తెలుగు సాహిత్య ఆకాశాన ఉజ్జలమణి పాల్కుర్కి సోమన. దీప్తిమంతమైన విశిష్ఠ వైవిధ్య కవిత్వాన్ని అందించిన మహాకవి. తల్లి శ్రీరమాదేవి, తండ్రి విష్ణురామ దేవుడు. తుముకూరు జిల్లా (కర్ణాటక రాష్ట్రం)లో హాల్కుర్కె, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాల్లో పాల్కుర్కి గ్రామాలున్నాయి. ఈతని సమాధి ఇక్కడ తెలంగాణలో ఉన్నది. సోమన ఉభయ భాషలలో రచనలు చేసినాడు. ఉభయ రాష్ట్ర వీర శైవులకు పూజ్యుడే.
పాల్కుర్కి సోమనాథుడు ఏ కాలము వాడన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రధానంగా రెండు వాదాలున్నాయి. కాకతీయ వంశమున రుద్రుని కాలము వాడన్న భావనల నుంచి పుట్టినవి ఇవి. ఈ రాజవంశాన రుద్రులిద్దరున్నారు. గణపతిదేవ చక్రవర్తి పెదనాన్న మొదటి రుద్రుడు. రుద్రమదేవి మనుమడు రెండవ ప్రతాపరుద్రుడు.
వీరి కాలములు 12వ శ.(1132-1198), 14వ శ.(1292-1326) కనుక ఈ ద్వైవిధ్యము ఏర్పడినది. ఈ విషయమున అనేకులైన పండితులు పలు విధాలుగా చెప్పినారు. సీపీ బ్రౌ న్, కిట్టేల్, కందుకూరి వంటివారు చెప్పిన కాలానికి కొంత భిన్నత్వాలున్నా వారు ఆధారాలు ఏమీ ఇవ్వలేదు.
వేటూరి ప్రభాకరశాస్త్రి గారు బసవ పురాణ పీఠిక (1926)లో సోమన క్రీ.శ.1132-1198 అని, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఒక వ్యాసంలో (1945) అంబదేవుని శాసనం ప్రకారం 1290-1320 అని, నేలటూరి వేంకటరమణయ్య ‘పాల్కుర్కి ఎప్పటివాడు’ అన్న గ్రంథం (1955)లో 1280-1340 అని, బండారు తమ్మయ్య తన బసవ పురాణ పీఠికలో (తొలి రుద్రునికాలంగా) 1160-1240 అని రాశారు. కొమర్రాజు వారు చేసిన మొదటి రుద్రుని కాలము వాడన్న నిర్ణయంలో కొంత హేతువున్నది.
పాల్కుర్కి సోమనాథుని తెలుగు కవులు (బహుశా వీరశైవ కాఠిన్యత వల్ల) స్మరింపకున్నను, కన్నడ కవి సోమరాజు తన ఉద్భట కావ్యంలో స్మరించినాడు. ‘వృషభ స్తవామర మహీజారామనం సోమనం’ (అనగా వృషభ శతకం రాసిన సోమనను) అని పేర్కొన్నాడు. ఈతను తన గ్రంథం శా.శ.1144లో రాసినానని చెప్పుకొన్నాడు. ఇది క్రీ.శ.1222. అంటే ఈ కావ్య నిర్మాణానికి ముందే సోమన ప్రసిద్ధుడై ఉన్నాడనేది నిర్వివాదాంశం. ఇది కాల నిర్ణయానికి ప్రధాన సాక్ష్యం.
సోమన రాసిన పండితారాధ్య చరిత్రలో కథా నాయకుడైన మల్లికార్జున పండితారాధ్యునకు బెలిదేవి వేమనారాధ్యుడు సమకాలికుడు.
‘పేరెక్కదగిన శ్రీ బెలిదేవి వేమ
నారాధ్యులను పరమారాధ్య దేవు
మనుమని శిష్యుండ…’ – పండి.చ.
