ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా రంగాల నిపుణులతో సాకల్యంగా చర్చించే అలవాటు మోదీ సర్కారుకు ఎన్నడూ లేదు. తమ నిర్ణయం మూలంగా ప్రజలు కష్టనష్టాలకు గురైనా పట్టదు. హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిన వృద్ధులు, పెళ్ళిళ్ళు పెట్టుకున్న వారు మొదలుకొని సాధారణ గ్రామీణ నిరుపేదల వరకు ప్రతి ఒక్కరూ అనేక కష్టాలు పడ్డారు. హఠాత్తుగా లాక్డౌన్ విధించినప్పుడు, పేదలు మైళ్ళకు మైళ్ళు కాలినడకన సాగిపోయారు. జీఎస్టీ విధానం చిన్న వ్యాపారస్థుల పాలిట శాపమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభీష్టం మేరకు వ్యవహరించాలనే కనీస స్పృహ మోదీ సర్కారుకు లేకపోయింది. ఇప్పుడు దేశ భద్రత, నిరుద్యోగుల బతుకులతో ముడిపడిన కీలక నిర్ణయాన్ని అనాలోచితంగా ప్రకటించింది.
కేంద్రం ప్రకటించిన కొత్త సైనిక నియామక పథకం అగ్నిపథ్ మూలంగా సైనికులకు ఉద్యోగ భద్రత, పింఛను ఉండవు. నాలుగేళ్ల కష్టం తరువాత మళ్ళీ బతుకు చౌరస్తాలో నిలబడాల్సిందే. సైన్యంలో చేరదామని లక్షలాది మంది నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. శరీరదారుఢ్య, వైద్య పరీక్షలు ఇప్పటికే ముగిసాయి. వీటిలో సఫలమైనవారు ఇక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ) ఎప్పుడుంటుందా అని కొన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నియామక వయసును 21 ఏండ్లకు తగ్గించారు. ఉద్యోగం నాలుగేండ్ల పాటే అన్నారు. పింఛను అసలే ఉండదంటున్నారు. దీంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. ఉద్యోగార్థులే కాదు, మాజీ సైనికోద్యోగులూ, రక్షణరంగ నిపుణులు కూడా ఈ కొత్త విధానం దేశ భద్రత దృష్ట్యా శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.
సైనికులను, తద్వారా సైనికులపై పెడుతున్న బడ్జెట్‌ను తగ్గించుకోవడానికి కేంద్రం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సైన్యంలోకి 17.5-21 ఏళ్ళ మధ్య వయసు గల సైనికులను 46 వేల మందిని తాత్కాలిక ప్రాతిపదికన సైన్యంలో చేర్చుకుంటారు. వీరిని నాలుగేండ్లు మాత్రమే సర్వీసులో ఉండనిస్తారు. ఆ తరువాత వీరిని పంపించివేస్తారు. ఈ నాలుగేండ్ల ఉద్యోగకాలంలో మొదటి ఆరు నెలలు శిక్షణ ఇస్తారు. వీరిని ‘అగ్నివీర్’ అంటారు. నెలకు ముప్ఫైవేల జీతం ఉంటుంది. నాలుగేళ్ళ కాలంలో అది నలభై వేలకు పెరుగుతుంది. పంపించివేసే ముందు 11 నుంచి 12 లక్షల రూపాయల ప్యాకేజీ ఇస్తారు. ఇందుకోసం జీతంలో మూడోవంతు కోత పెడతారు. ఇంతే మొత్తం సైన్యం ఇస్తుంది. ఉద్యోగ సమయంలో గాయపడినా, మరణించినా పరిహారం ఉంటుంది. కానీ పింఛన్ తదితరమైనవి ఉండవు.
