పూర్వం ఓ చక్రవర్తి ఉండేవాడు. తన సామంత రాజ్యాల్లో పాలన ఎలా సాగుతుందో స్వయంగా చూడాలనుకున్నాడు. క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్టు చాటింపు వేయించాడు. దీంతో సామంత రాజులు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. చక్రవర్తి వస్తున్నాడు అని తెలియగానే ఓ సామంత రాజుకు కలవరం మొదలైంది. తన పాలనలో దివాలా తీసిన రాజ్యాన్ని చూసి చక్రవర్తి ఏమంటాడోనని భయం పట్టుకున్నది. ఇంతలో రాజుగారు ఊళ్లోకి ఏమీ రావట్లేదని, పొలిమేరల్లోనుంచే ఊరిని చూసి వెళ్తున్నారని ఎవరో చెప్పారు. దీంతో సదరు సామంత రాజు.. ఊళ్లోని దరిద్రం కనిపించకుండా.. పొలిమేరల్లో తాత్కాలికంగా ఓ రెండు అద్దాల మేడలను, ఆ పక్కనే ఓ అందమైన మందిరాన్ని, విడిదిని ఏర్పాటుచేశాడు. పొలిమేరల్లో నుంచి వెళ్తున్న రాజుగారు.. సదరు భవనాలను చూసి ‘అబ్బా.. ఎంత వైభోగంగా ఉంది ఈ ఊరు’ అంటూ మురుస్తూ వెళ్లిపోయారు. ‘కవరింగ్‌తో సూపర్ రిచ్ కలరింగ్’ ఇచ్చిన సామంత రాజు ఊపిరి పీల్చుకున్నాడు.
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.. బీజేపీ పాలనలో ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు కూడా ఆ సామంత రాజ్యంలాగే తయారయ్యాయి. ఓ వైపు ధరలు కొండెక్కాయి. నిరుద్యోగం తాండవిస్తున్నది. భద్రత ప్రశ్నార్థకమైంది. మొత్తంగా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, పారిశ్రామిక, సమానత్వ, పౌర స్వేచ్ఛ తదితర 50కి పైగా సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. అయితే, ఇదేమీ పట్టని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక పరిమాణంలో భారత్ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్టు మాత్రం ప్రచారం చేసుకుంటున్నది. ‘జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది’ అంటూ బీజేపీ పరివారం జబ్బలు చరుచుకొంటున్నది. మరికొద్ది రోజుల్లో జర్మనీని కూడా దాటేస్తామంటూ బీరాలకు పోతున్నది. దేశంలోని ఒక్క శాతం మంది కుబేరులను చూపించి ‘భారత్ సూపర్ రిచ్ కంట్రీ’ అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. భారత్ నిజంగానే సిరితో తులతూగుతున్నట్టయితే.. 80 కోట్ల మందికి ఉచిత బియ్యాన్ని మోదీ సర్కారు ఎందుకు సరఫరా చేస్తున్నట్టు? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. మనది ‘సూపర్ రిచ్’ మేడిపండు లింక్డ్ ఇన్‌లో హార్దిక్ జోషి అనే ఆర్థిక నిపుణుడు ఇటీవల చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వాస్తవికతకు దగ్గరగా ఉండటమే ఆ పోస్ట్ వైరల్ కావడానికి ప్రధాన కారణం. ‘భారత్‌లోని ఒక శాతం సంపన్నుల సంపదను ఆర్థికవ్యవస్థ నుంచి తొలగిస్తే, మన దేశం ఆఫ్రికన్ దేశాల సరసన చేరుతుంది’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌లో నిజం ఉన్నది.
ఆర్థిక పరిమాణంలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉన్నది అంటున్నారు.. అయితే, అలాంటి ఈ దేశంలో సగానికి పైగా ప్రజలు మూడు పూటలా తిండి తినే పరిస్థితి ఎందుకు లేదు? ఆకలి సూచీలో భారత్ 105వ ర్యాంకుకు ఎందుకు దిగజారింది? అనేది హార్దిక్ వంటి మేధావులు అడుగుతున్న ప్రశ్న.
ఒక విధంగా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరగటం అంటే కేవలం 10 మంది ఆస్తులు పెరగటం కానే కాదు. ఆ దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో గుణాత్మక మార్పు రావటం. అయితే, భారత్‌లో ఇది భిన్నంగా ఉన్నది. దేశ జనాభాలో ఒక్క శాతం ఉన్న సంపన్నుల దగ్గరే 40 శాతం సంపద పోగుపడిందని నివేదికల సారాంశం. కింద ఉన్న 50 శాతం మంది దగ్గర 3 శాతం మాత్రమే సంపద ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. భారతీయుల తలసరి ఆదాయం రూ.2.12 లక్షలుగా చెప్తున్న ఆర్థిక నిపుణులు.. బీహార్ వంటి రాష్ర్టాల్లో ఒక్కో పౌరుడు ఏడాదికి సంపాదిస్తున్న ఆదాయం రూ.50 వేలు కూడా దాటడం లేదన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. అంబానీ కుటుంబం ఆస్తులు, వ్యాపారాల విలువ రూ. 25 లక్షల కోట్లకు పైగా ఉందని లెక్కగడుతున్న నివేదికలు.. దేశంలోని ప్రతీ పౌరుడి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉన్నదన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నాయి. ఇక్కడే దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలకు బీజం పడుతున్నది.