పండితారాధ్యుడికి (1110-1190) సమకాలికుడైన బెలిదేవి వేమ (1120-1190). (పండితుని సందర్శించిన సమకాలికుడు)నకు కుమారుడు (1140-1200) 20 సంవత్సరాలకు జన్మించినచో. మనుమడు(1160-1220) తర్వాత 20 సంవత్సరాలకు మూడో తరం) వాడగును. ఇతని శిష్యుడు పాల్కుర్కి (3 తరాలు) (గురువునకు పుత్ర సమానం అంటే మరో తరంగా శిష్యుడు) వేమన మనుమడు ఇవటూరి సోమనాథయ్య పాల్కుర్కి సోమనకు గురువు. అనగా సోమునికి పండితారాధ్యుడు, (తరమునకు 20 సంవత్సరాలు X మూడు తరములు) 60 ఏండ్ల ముందువాడు. పండితారాధ్యుని కాలము (మృతి 1170) క్రీ.శ.1100-70 ప్రాంతం కనుక పాల్కుర్కి (1170) పండితారాధ్యుని కాలము అగుటకు అవకాశం ఉన్నది.
బండారు తమ్మయ్య, నిడుదవోలు, వంగూరి సుబ్బారావు, వేటూరి వంటివారు దీన్ని తమ పీఠికల్లో బలపరిచినారు. చిలుకూరి నారాయణరావు పండితారాధ్య పీఠికలో సోమన రెండవ రుద్రుని కాలము వాడని వాదము చేసినాడు.
మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు మాత్రం (పై నలుగురిని వ్యతిరేకించి) అతనిని ద్వితీయ రుద్రుని కాలమువానిగా నిర్ణయించినాడు. అతడిచ్చిన ఆధారాలలో ఒకటి పిడుపర్తి సోమనాథుని బసవపురాణ కథనాలు. రెండవది నీలగంగవర శాసనం.
పండితారాధ్యుడు క్రీ.శ.1169-70లో
శివైక్యం చెందినప్పుడు ఆ పీఠమును అతని శిష్యుడు దోనయ్య కుమారుడు కేదారయ్య
ఎక్కినాడు. ఇతని కుమారులు నలుగురు.
1) మనుమ పండితుడు, 2)భీమనయ్య
పండితుడు, 3) మహదేవయ్య,
4) చెన్నవిభుడు. వీరు నలుగురు.
‘తదీయ కేదార దీశికు గీత చరితు గాదిలి సుత చతుష్కము’ అని తమ సంతానాలతో లోకాలను పునీతం చేస్తున్నారని పాల్కుర్కి చెప్పినాడు. ఇక్కడ పరిశీలించగా ‘మనుమ’ శబ్దం పౌత్రుడని గాక వ్యక్తి పేరుగా తోస్తోంది. ఇది పేరుగా గలవారు (నెల్లూరి ‘మనుమ’ సిద్ధి మొదలగువారు) తెలుగునాట ఉన్నారు. అలాగే ముదిగొండ వీరభద్రుని (నూతన కవి సూరన గురువు) వంశంలో ‘మనుమ’ ఆరాధ్యుడు ఉన్నాడు. కనుక మూడవ తరం అనడం కూడా సమంజసమే.
శ్రీశైలానికి ఎక్కలేని మల్లికార్జున పండితుడు (క్రీ.శ.1120-1190) వృద్ధుడిగా 80 సంవత్సరాల వయస్సు గలవానిగా భావిస్తే అతని శిష్యుడు సమకాలికుడు అనంతర పీఠాధిపతి ఐన దోనయ్య (1150-1230) కేదారయ్య (1150-1230) (దోనయ్య కుమారుడు, పండితారాధ్యుల పీఠం ఎక్కినవాడు) మనుమ శిష్యుడు పాల్కుర్కి సోమన.
గణపతి దేవ చక్రవర్తి ‘పండితారాధ్యులు కొడ్కులకు’ (పేరు పేర్కొనకుండా) గ్రామ దానము చేసిన గణపతి దేవుని అమాత్యుడు మల్లన వేయించిన ధర్మసాగరం (వరంగల్ జిల్లా) శాసనం లభిస్తోంది. శాసనకాలం దాంట్లో లేకున్నా నెల్లూరి విజయం (క్రీ.శ.1248 తరువాతది) శాసనం ఉంది. కేదారయ్యకు (1198-1262) బహుశా ఈ దానము చేసినాడు. బహువచనం గౌరవవాచకం.
కనుక పాల్కుర్కి సోమనాథుడు అనేక తరముల తర్వాతివాడు కాక చాలా దగ్గరగా రెండు తరముల తర్వాతి వాడే అగును. అనగా సోమన 12వ శతాబ్దం వాడే అగుచున్నాడు. మొదటి రుద్రుని కాలమున జన్మించి గణపతి దేవుని కాలములో శివైక్యం చెందినాడనవచ్చు.
(మిగతా వచ్చే వారం)