నాలుగు ఏండ్ల తరువాత విడుదలైన సైనికులలో నాలుగోవంతు మందిని మళ్ళీ చేర్చుకుంటారు. వీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవలసిందే. పాత అనుభవం లెక్కలోకి రాదు. వీరికి మాత్రం దాదాపు పదిహేనేండ్ల సర్వీసు ఉంటుంది. ఈ కొత్త నియామక విధానాన్ని ‘టూర్ ఆఫ్ డ్యూటీ’గా చెబుతున్నారు. ఈ విధానం వల్ల సైనికులకు పింఛను ఇచ్చే భారం తగ్గుతుందనేది మోదీ ప్రభుత్వ ఆలోచన. మొదట సాధారణ సైన్యంలో చేర్చుకుంటారు. క్రమంగా నావికా, వైమానిక దళాలలో కూడా ఈ పథకాన్ని అమలుచేస్తారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అగ్నిపథ్ పథకం పట్ల మాజీ సైనికాధికారులు, రక్షణరంగ నిపుణులు మాత్రం అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యం క్రమశిక్షణకు, త్యాగశీలతకు పెట్టింది పేరు. ఇటువంటి క్రమశిక్షణ, కట్టుబాట్లు నాలుగేండ్ల కోసం వచ్చే ‘టూరిస్ట్ సైనికుల’లో ఉంటాయా అనే ప్రశ్న వ్యక్తమవుతున్నది. ఇప్పుడున్న సైనికులలో ఉండే సమర్థత కూడా ఈ తాత్కాలిక సైనికులలో ఉండకపోవచ్చు. ప్రపంచంలో పేరు పొందిన భారత సైన్య ప్రమాణాలను ఈ పథకం తగ్గించివేస్తుందని మాజీ సైనికాధికారులు అంటున్నారు. సైన్యం అంటే జీవన్మరణ సమస్యగా ఉంటుందని, అడ్వంచర్ క్యాంప్‌నకు వెళ్ళినట్టు కాదని హెచ్చరిస్తున్నారు. పోలీసు విభాగంలో మాదిరిగా, సైన్యంలో హోంగార్డు వ్యవస్థను సృష్టించి, దానికి అగ్నివీరులు అంటూ ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉన్నది.
నాలుగేండ్ల సేవ తరువాత బయటకు వచ్చినవారికి పారామిలిటరీ దళాల్లో, పోలీసు బలగాల్లో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు పదవీవిరమణ పొందిన సైనికోద్యోగులను తగిన రీతిలో నియమించుకోవడం ఆశించిన రీతిలో లేదు. పలుచోట్ల సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాలలో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా నియమకాలు తగ్గిపోయాయి. అందువల్ల బయట వీరి నైపుణ్యానికి తగిన ఉద్యోగం లభించడం కష్టం. ప్రైవేటు సంస్థల్లో కూడా ఉద్యోగాలు, వేతనాలు ఆశించిన మేర ఉండకపోవచ్చు.
పాక్షిక శిక్షణ కలిగిన సైనికులు దృఢదీక్ష కలిగిన సైన్యాన్ని ఎదుర్కొనలేరని రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే అర్థమవుతున్నదని సెక్యూరిటీ రిస్క్స్ కన్సల్టెన్సీకి చెందిన మాజీ సైనికాధికారి బ్రిగేడియర్ రాహుల్ భోన్స్లే అభిప్రాయపడ్డారు. ఎవరితో తలపడాలి, ఏ విధమైన యుద్ధాన్ని చేయాలని నిర్ణయించుకునే అవకాశం రష్యా వంటి దేశానికి ఉంటుంది. కానీ భారత్ పరిస్థితి అది కాదు. పాకిస్థాన్, చైనా వంటి సైన్యాలను క్లిష్టతర భూభాగంలో భారతీయ సైనికులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందుకు ఎంతో అంకితభావం గల సైనికులు అవసరం. ఒక జవానుకు తర్ఫీదు ఇవ్వడానికి రెండు నుంచి మూడేండ్లు పడుతుంది. ఆరు నెలల్లో సైనికులను తయారుచేయలేమని ఆయన అన్నారు. ఈ తాత్కాలిక సైనికుల మూలంగా ఇప్పటివరకు ఉన్న పూర్తిస్థాయి సైనికులపై ఒత్తిడి పడుతుందని మరో మాజీ అధికారి వివరించారు. నాలుగేండ్ల ఉద్యోగం కోసం వచ్చే సైనికులలో అవసరమైతే ప్రాణత్యాగం చేయాలనే ప్రేరణ, అభిమతం ఉంటుందా అని మాజీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) హర్వంత్సింగ్ ‘ది ట్రిబ్యూన్’లో రాసిన వ్యాసంలో సందేహం వ్యక్తం చేశారు. ఒక్కో దళంలో సైనికుల మధ్య సౌహార్దత, ఉద్వేగభరిత అనుబంధం ఉంటుంది. శత్రు సైనికుల తూటాల వర్షంలో, పేలుళ్ళ మధ్య తోటి సైనికులు నేలకొరుగుతున్న వేళ అత్యంత దుర్భర జీవన పరిస్థితులున్న భూభాగంలో, అననుకూల వాతావరణంలో ముందుకు పోతూ పోరాడాలి. ప్రతి దళానికి తమకంటూ యుద్ధ నినాదాలు ఉంటాయి. సొంత అస్తిత్వం, స్వాభిమానం, పేరు ప్రతిష్ఠలు ఉంటాయి. నామ్, నమక్, నిషాన్ (గౌరవం, విధేయత, అస్తిత్వం)అనేది సైనికుడిని నడిపిస్తుంది. ప్రతి పటాలం ఇజ్జత్ కోసం సైనికులు నిలబడతారు. ఈ తాత్కాలిక పథకం సైనికుల శౌర్యాన్ని పెంచకపోగా నిర్వీర్యం చేస్తుందనే అభిప్రాయం మాజీ అధికారులలో వ్యక్తమవుతున్నది. ప్రతి పటాలానికి ఉండే ప్రత్యేకత ఈ తాత్కాలిక సైనిక దళాలలో ఉండదు. జాతులవారీ రెజిమెంట్స్‌ను విడగొట్టి అఖిల భారత పటాలాలను తయారుచేయాలనే ప్రయత్నం గతంలో విఫలమైంది. జాతి ప్రాతిపదికపైన రూపొందిన పటాలంలో ఉండే ఆత్మీయ బంధం, బృంద సౌహార్దత, దృఢత్వం అందరిని కలగలిపిన పటాలంలో ఉండవు.
