ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయగా, ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నది. అమెరికా హెచ్చరికలు, దాడులను సైతం లెక్కచేయకుండా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి పూర్వీకులకు భారత్‌తో సంబంధాలున్న విషయం వెలుగులోకి రావడం విశేషం.
ఆయతుల్లా రుహోల్లా ఖొమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకి జిల్లాలోని కింతూర్ గ్రామంలో ఉన్నాయి. ఖొమేనీ తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800వ సంవత్సరంలో కింతూర్లో జన్మించారు. అంతకుముందు మొఘలుల కాలంలో ముసావి తండ్రి పర్షియా నుంచి భారత్‌కు వలస వచ్చారు. 1830లో అహ్మద్ ముసావి ఇరాక్‌లోని ఇమామ్ అలీ స్మారకాన్ని సందర్శించేందుకు నజాఫ్ నగరానికి వెళ్లారు. అయితే, ఆయన తీర్థయాత్ర కాస్త వలసగా మారిపోయింది. తన భారతీయ మూలాలను మరిచిపోకూడదని భావించిన ముసావి తన పేరు చివరన ‘హిందీ’ని జతచేసుకున్నారు. ఇరాన్ అధికారిక రికార్డుల్లోనూ అదే పేరు కనిపిస్తుంది.
ముసావి హిందీ చివరికి ఇరాన్‌లోని మషాద్ నగరానికి చేరుకున్నారు. మషాద్‌కు వెళ్లడం ఇరాన్ మతాధికారుల వర్గాల్లో ఖొమేనీ కుటుంబం పరపతి పెరిగేందుకు బీజం వేసింది. అహ్మద్ హిందీ కుమారుల్లో ఒకరైన ముస్తఫాకు ఇరాన్ ఇదివరకటి సుప్రీం లీడర్ అయతుల్లా రుహోల్లా ఖొమేనీ జన్మించారు.
రుహోల్లాపై తన తాత అహ్మద్ హిందీ ప్రభావం ఎంతో ఉంది. మత సంప్రదాయాల విషయంలో రుహోల్లాకు ఆయనే ప్రేరణ. మహమ్మద్ రెజా షా పహ్లావి పాలనకు వ్యతిరేకంగా రుహోల్లా ఇరాన్ విప్లవాన్ని నడిపించారు. ఈ క్రమంలో 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ను రుహోల్లా స్థాపించారు. ఆయతుల్లా రుహోల్లా ఖొమేనీకి ఇరాన్ చరిత్రలో ప్రత్యేక స్థానముంది. ఇప్పటికీ ఇరాన్ కరెన్సీపై ఆయన చిత్రాలున్నాయి. అయితే, ఆయన మూలాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 1939లో మషాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జావద్ ఖమేనీ మత పండితుడు. ఆయన కూడా సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ వంశానికి చెందినవాడే. మతపరమైన వాతావరణంలో విప్లవాత్మక ఆలోచనలతో ఖమేనీ పెరిగారు. తన భారతీయ మూలాల గురించి అలీ ఖమేనీ ఇప్పటివరకు చాలా అరుదుగా మాట్లాడటం గమనార్హం.
– ఎడిటోరియల్ డెస్క్ (మనీ కంట్రోల్ సౌజన్యంతో..)