ఏండ్ల నుంచి ఎండిపోయిన
జొన్నగూడుల ఒదిగి ఉన్నాం!
మనసంతా మబ్బులు కమ్మిన ఆకాశంలా
దుఃఖం ముసురులో మునిగిపోయినం..
పరాయి పాలనలో నలిగిపోయి వేట పక్షులమైనం..
కన్ను పొడుచుకున్న కానరాని చీకట్లో
వెలుగు రేఖల కోసం అల్లాడుతున్న మా బతుకుల్లో..
దిగుట్లో దీపం వెలిగించాడు
చింతమడక గడ్డ మీద పుట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరుడు..!
తన జననం తెలంగాణ ప్రజల జీవన గమనం కోసమే..
తన ఉద్యమం తెలంగాణ తల్లి పడ్డ పురిటి నొప్పులు కాగా
ఆ నొప్పుల సందేశం తెలంగాణ ఉద్యమపోరు!
గుప్పెడు మందితో జలదృశ్యంలో మొదలైన ఉద్యమం..
కోట్లమంది ఆత్మగౌరవాన్ని నిద్దుర లేపింది
దాయాదుల కుట్రలు పటాపంచలు చేసిండు కేసీఆర్
జై తెలంగాణ… అంటే
జై జై తెలంగాణ.. అంటూ ఉద్యమ డంఖా మోగించిండు..
మా కన్నీళ్లకు యుద్ధం నేర్పించిండు..
పోరుబాటలో తనొక మండుతున్న కొర్కాసయిండు..!
ఢిల్లీ మెడలువంచి.. అరువై ఏండ్ల అమరవీరుల ఆశయాలు
గులాబీ జెండగా ఎగిరేసిండు..
త్యాగాల నేల మీద యాగాలు చేసి
నెత్తుటి గాయాలు మానేలా చేశాడు…!!
తెలంగాణ రాకతో…
పల్లె నవ్వే.. పైరు మురిసే..
వాగు పారే.. చెరువు పొంగే..
చిమ్మ చీకట్ల ఉన్న తెలంగాణను
ప్రపంచ పటంలో నిలవెట్టిండు
బీడుపారుతున్న మా బతుకుల్లో
బతుకమ్మ రంగులద్దిండు కేసీఆర్ సారు..
రైతుల ఇంటికి పచ్చని రైతుబంధు తోరణాలు కట్టగా..
నూతి కాడ ముంతలో.. నీళ్ళు లేని తెలంగాణలో.. ఇంటి గల్మళ్లకే
భగీరథ నీళ్లు చేరేలా చేసిండు ..
కల్యాణలక్ష్మి కానుకగా ఇచ్చి ఆడబిడ్డ నుదుట తిలకం దిద్దగా..!
రైతు రాలిపోతే రైతు బీమాతో భరోసా ఇయ్యంగా..
గురుకుల గుళ్లల్లో పిల్లలు సన్నబువ్వ ముద్ద రుశి సూడగా..!
తల్లి బిడ్డకు ఆరోగ్యలక్ష్మి అందగా..
‘కంటివెలుగు’తో మసక చీకటి మాయం కాగ..
ఆకిట్ల కూకున్న అవ్వకు ఆసరా పింఛను అందగా..
బడిపిల్లల బతుకులు దిద్దేందుకు
సర్కారు బడిని సక్కంగ సేసిండు మా సారు…
కొలువులు వరద పారిస్తూ
ఇంద్రధనుస్సు రంగుల వలె మార్సిండు మా సారు…
జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాటి
యాదాద్రి కొండకే వన్నెలు తెచ్చిండు..
కాళేశ్వర ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణి కాగా..
నిండు ముత్తయిదుల తెలంగాణ తల్లి బతుకమ్మ ఆడగా..
తంగేడువనంలో నా తెలంగాణ బంగారమై మెరిసెను..
తుమ్మల కల్పన రెడ్డి
96404 62142