మొన్నటి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీచేసింది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీ విజయసేన్ రెడ్డి ధర్మాసనం జారీచేసిన ఈ ఆదేశాలు సుదీర్ఘ పర్యవసానాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. రాష్ట్ర రాజకీయాలను ఇది ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ‘ఫిరాయింపులపై మీరు తేలుస్తరా లేక మేమే తేల్చాలా?’ అనే ప్రశ్నను శాసనవ్యవస్థ సర్వోన్నత అధికారి అయిన సభాపతికి న్యాయస్థానం సంధించింది.
పార్టీ ఫిరాయింపులపై సహేతుకమైన గడువులో నిర్ణయం తీసుకోవడమనేది న్యాయసమీక్షకు లోబడే ఉంటుందని స్పష్టం చేయడం మరో ముఖ్యాంశం. అందుకు అనుగుణంగానే నాలుగు వారాల గడువును కూడా విధించింది. అంటే స్పీకర్ తన విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో ఖరారు చేయాలని సారాంశం. ఇక ఏ మాత్రం జాప్యానికి ఆస్కారం ఉండకూడదన్న ధోరణి కోర్టు ఆదేశాల్లో వ్యక్తమైంది.
ఇక్కడ మనకు హైకోర్టు సూచించిన క్రమంలో నాలుగు అంశాలు ప్రధానమైనవిగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఫిరాయింపు పిటిషన్ ఫైళ్లను అసెంబ్లీ కార్యదర్శి తక్షణం స్పీకర్ ముందుంచాలని ఆదేశించడం. రెండు, విచారణ షెడ్యూల్ రూపొందించాలని చెప్పడం. మూడు, సదరు వివరాల నివేదికను రిజిస్ట్రార్‌కు నివేదించాలనడం. నాలుగు, ఇదంతా గడువులోగా జరగకపోతే సుమోటోగా విచారణ జరిపి తీర్పునిస్తామని తేల్చిచెప్పడం. నిర్ణీత సమయంలోగా నిర్ణయం జరగాలన్న పిటిషనర్ల వాదనను కాదనలేమని కోర్టు అభిప్రాయపడింది. చట్టసభ గడువు ఐదేండ్లు కనుక సభాకాలం ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటానంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవని స్పష్టం చేయడం విశేషం. అలాగని సాంకేతిక కారణాలు చెప్పి పిటిషన్‌ను కొట్టివేయడం వల్ల న్యాయం చేసినట్టు కాదని నొక్కిచెప్పింది.
హైకోర్టు ధర్మాసనం తన నిర్ణయాలకు ఆలంబనగా రెండు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించడం గమనార్హం. అందులో మొదటిది నాగాలాండ్‌కు చెందిన కిహోటో హోలోహాన్ కేసులో ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగ బద్ధతను, స్పీకర్ సర్వాధిక్యతను సమర్థిస్తూ ఇచ్చినది. కాగా, రెండోది మణిపూర్‌కు చెందిన కీశం మేఘాచంద్రసింగ్ కేసులో ఇచ్చిన మూడు నెలల గడువుకు సంబంధించినది. దేశంలోని కోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు శిరోధార్యాలుగా ఉంటాయి. రాజ్యాంగం 141 అధికరణం ప్రకారం అవి చట్టాలుగా పరిగణించబడతాయని హైకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలు, నైతికతలకు ప్రతి రాజ్యాంగ వ్యవస్థ కట్టుబడి ఉండాలని, కాలయాపన వల్ల న్యాయం దక్కని పరిస్థితులు ఉండకూడదని చెప్పడం గమనార్హం. ఈ తీర్పుపై శాసన, పరిపాలనా వ్యవస్థల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.