కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఛత్తీస్‌గఢ్ సహా ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపేందుకు కృషిచేయాలని, శాంతి చర్చలకు నేతృత్వం వహించాలని,
తద్వారా ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రొఫెసర్ హరగోపాల్, భారత్ బచావో నేషనల్ వైస్ చైర్మన్
డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్, సోషల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ నందిని సుందర్, కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఆర్‌వో) కాంతి చైతన్య తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం, టీపీసీసీ అధ్యక్షుడితో తొలుత ఈ విషయమై చర్చించాలని వారు కోరారు. ఆ లేఖలోని అంశాలు క్లుప్తంగా…
శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసీసీ అధ్యక్షుడు
జాతీయ అత్యయిక పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో మేము (శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ) మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. సంక్లిష్టతలకు మారుపేరుగా మారిపోయిన, రాజకీయ సంక్షోభం లోతుగా పాతుకుపోయిన ఆదివాసీ వర్గాల మెజారిటీ ప్రాంతాలు బస్తర్ (ఛత్తీస్‌గఢ్), గడ్చిరోలి (మహారాష్ట్ర), పశ్చిమ సింగ్భూమ్లో (ఝార్ఖండ్) గత కొన్నేండ్లుగా సాయుధ ఆపరేషన్లు నాటకీ యంగా ఊపందుకున్నాయి. మరీ ముఖ్యంగా 2024 జనవరి నుంచి ఈ ఆదివాసీ ప్రాంతా ల్లో మిలటరీ ఆపరేషన్లు ఎక్కువయ్యాయి. ఒక్క బస్తర్‌లోనే 400 మందికి పైగా పౌరులు మరణించారు. వీరిలో చాలామంది చిన్నారులు కూడా ఉన్నారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో కొనసాగుతున్న దోపిడీ, భూముల స్వాధీనం, ప్రజా సమస్యల పట్ల వ్యవస్థల నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల ఈ విపత్కర పరిస్థితి తలెత్తింది.
జాతీయ విధానానికి దిశానిర్దేశం చేసే అంతిమ రాజ్యాంగ బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకీయ అవకాశం లభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సాయుధ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, శాంతిచర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కాల్పుల విరమణకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ.. ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పలుమార్లు బహిరంగంగా ప్రకటించింది. సాయుధ బలగాలు నేరుగా దాడికి పాల్పడితే తప్ప.. ఎలాంటి చర్యలకు దిగొద్దని తన క్యాడర్‌కు మావోయిస్టు పార్టీ ఆదేశించినట్టు 2025 ఏప్రిల్ 22న ఓ యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో సీనియర్ మావోయిస్టు నాయకుడు రూపేశ్ స్పష్టంగా చెప్పారు. ఏకపక్ష కాల్పుల విరమణను ఈ ప్రకటన తెలియజేస్తున్నది.
షరతులు లేని చర్చలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేయడం విరుద్ధమైన సందేశాన్ని పంపుతున్నది. మావోయిస్టులు శాంతి కోసం స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ, అటువంటి చర్యలను కొనసాగించడం వల్ల చర్చలు ప్రారంభం కాకముందే ముగిసే ప్రమాదం ఉంది.
కాల్పుల విరమణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని మేము మిమ్మల్ని,మీ పార్టీని కోరుతున్నాం. సాయుధ బలగాలను ఉపయోగించడాన్ని నిలువరించడం, శాంతిచర్చలు ప్రారంభించేందుకు ఇప్పుడు ఒక రాజకీయ నిర్ణయం అవసరం. మీరు ఈ అంశాన్ని ఇండియా కూటమిలోని అన్ని ప్రతిపక్ష పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. శాంతియుత మార్గాల ద్వారా ఈ సంఘర్షణను పరిష్కరించడానికి ఏదైనా సూత్రప్రాయమైన, ప్రజాస్వామ్య ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం.
ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని సైనిక కార్యకలాపాలను కేంద్రప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని, స్థానిక ఆదివాసీలతో కూడిన శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఈ క్రమలో మేము కొన్ని డిమాండ్లను ప్రతిపాదిస్తున్నాం.
1.శాంతి చర్చలకు వీలుగా ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్న అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తక్షణమే ఆపాలి.
2.సీపీఐ (మావోయిస్టు) ఇప్పటికే ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించింది. వారు ఆ హామీకి కట్టుబడి ఉండాలి.
3.ప్రభుత్వం, సీపీఐ (మావోయిస్టు) మధ్య శాంతి చర్చలు వీలైనంత త్వరగా ప్రారంభించాలి. అన్ని ఆదివాసీ గ్రూపులు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిఒక్కరినీ అందులో భాగస్వామ్యం చేయాలి.
4.ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లేందుకు మీడియా, స్వతంత్ర పౌరహక్కుల సంఘాలకు అనుమతి ఇవ్వాలి.
5.ప్రజల జోవనోపాధి అవసరాలను కల్పించా లి. రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలి.
6.ఆదివాసీల రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూ జైలుపాలైన ఆదివాసీ నేతలు, ఇతర హక్కుల నేతలు చర్చల్లో పాల్గొనేందుకు వీలుగా వారిని వెంటనే విడుదల చేయాలి.
శాంతి చర్చల కోఆర్డినేషన్ కమిటీ తరఫున
– ప్రొఫెసర్ హరగోపాల్,
శాంతిచర్చల కమిటీ, తెలంగాణ
– డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్,
నేషనల్ వైస్ చైర్మన్, భారత్ బచావో
– ప్రొఫెసర్ నందిని సుందర్, సోషల్ యాక్టివిస్ట్
– క్రాంతి చైతన్య, కోఆర్డినేషన్ ఆఫ్
డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఆర్‌వో)