దేశంలో కొవిడ్ ప్రబలిన తర్వాత ప్రజల ఆదాయం తీవ్రంగా పడిపోయింది. ఇందుకు భిన్నంగా సంపన్నులు, కార్పొరేట్ల ఆదాయం ఊహకు అందనంతగా పెరిగిపోయింది. కొవిడ్ కాలంలో దేశంలోని బిలియనీర్ల సంపద విలువ రూ.23.14 లక్షల కోట్ల నుంచి రూ.53.16 లక్షల కోట్లకు పెరిగింది. అదే సమయంలో కోట్లాదిమంది భారతీయులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి జారుకున్నారు.
కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరిచి ఆర్థికంగా ఎదిగేందుకు సాయపడుతున్న బీజేపీ సర్కారు.. పేద, మధ్యతరగతి విషయంలో సవతి తల్లి ప్రేమనే చూయిస్తున్నది. ఉదాహరణకు.. పేద, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు.. వేల కోట్ల రూపాయలు తీసుకొని విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ల అప్పులను మాత్రం రైటాఫ్ చేస్తున్నాయి.
ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో బ్యాంకులు ఇప్పటివరకూ రూ. 16.35 లక్షల కోట్లను రైటాఫ్ చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఒప్పుకున్నది. ఐక్య రాజ్య సమితి లెక్కల ప్రకారం.. కొవిడ్ ప్రబలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి జారుకున్న వారిలో సగం మంది భారతీయులే ఉన్నారు. బీజేపీ పరివారం చెప్తున్నట్టు సూపర్ రిచ్ అవుతున్న భారతదేశంలో మరే దేశంలో లేనంతమంది పేదలు ఎందుకున్నారు? సంపదలోనే కాదు పేదల సంఖ్యలోనూ భారత్ సూపర్ రిచ్ ఎందుకవుతుందో ఆలోచించకపోతే బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్న ఈ అంకెల గారడీనే నిజమైన అభివృద్ధి అని భ్రమలో పడే ప్రమాదం ఉన్నది. ఆర్థికాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మధ్య అంతరాలను కొలిచే ఆర్థిక గణాంకాలను ప్రతి పౌరుడూ గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దారితప్పి దౌడు తీస్తున్న ట్రబుల్ ఇంజిన్‌కు బ్రేకులు వేయాల్సిన అవసరమూ ఇప్పుడున్నది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ నిలిచిందని గర్వపడుతున్న ప్రతీ ఒక్కరూ.. తమ ఆర్థిక, సామాజిక స్థితిలో ఎంతమేర గుణాత్మక మార్పు జరిగిందో ఒకసారి బేరీజు వేసుకోవాలి. అప్పుడే భారత్ సూపర్ రిచ్ అనేది కవరింగో, కలరింగో తేలుతుంది.
‘కరోడ్‌పతి ట్యాక్స్’తో మేలు ప్రపంచంలో వివిధ దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు నిరుడు పలు కీలక సూచనలు చేశారు. సంపన్నులపై ‘కరోడ్‌పతి ట్యాక్స్’ విధించాలని సిఫారసు చేశారు. సంపదపై పన్ను, వారసత్వ పన్ను పేరిట ఈ ట్యాక్స్ ఉండాలని సూచించారు. రూ.10 కోట్ల వరకూ సంపాదన ఉన్నవారికి ఒకవిధంగా, రూ.100 కోట్ల సంపాదన ఉన్నవారికి కొంచెం ఎక్కువగా, రూ.100 కోట్లకు పైగా సంపాదన ఉన్నవారికి మరింత ఎక్కువగా ట్యాక్స్ ఉండాలని ఓ పట్టికను విడుదల చేశారు. ఈ సూచనలను మన దేశానికి అన్వయిస్తే.. సంపన్నుల నుంచి సేకరించిన డబ్బుతో సగటు భారతీయుడికి విద్య, వైద్యం, పోషకాహారం అందించే వీలు కలుగుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొండంత రాగం తీసి..భారత ఆర్థికాభివృద్ధి విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరి ‘కొండంత రాగం తీసి కూసంత పాట పాడిన’ చందంగా తయారైనట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. భారత్ ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం 8 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఉన్నదని 2015లో ప్రధాని మోదీ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. దీన్ని 20 ట్రిలియన్లకు చేర్చడమే తన కలగా అప్పుడు చెప్పుకొచ్చారు. 2024 చివరి నాటికి భారత ఆర్థికవ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని 2024 ప్రారంభంలో మోదీ తెలిపారు. భారత ఆర్థికవ్యవస్థ 3.8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించినట్టు ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలను విన్న పలువురు.. 8 ట్రిలియన్ల ఆర్థికవ్యవస్థ 3.8 ట్రిలియన్లుగా ఎలా మారిందంటూ ప్రశ్నిస్తున్నారు. మోదీ వైఖరి ‘కొండంత రాగం..’ అన్నట్టుగా ఉన్నదని వ్యంగ్యం గా కామెంట్లు పెడుతున్నారు.
– కడవేర్గు రాజశేఖర్