Congress | దగా అంటే ఏమిటో.. మోసం ఎలా చేయవచ్చో.. రాష్ట్ర రైతాంగానికి తెలిసివచ్చినట్టుగా మరెవరికీ అనుభవంలోకి రాలేదు. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైన కాంగ్రెస్ సర్కారు తీరే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరచేతిలో స్వర్గం చూపినట్టు అన్నదాతలకు రైతు భరోసా ఆశచూపి అసలు రైతుబంధుకు ఎసరుపెట్టింది. ఈ కీలక హామీ అమలుపై అర్హులెవరో, అనర్హులెవరో తేలుస్తామనే సాకుతో మోకాలడ్డుపెట్టి ఏడాది కావస్తున్నది. ఇంకా మార్గదర్శకాలు, విధివిధానాలు, కమిటీలు, నివేదికలంటూ తాత్సారం చేస్తూనే ఉన్నది. టింగ్ టింగ్‌మని మోగే సెల్ఫోన్లు మూగబోయాయి. వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను విముక్తం చేయాలన్న సమున్నత లక్ష్యం తో నాటి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధుతో పాటు ఆపద కాలంలో ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని కూడా అమలు చేసింది.
కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కాలాలు మారుతున్నా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం మాత్రం పడుతున్న దాఖలా కనిపించడం లేదు. లెక్కాపత్రం ఖరారు కాని కారణంగా కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీ అయిన పంటల బీమా ఇంకా పట్టాలెక్కనే లేదు. ఇక మూడోది, రైతు కు అతి ముఖ్యమైనదీ అయిన రుణమాఫీ ఓ ప్రహసనంలా తయారైం ది. ఏడాదికాలంలో సర్కారు రుణమాఫీపై వేసినన్ని కుప్పిగంతులు మరి దేనిమీదా వేయలేదేమో. రేపుమాపనే బుకాయింపులకు ఇక తెరపడినట్టే. సర్కారు తీరును పసిగట్టినవారు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ఇంకా ఆశలు పెట్టుకున్నవారికి ఇంతే సంగతులు అని చావుకబురు చల్లగా చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
వందరోజుల్లోనే రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరూ అప్పు తిరిగి కట్టరాదని, సోనియాగాంధీ కడతారని పీసీసీ అధ్యక్షుడి హోదాలో నాడు రేవంత్‌రెడ్డినే స్వయంగా అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సవాలక్ష సాకులతో ఎగ్గొట్టాలని చూశా రు. ఇప్పుడు సినిమా పూర్తి కాకుండానే సీఎం రేవంత్ ‘ఎండ్ కార్డు’ వేశారు. మొదట్లో రూ.39,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిన సర్కారే క్రమంగా అంచనాలను రూ.31 వేల కోట్లకు తగ్గించింది. మళ్లీ ఇప్పుడు రూ.20 వేల కోట్లతో సరిపెట్టి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకున్నది. పంచపాండవుల సామెతను గుర్తు చేస్తూ హళ్లికి హళ్లి, సున్నకు సున్న అని సరిపెట్టి చివరి విడత పూర్తయిందని దబాయించడం, బ్యాంకర్ల తప్పిదాలతో అంచనా రూ.11 వేల కోట్లు పెరిగిందని బుకాయించడం సీఎం రేవంత్‌కే చెల్లింది. తెల్ల రేషన్‌కార్డు లేని వాళ్లు, రూ.2 లక్షల పైచిలుకు రుణాలు కలిగినవాళ్ల మాటేమిటనేది ప్రశ్నగానే మిగిలింది.
రైతులు నల్లచట్టాలపై ఢిల్లీని ముట్టడించినప్పడు వారి పక్షాన ఉన్న ట్టు కల్లబొల్లి కబుర్లు చెప్పిన కాంగ్రెస్‌కు రైతులపై ప్రేమ ఏ మాత్రం ఉందో రాష్ట్ర సర్కారు హామీలపై వేసిన కుప్పిగంతులే తెలియజేస్తున్నాయి. మరోవైపు భూముల స్వాధీనం పేరిట సాగిస్తున్న పోలీసు రాజ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. రైతన్నలు తిరగబడి విరగపోట్లు పొడిస్తే ప్రభుత్వం పలాయనం చిత్తగించడమూ జరుగుతున్నది. అమలు సాధ్యం కాని హామీలు, ఆపై గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న గారడీ తేటతెల్లమైపోయింది. అలవిమాలిన హామీలు ఇవ్వొద్దంటూ ఆ పార్టీ పెద్దలే సన్నాయి నొక్కులు నొక్కడం విడ్డూరం. కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి ఇది నిదర్శనం. ఎడాపెడా హామీలు ఇచ్చేసి, కొర్రీలతో కోతలు పెట్టే మోసకారి ధోరణిపై అన్నదాత కన్నెర్రజేసే రోజులు ఎంతో దూరంలో లేవని రేవంత్‌రెడ్డి సర్కార్ గుర్తిస్తే మంచిది.