ఎన్సీసీలో ఉండే సైనికోద్యోగుల సంఖ్యను కూడా మూడు వంతులు తగ్గించాలని సైన్యం భావిస్తున్నది. వీరి స్థానంలో మాజీ సైనికులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అయితే దీనివల్ల విద్యార్థినీ విద్యార్థులను నియంత్రించడం అంత సులభం కాదని మాజీ అధికారులు అంటున్నారు. ఒక్కో బెటాలియన్‌లో వందలాది మంది టీనేజీ బాల బాలికలు ఉంటారు. వారిలో క్రమశిక్షణను గరిపి నిర్వహించడం అంత సులభం కాదు. మాజీ సైనికులలో జవాబుదారీతనం ఉండదని దేశవ్యాప్తంగా ఎన్సీసీని కొద్ది మంది సైనికాధికారులతో నియంత్రించడం సులభం కాదని వారు అన్నారు.
కొత్త పథకం వల్ల సైనిక వ్యయం కూడా పెద్దగా తగ్గదనే వాదన కూడా ఉన్నది. సైనికులను నాలుగేళ్ళకు ఒకసారి మార్చినా, కొనసాగించిన వ్యయంలో పెద్ద తేడా ఉండదని ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్‌కు చెందిన నిపుణుడు అమిత్ కౌశిష్ అన్నారు. భవిష్యత్ పరిణామాలు గ్రహించకుండా, అనాలోచితంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎక్కువ మంది మాజీ సైనికాధికారులు అభిప్రాయపడుతున్నారు. భారత సైన్యం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో 18వ శతాబ్దంలో ఏర్పడింది. ఆ తరువాత 1932లో వైమానికదళం, 1934లో నావికాదళం ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి కొన్ని కట్టుబాట్లకు, క్రమశిక్షణకు భారత సైన్యం ప్రతీకగా నిలిచింది. ఆ ప్రత్యేకతను కోల్పోతున్నదా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సైనిక నియామక విధానం అగ్నిపథ్ వల్ల అసలు ప్రమాదం ఉద్యోగ కాలం ముగిసిన వారి ద్వారా ఉండవచ్చుననే ఆందోళనను రక్షణరంగ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగేండ్ల ఉద్యోగ కాలం తరువాత బయటకు వచ్చిన వేలాది మంది 21 ఏండ్ల యువకులకు వెంటనే ఉద్యోగం, ఉపాధి దొరకాలనేమీ లేదు. కీలకమైన సమయం వారికి సైన్యంలోనే గడిచిపోతుంది. ఏటా బయటకు వచ్చిన వేలాది మందికి సైన్యమే ఉన్నతస్థాయి ఆయుధ శిక్షణ ఇచ్చి ఉంటుంది. వీరికి ఆయుధం ప్రయోగించడం తెలుసు. దాడులు ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. బాంబులు ఎలా తయారు చేయాలో ప్రయోగించాలో శిక్షణ జరిగి ఉంటుంది. ఒక సైనికుడిగా యుద్ధంలో, తద్వారా శత్రువులపై దాడులలో పాల్గొనే శిక్షణ అంతా పొంది ఉంటాడు. ఇటువంటి ఆయుధ శిక్షణ పొందిన వ్యక్తి తగిన ఉపాధి లభించకపోతే ఏమి చేస్తాడనేది ఊహించడం కష్టం కాదు.
