కేసీఆర్ పాలనలో తెలంగాణ ఒక ఆదర్శం. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర పురోగతిని చూసి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చి వాలాయి. పురస్కారాలు, ప్రోత్సాహకాలు తలుపుతట్టాయి. కానీ, ఇప్పుడు తెలంగాణ వైఫల్యానికి నిదర్శనం. ఒక్క యాడాదిలోనే తెలంగాణకు అడుగడుగునా అవమానాలు. వేదిక ఏదైనా చీదరింపులు, ఛీత్కారాలు తప్పడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలకుడు అంటే ఇలా ఉండాలని నాడు కేసీఆర్ ఉదాహరణగా నిలవగా.. పాలకుడు ఇలా ఉండొద్దని నేడు రేవంత్‌ను ఉదహరించే పరిస్థితి వచ్చింది.
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నది. దోపిడీ, దౌర్జన్యం, దాడులు తప్ప కాంగ్రెస్ పాలనలో మరొకటి కనిపించడం లేదు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. హామీల అమలు సంగతి దేవుడెరుగు, కనీసం విద్యార్థులకు మూడు పూటలా మంచి భోజనం పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పేదల ఇండ్లపైకి జేసీబీలు, ప్రతిపక్ష నాయకుల ఇండ్లపైకి ఏసీబీ నోటీసులు పంపించడానికి రేవంత్ సర్కార్ తాపత్రయపడుతున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు సాగుతున్నది.
ఏ ప్రభుత్వానికైనా మొదటి ఏడాది కాలం చాలా కీలకం. తొలి ఏడాదిలో ఎంచుకునే మార్గాన్ని బట్టే చేరుకునే లక్ష్యం ఉంటుంది. ఈ ఐదేండ్ల కాలంలో కాంగ్రెస్ లక్ష్యం ఏమిటనేది వారి మొదటి ఏడాది పాలన చెప్పకనే చెప్పింది. అధికారంలోకి వచ్చిన మొదట్లో కాళేశ్వరం, విద్యుత్తు కమిషన్ల పేరిట కక్ష సాధింపు వైపు వడివడిగా అడుగులు వేసిన కాంగ్రెస్ సర్కార్.. నేడు ‘ఫార్ములా-ఈ’ కార్ రేసుపై స్వారీ చేస్తూ తెలంగాణ విధ్వంసం దిశగా పరుగులు పెడుతున్నది. రాజకీయ ప్రేరేపిత కేసును ముందటేసుకుని సంబురాలు చేసుకుంటున్న కాంగ్రెస్.. దానివల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని విస్మరిస్తున్నది. ఇప్పటికే ఏడాది కాలంగా పెట్టుబడుల్లేక, పరిశ్రమలు రాక పడకేసిన రాష్ట్ర ప్రగతిని కాంగ్రెస్ పూర్తిగా పండబెడుతున్నది. ‘ఫార్ములా- ఈ’ లాంటి అంతర్జాతీయ ఈవెంట్‌పై బురదజల్లి కక్షసాధింపులకు దిగితే పెట్టుబడులు రావనే కనీస ఇంగితజ్ఞానం పాలకులకు లేకపోవడం శోచనీయం.
తెలంగాణలో ఇంతటి విధ్వంసం జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరం. గతంలో కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రులపై పెత్తనం చెలాయించేది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఆ పార్టీ ముఖ్యమంత్రులే అధిష్ఠానం మెడలు వంచి స్వారీ చేస్తున్నారు. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాలు సర్వనాశనం అవుతున్నా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. వారు ఆయా రాష్ర్టాలను నాశనం చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఈ విషయంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి కంటే ముందున్నారు.
తెలంగాణలో సర్కార్ వైఫల్యాలు కాంగ్రెస్‌కు ఇతర రాష్ర్టాల్లోనూ నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటికే పక్కనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణలో అమలుకాని హామీలను ప్రచారం చేసి కాంగ్రెస్ చేతులు కాల్చుకున్నది. ఇప్పుడు రేవం త్ సర్కార్ హామీల వైఫల్యం సెగ ఢిల్లీని తాకింది. ఇటీవల రైతు భరోసాలో మోసం చేసిన తీరుపై ఏఐసీసీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం సృష్టించాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలనెలా రూ. 2,500 ఇస్తున్నట్టు చెప్పి ఆ పార్టీకి మరింత నష్టం చేశారు. కాంగ్రెస్ ఇస్తున్న వారెంటీ లేని గ్యారెంటీలు, రేవంత్ సర్కార్ వైఫ ల్యం గురించి ఇప్పుడు ఢిల్లీ ఓటర్లకు కూడా తెలిసిపోయింది. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రచారం చే సి కాంగ్రెస్‌ను ఓడించిన రేవంత్ ఇప్పుడు ఢిల్లీ లో కూడా ఆ పార్టీ ఓటమికి బాటలు పరిచారు.
రేవంత్ ప్రభుత్వం వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఇతర ముఖ్యమంత్రుల పాలనా తీరు కారణంగా ఇండియా కూటమిలోనూ ముసలం మొదలైంది. కాంగ్రెస్ వల్ల తమకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని కూటమిలోని ఇతర పక్షాలు గ్రహించాయి. అందుకే కాంగ్రెస్‌ను దూరం పెట్టేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీకి ఇండియా పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వస్తుండగా.. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తమ పీఠం కూకటివేళ్లతో సహా కదలడం ఖాయమని భావిస్తున్న ఆప్ ఆ పార్టీని దూరం పెట్టేసింది. ఇక అక్కడ కాంగ్రెస్ పోరాడేది డిపాజిట్ల కోసమే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పదవిలో ఉన్నంత మాత్రాన మన పేరు చిరస్థాయిగా నిలిచిపోదు. కేసీఆర్ పేరును చెరిపేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ నేడు తన పేరు ను అందరికీ గుర్తు చేయాల్సిన పరిస్థితికి వచ్చా రు. మనం చేసే పనులే మనకు పేరును తెచ్చి పెడతాయి. అవి మంచి పనులా? మందిని ముంచే పనులా? అనేది రేవంత్ ఇకనైనా నిర్ణయించుకోవాలి. లేకపోతే పాలకుడు ఇలా ఉండకూడదు అన్నదానికి శాశ్వత ఉదాహరణగా ఆయన పేరు చరిత్రపుటల్లో నిలిచిపోవడం ఖాయం.
– ఓ నరసింహారెడ్డి 80080 02927