దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు వింటుంటే ‘చెప్పేవి నీతులు, తీసేవి గోతులు’ అనే నానుడి గుర్తుకు వస్తున్నది. ఉద్యమ సారథి కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని రేవంత్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాతైనా నిజం మాట్లాడుతారనుకుంటే అవే అబద్ధాలతో కాలం వెళ్లదీ స్తున్నాడు. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడమే ఆయన పని. ఇప్పటికే దేశంలో ఉన్న తెలంగాణ పతారను పాడుజేసిండు. అందుకే ఆయన ఎక్కడడిగినా అప్పు పుట్టడం లేదు.
గత ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను పక్కనబెట్టి ప్రతిపక్ష నాయకుల ఖ్యాతిని పలుచన చేయాలని పూనుకున్నది. నాడు కేసీఆర్ పాలనలోనైనా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా రేవంత్ లక్ష్యం ఒక్కటే.. తెలంగాణను బద్నాం చేయడం, ఇక్కడి ప్రజలను ఆగం చేయ డం. తెలంగాణను బలిపీఠం ఎక్కించేందుకు చేయాల్సినదంతా చేసి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. అందులోనూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, తెలంగాణ ఆగమవుతుంటే సం కలు గుద్దుకుంటున్నాయని చేయడం సిగ్గుచేటు. అసలు తెలంగాణను ప్రగతిబాట పట్టించిందెవ్వరు? తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదెవ్వరో తెలంగాణ సమాజానికి తెలువదా? తెలంగాణ ప్రదాత, అభివృద్ధి విధాత కేసీఆర్పై ద్వేషంతో తెలంగాణను సర్వనాశనం చేయాలన్న కుటిలబుద్ధితో మొదటి నుంచి రేవంత్రెడ్డి చేస్తున్న ప్రచారాలను తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నది. కేవలం కేసీఆర్ను బద్నాం చేయాలని నాడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పిన రేవంత్, అధికారంలో వచ్చినాక ఖజానా ఖాళీ అయిందని, తమకు ఎక్కడా అప్పులు పుట్టడం లేదని కాకి కబుర్లు చెప్తున్నారు.
కేసీఆర్ హయాంలోని పదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4.19 లక్షల కోట్లు అప్పులు చేయగా, అదే రేవంత్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలో రూ.1.58 లక్షల కోట్ల అప్పులు చేసిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఒక సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పటికే అప్పులు ఎక్కువయ్యాయని, ఇక అప్పులు చేయబోనని కొత్త నాటకమాడారు. రానున్న మూడున్నరేండ్లలో ఇంకో రూ.4.5 లక్షల కోట్లు అప్పు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రకటించడం గమనార్హం. ఎప్పుడేం మాట్లాడుతున్నారో తనకే తెలియకుండా అపరిచితుడిలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని చూసి సొంత పార్టీ నేతలే నెత్తి గోక్కుంటున్నారు. ఇలా తెలంగాణను కాటికి పంపేందుకు స్వయంగా పాడే కట్టింది చాలక.. ఇప్పుడు ప్రతిపక్షాలపై నిందలు వేస్తుండటం సిగ్గుచేటు.
రేవంత్ అండ్ కో మొదటినుంచి చేస్తున్న పన్నాగం ఒక్కటే.. ఎక్కడేం జరిగినా బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేయడం. ఎక్కడ, ఏ విపత్తు జరిగినా ‘గత ప్రభుత్వ తప్పిదం’ అంటూ గంతులు వేయడం రేవంత్ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు కొట్టుకుపోయింది. వందల కోట్ల నష్టం జరిగింది. ఈ ఘటనను కూడా బీఆర్ఎస్పై రుద్దేందుకు ప్రభుత్వ పెద్దలు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత సుంకిశాల రిటైనింగ్ వాల్ పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు ఐదు రోజుల వరకు కాంగ్రెస్ పాలకులు ప్రయత్నించారు. మొత్తానికి బయటపడటంతో దీన్నీ బీఆర్ఎస్ తప్పిదంగా చూపించేందుకు ఆరాటపడ్డారు. ఆపై ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని కూడా బీఆర్ఎస్పై నెట్టేందుకు విఫలయత్నం చేశారు. రేవంత్ చేసిన తప్పుడు ప్రచారాలు, ఘనకార్యాల వల్ల తెలంగాణ ఆగమైపోతుండటంతో ఆ నెపాన్ని కూడా బీఆర్ఎస్కు అంటగట్టేందుకు చూస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ అసెంబ్లీ సాక్షిగా అప్పులు పుట్టడం లేదంటూ కొత్త నాటకానికి తెరలేపారు.
ఎవ్వరు తీసిన గోతిలో వారే పడతారన్నట్టు.. రేవంత్ చేసిన అప్పుల అసత్య ప్రచారం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నది. ఫలితంగా తెలంగాణ అభివృద్ధి రథం ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. అందుకే ఏం చేయాలో తెలియక రేవంత్ తన తప్పులను పక్కవాళ్లపై నెట్టేసి మెల్లిగా జారుకోవాలని చూస్తున్నారు.
– డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్