ఇప్పటికే సంఘ విద్రోహశక్తులు యువతను పెడదారి పట్టించి అరాచకం సృష్టిస్తున్న కాలమిది. విదేశీ శక్తులు తమ ఏజెంట్లకు ఆర్థిక వనరులు, ఆయుధాలు సమకూర్చగలవు. వారికి కావలసింది ఆ ముఠాలలో చేరవలసిన యువత. ఈ మాజీ సైనికులు వారికి ఉపయోగకరంగా మారవచ్చుననే ఆవేదన కూడా కొందరిలో ఉన్నది. నేర ముఠాలు వీరిని ఆకర్షించవచ్చు. ఉత్తర భారతదేశంలో కులాల వారి సైన్యాలు ఉండటం గమనించాం. ఇప్పుడు వీరు కూడా అటువంటి కుల సైన్యాలలో చేరే ప్రమాదం ఉంది. పలు రాష్ర్టాలలో సాయుధ పోరాటాలు సాగుతున్నాయి.
అండర్‌వరల్డ్ కార్యకలాపాల వైపు కూడా ఈ యువత ఆకర్షితం కావచ్చు. ఏటా యాభై నుంచి అరవై వేల మంది యువకులు ప్రజాధనంతో ఉన్నత స్థాయి ఆయుధ శిక్షణ పొంది బయటకు వస్తుంటారు. పదేండ్లలో వీరి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిని సమాజం ఇముడ్చుకోలేక పోతే ఎలా అనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ కాంట్రాక్ట్ సైనిక సంస్థలున్నాయి. ఇదొక వందల బిలియన్ డాలర్ల వ్యాపారం. వీరికి కావలసింది కిరాయి సైనికులు. ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్టు సైనిక సంస్థలు వీరిని కిరాయి సైనికులుగా నియోగించుకోవచ్చు. దీనివల్ల మన దేశ ప్రతిష్ఠ, సైన్యానికి ఉన్న గౌరవం మసకబారుతుంది. అందువల్ల ఈ అగ్నివీరుల పునరావాసం విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. ఈ సుశిక్షిత యువత గురించి ఆందోళన చెందడం అంటే వారి పట్ల అపనమ్మకం ఉందని కాదు. సైన్యంలో పనిచేసిన వారిపై అనుమానాలు వెళ్ళగక్కడం సరికాదు. కానీ యవ్వనోత్సాహంతో ఉరకలు వేసే, సాయుధ శిక్షణ పొందిన ఈ యువతను మానవ వనరుగా గుర్తించి ఉపయోగించుకోగలగాలి. మరోవైపు కొత్త పథకం వల్ల సైన్య సమర్థత దెబ్బతినకుండా ఉండాలి. ప్రభుత్వం ఈ రెండు కోణాలలో ఆలోచించాలనేదే మాజీ సైనికాధికారుల, రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.
రెజిమెంట్ వ్యవస్థకు ముప్పు
భారత సైన్యంలో సైనిక పటాలాలు అంటే రెజిమెంట్లు ఉంటాయి. ఒక్కో రెజిమెంట్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ రెజిమెంట్‌కు ఒక యుద్ధ నినాదం ఉంటుంది. ఉదాహరణకు- సిక్కు రెజిమెంట్ సైనికులు యుద్ధ సమయంలో ‘జై బోలో సో నిహాల్, సత్ శ్రీ అకాల్’ అనే నినాదాన్నిచ్చి ఉత్తేజం పొందుతారు. మరాఠా పటాలం ‘బోలా శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై’ అంటే ఉత్తేజం పొందుతుంది. జాట్ రెజిమెంట్ ‘జాట్ బల్వాన్, జై భగవాన్’ అంటూ నినదించి చెలరేగిపోతారు. ప్రతి రెజిమెంట్‌కు సొంత సంకేతాలు, సూత్రాలు ఉంటాయి. అవి అవార్డులను గెలుచుకుని మురిసిపోతాయి. తమ రెజిమెంట్ ఇజ్జత్ కోసం వారు పోరాడతారు. రెజిమెంట్ సభ్యుల మధ్య సోదరభావం నెలకొని ఉంటుంది. కలిసికట్టుగా పోరాడతారు, మరణిస్తారు లేదా నిలుస్తారు, గెలుస్తారు. 1984 దశకం తరువాత ఈ జాతుల వారీ రెజిమెంట్ విధానం రద్దు చేయాలనే ప్రయత్నం జరిగింది. ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో కొందరు సైన్యాన్ని విడిచిన నేపథ్యంలో ఈ ప్రయత్నం జరిగింది. కానీ విడగొట్టడం సాధ్యం కాలేదు. ఈ రెజిమెంట్ వ్యవస్థనే సైన్యానికి ఆత్మవంటిదనే అభిప్రాయం ఉన్నది. కానీ ఇప్పుడు మోదీ సర్కారు ఈ రెజిమెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేయదలచింది. ఆల్ ఇండియా ఆల్ క్లాస్ సిస్టం ప్రవేశపెడుతున్నది. దీనివల్ల రెజిమెంట్ వారీ దృఢత్వం ఉండకపోవచ్చు.
– ఎడిటోరియల్ డెస్క్