వింత ప్రచారం కల్పించింది. పేరుకు ప్రజాపాలనే గానీ, తెలంగాణలో సాగుతున్నది ఫక్తు కాంగ్రెస్ సంస్కృతితో నడిచే ఏలుబడి అనే విషయం రెండేండ్లలోపే ప్రజలు గ్రహించారు.
రెండేండ్ల పాలన తర్వాత జనంలో పరువు పలచనవుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యమే రేవంత్‌రెడ్డి సర్కారును బీసీ కోటా విషయంలో ఫలితం లేని ‘భరత నాట్యం’ చేయిస్తున్నది. బీసీ కోటాపై తాను హడావుడిగా, ఎలాంటి సంకల్ప బలం లేకుండా తీసుకున్న నిర్ణయం, జారీచేసిన ఆదేశాలు అమలు సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్, తీర్మానం, జీవోలు, తాజాగా కోర్టులో ‘న్యాయపోరాటం’ పేరుతో నాటకాలాడుతున్నది.
త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపినా, 42 శాతం కోటా నాటకం చూసిన జనం పాలకపక్షాన్ని గుడ్డిగా గెలిపించే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. చివరికి రాహుల్‌గాంధీ బుర్రలో పుట్టినట్టుగా ప్రచారం చేసుకున్న కులగణన మాదిరిగానే.. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం తో బయటకు తీసిన బ్రహ్మాస్త్రం ‘42 శాతం బీసీ కోటా’ న్యాయస్థానాల ఆమోదముద్రకు దూరమైనట్టు, జనాదరణ పొందడంలోనూ విఫలమవుతుందనడంలో ఎలాం టి సందేహం లేదు. తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రి రాజకీయ విన్యాసాలకు ప్రజల మద్దతు లేదని, పాలకపక్షంపై జనాగ్రహం తీవ్రస్థాయిలో ఉందని కొన్ని వారాల్లో జరిగే పంచాయతీరాజ్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు తప్పక నిరూపిస్తాయి.
– నాంచారయ్య మెరుగుమాల