కాంగ్రెస్ పాలనలో భూదాహం బుసలు కొడుతున్నది. కర్కశత్వం కాటువేస్తున్నది. అది ఏ భూమైనా కావచ్చు. లగచర్లలో పేద గిరిజన భూములా? అసైన్డ్ భూములా? అటవీ భూములా? ఏ లేబుల్ తగిలించి ఉంటేనేం, కబళిస్తే పోలా? అనేది కాంగ్రెస్ పాలసీగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కబళించేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) భూములపైకి దృష్టి మరల్చింది. యూనివర్సిటీ ఆవరణలో ఉపయోగించకుండా ఉన్న 50 ఎకరాల భూమిని అప్పగించాలని షోకాజ్ నోటీసు జారీచేసింది. సంపద పెంచడం, పదుగురికీ పంచడం చేతకాని సర్కారు భూములను తెగనమ్ముకోవడాన్నే నమ్ముకుంటున్నది.
చదువు పెద్దగా ఉండక్కర్లేదని చెప్పే సీఎం పాలనలో విద్యాసంస్థల భూములకు ముప్పు ఏర్పడుతున్న ది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేటాయించిన భూమిలో ఎక్కడ ఏ మాత్రం ఖాళీ కనిపించినా గద్దలా సర్కారు వాలిపోతున్న ది. ఈ దిగజారుడుతనంపై మనూ విద్యార్థులు భగ్గుమంటున్నారు. సర్కారు ఎత్తుగడపై నిరసనలకు దిగుతున్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో అంగుళం కూడా వెనుకకు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. గత ఏడాది హెచ్‌సీయూ భూముల కోసం జరిగిన పోరాటంలో అక్కడి విద్యార్థుల పోరాటాన్ని ఇది గుర్తుచేస్తున్నది.
భూ దాహం కాంగ్రెస్ సంతకంలా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే కాంగ్రెస్ పాలకులు భూమి చుట్టూ తిరుగుతున్నారు. 420 హామీల ను తుంగలో తొక్కి ‘భూమంతర్’ మాయాజా లం మొదలుపెట్టారు. హిరణ్యకశిపుని వారసు లం మేమేనంటూ భూమిని చెరపట్టారు. ఈ భూ మాఫియా ఎంతకైనా తెగిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచె భూముల విధ్వంసం మరచిపోగలమా? అక్క డ అడవే లేదని బుకాయించారు. బుల్డోజర్లు నడిపించారు. జింకలు చెదిరిపోయాయి. నెమ ళ్లు బెదిరిపోయాయి. పచ్చదనం భగ్నమైపోయిం ది. నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసు లాఠీ విరిగింది. చివరికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగి అక్షింతలు వేస్తే ఆక్రమణ ఆగిపోయింది. లగచర్లలో అమాయక రైతుల భూమి చెక్కలపై కన్నేసిన కాంగ్రెస్ భూ మాఫియా అక్కడ నరకం సృష్టించడం ఇంకా కండ్ల ముందు మెదులుతూ నే ఉన్నది. ఊళ్ల మీద పడి ఆడబిడ్డలు, చిన్నారు లు అనే కారుణ్యం ఏమీ లేకుండా తరిమి తరి మి కొట్టారు. తమకు ఇంత బువ్వ పెట్టే భూతల్లి కాంగ్రెస్ గూండా రాజ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపార సరుకుగా మారకుండా బక్క రైతులు ప్రాణాలకు తెగించి పోరాడటం ఓ చరిత్ర.
ఇలా ఒకటి వెనుక ఒకటిగా ఎదురుదెబ్బలు తగిలి బొక్కబోర్లా పడుతున్నా నక్కలు బొక్క లు వెతుకును అన్నట్టు సర్కారు భూముల వేట ఆగిపోలేదు. భూముల కోసం రాష్ర్టాన్ని జల్లెడ పడుతూనే ఉన్నారు. ప్రతిఘటిస్తే వెనుకకు తగ్గుతున్నారు. సంపద సృష్టించే ఒడు పు తెలియని సీఎం ఖజానా ఖాళీ, అప్పు పుట్ట డం లేదని పతార కొట్టు మాటలు మాట్లాడి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. గతంలో ప్రభుత్వా లు భూములు స్వాధీనం చేసుకొని అమ్మలేదా? అంటే అమ్మి ఉండవచ్చు. నికరంగా అదనం అని తేలితే సందర్భాన్ని బట్టి, డిమాండ్‌ను బట్టి అమ్ముకోవచ్చు. కానీ అదే పనిగా భూముల మీద పడటం భావ్యం కాదు. సీఎం రేవంత్ పూర్వాశ్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు రాష్ట్రం ఓ పెద్ద వెంచర్లా మారడమే అసలు సమస్య. సర్కారు ఖర్చుల కోసమైనా, సర్కారు పెద్దల జేబులు నింపడానికైనా భూమి ఒక్కటే తారకమంత్రం కావడం రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరం.