పాల్కుర్కి ఎప్పటివాడు-2
‘జంగమరత్నంబు శరణ సమ్మతుడు లింగైక్యవర్తి గతాంగ వికారి పండితారాధ్య కృపా సముద్గతుడు మండిత సద్భక్తి మార్గ ప్రచారి విలసిత పరమ సంవిత్సుఖాం బోధి అలి కరస్థలి సోమనాథయ్య గారు’
అని బసవ పురాణంలో పేర్కొనబడ్డ సోమనాథయ్య నుంచి తాను బసవ పురాణ గాథలు ఏరికొన్నాడు. అతడు తనకు సమకాలికుడు. అతడు పండితారాధ్యుని శిష్యుడేనని చెప్పినాడు. క్రీ.శ.1168లో బసవేశ్వరుడు శివైక్యం పొందగా అతనికి రెండు లేదా మూడు సంవత్సరాల తర్వాత పండితారాధ్యుడు శివైక్యమైనాడు.
ఈతనిని పాల్కుర్కి సోమన చూడకున్నను అతని శిష్యుల ద్వారా బసవని గాథలు తెలుసుకొన్న సోమన క్రీ.శ.1180 ప్రాంతం వాడవుతాడు. అంటే మొదటి కాకతీయ రుద్రుని (గణపతి దేవుని పెద తండ్రి) కాలం వాడే అవుతాడు. బసవ పురాణంలో తన స్నేహితున్ని (కరస్థలి సోమనాథుని) పేర్కొన్నాడు. తన కవితా గురువు కరస్థలి విశ్వనాథయ్యయు ఈతని కంటే పెద్దవాడైన కరస్థలి సోమనాథయ్యను మాత్రం శిష్యునిగా పేర్కొన్నాడు అన్నది గమనించదగ్గది.
బసవపురాణంలో తన
ప్రాణ స్నేహితుని గురించి
‘పడగాము రామేశు వర శిష్యుడనగ
బడ చెన్న రాముని
ప్రాణసఖుండ’
అని ఈ విధంగా పేర్కొన్నాడు. ఈ చెన్నడు కేదారయ్య చిన్న కొడుకు. కనుక సోమనాథుడు పండితరాధ్యునికి చాలా తరముల తర్వాతివాడు (అనగా రెండవ రుద్రుని కాలము వాడు) కాజాలడు.
సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు కీ.శే. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పాల్కుర్కి సోమన కాల నిర్ణయంలో నీలగంగవర శాసనాన్ని ఉదహరించారు. సహజంగా మల్లంపల్లి వారి మీద గౌరవంతో కొంత, శాసన ఆధారం కనుక కొంత పునరాలోచించవలసి ఉందనుకున్నారు నాటి చరిత్రకారులు. కానీ, దీనిని కూడా తిరస్కరించవలసిందే.
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకాలోని నీలగంగవర గ్రామంలో రెండవ ప్రతాపరుద్రుని సామంతుడైన అంబయ దేవుడు వేయించిన శా.శ.1212 అనగా క్రీ.శ.1290 నాటిదీ శాసనం. దీనిలో రెండ్రేవుల మల్లినాథయ్యకు మొల్ల కల్లూరనే గ్రామాన్ని దానం చేసినట్టుంది. దీనిలోని ప్రతి గ్రహీత రెండ్రేవుల మల్లినాథుడు. ఇతడు పాల్కుర్కి సోమనాథుడు పేర్కొన్న రెంటాల మల్లినాథుడని మల్లంపల్లి వారు ఊహ చేసినారు.
‘యసలారగా గుమరాద్రికి దూర్పు
దెసను సోపానముల్ దీర్చి పొల్పార
మహిత సద్భక్త సమంచిత వృత్తి
మహిజను రెంటాల మల్లినాథుడును’
అని బసవపురాణంలో పేర్కొనబడినాడు. ఈ మల్లంపల్లి వారి ఊహను బండారు తమ్మయ్య అంగీకరింపలేదు. పిడుపర్తి బసవన పాల్కుర్కి సోముని, కాకతీయ ప్రతాపరుద్రుని కాలం వాడన్నాడు. ఓరుగల్లు తురుష్కాక్రాంతం అవుతుందని సోమన చెప్పినట్టు పేర్కొన్నాడు. సోమనాథుని శిష్యుడైన శివరాత్రి కొప్పయ్యకు మనుమడైన సోమయ్య ప్రౌఢరాయలచే క్రీ.శ.1430 ప్రాంతంలో డోకిపర్రును తిరిగి పొందెనని రాసికొన్నాడు. దీన్ని బట్టి సోమనాథుడు రెండో ప్రతాపరుద్రుని కాలం వాడు అని భావించారు. ఇది సరికాదు. ఈ రెంటాల మల్లినాథుడు రుద్రుని కాలం వాడే. కనుక సోమన, మల్లినాథులు రుద్రునికాలం వారే. తర్వాత ఈ సోమనాములు రుద్రమ, ప్రతాపరుద్రుల కాలంలో వీరి సామంతులు తొలుత పునఃనిర్మించి ఉంటారు. ఆ విషయం చరిత్రకెక్కలేదు. దీనికి కిందిది ఆధారం.
అంబదేవ రాజు నీలగంగ వరపు శాసనంలో
‘పూర్వ ద్వారే కుమార క్షితభృత్ ఉపరితస్తత్
పురారేః పురస్తాత్ రమ్యం సోపాన మార్గం
సుఖకర మమలం…’
అని యిట్లు ప్రస్తావించబడినదీ సోపాన మార్గమే. (యువకుడైన) అంబదేవుడు ప్రతాపరుద్రుని కాలం వాడు. (వృద్ధురాలు) రుద్రమతో (ఆవిడకిది ఆఖరి యుద్ధం) యుద్ధం చేసినవాడు.
ఇలాంటి మరోశ్రీశైల సోపాన పంక్తి నిర్మాణం అద్దంకి నేలిన వేమారెడ్డి చేయించినాడు. ఆ పిదప కీర్తి స్పర్ధతో రాచకొండనేలిన మొదటి అనపోత నాయుడు (1361-1383) సోపానాలు నిర్మించినట్టు ఆయన కుమారుడు సర్వజ్ఞ సింగభూపాలుడు తన రసార్ణవ సుధాకరమున తెలిపినాడు కానీ ఇది సోమనకు అనంతరం కాలం. ఈ సోపాన ప్రస్తావన గల క్రీ.శ.1335 నాటి చీమకుర్తి శాసనం ప్రోలయ వేమునిది. దీనిలో ‘శ్రీపర్వత, అహోబల నిర్మిత సోపాన’ అని ఉంది. నాడు రాజులు శ్రీశైల సోపాన నిర్మాణం పుణ్యప్రదమని భావించారు.
సోమన ఉమా మహేశ్వరం (నల్గొండ జిల్లా) దేవాలయాన్ని, పరిసరాలయాలను వివరించినాడు. కానీ, క్రీ.శ.1280లో రుద్రమ సేనాని చెరుకు బొల్లయ్య కట్టించిన పంచేశ్వరాలయాలు (ఉమా మహేశ్వరంలో) పేర్కొనలేదంటే అవి సోమన తర్వాతి నిర్మాణాలుగా భావించవచ్చు.
రెండ్రేవుల రెంటాల అయ్యే అవకాశం లేదని బండారు వారు మల్లంపల్లిని వ్యతిరేకించారు. మల్లంపల్లి వారు ఈ దొరికిన శాసనమును బలవంతంగా ముడిపెట్టి పాల్కుర్కిని రెండో రుద్రుని కాలము వానిగా చేయుటకు చేసినది సాహసమే. రెండ్రేవుల అనేది రెండు రేవుల గ్రామము లేదా తీరపు గుడిసెల ఆవాసానికి పేరు. రెంటాల అన్నది. ‘రెండు + అల’ పదముల కలయిక. అల అన్నది కన్నడ ప్రభావమున్న కాలమున గ్రామమనే అర్థంలో వాడబడింది. అనేక తెలంగాణ గ్రామ నామాలకు ఈ అల పేరున్నది. చిట్యాల, చెప్యాల, ఇటిక్యాల, మంచిర్యాల, మల్యాల, జగిత్యాల, నంద్యాల వంటివి ప్రసిద్ధాలు. ‘రేవుల నుంచి ‘అల’ రాలేదు. ‘రెండు’ తొలి పదము ఇది ఔప విభక్తిక నామవాచకం. (‘రెంటిని’, ‘రెంటికి చెడ్డ..’ ‘రెంటియందు’ వంటి ద్వితీయాది విభక్త్యంతములలో చూడవచ్చు.) అలతో ఔపవిభక్తికమే సమసించినది తప్ప ‘రేవుల’ నుంచి వచ్చినది కాదు. నీలగంగ వరపు శాసనస్థ రెండ్రేవుల మల్లినాథుడు సోమన పేర్కొన్న రెంటాల మల్లినాథుడు కాడు. ఇంటిపేర్లు వేరు. రెండు ఊళ్లు వేరు, వేరు. కనుక మల్లంపల్లి వారి వాదము తిరస్కరణీయం.
ఈ రెంటాల మల్లినాథుడు రుద్రుని కాలం వాడే. కనుక సోమన, మల్లినాథులు రుద్రునికాలం వారే. తర్వాత ఈ సోమనాములు రుద్రమ, ప్రతాపరుద్రుల కాలంలో వీరి సామంతులు తొలుత పునఃనిర్మించి ఉంటారు. ఆ విషయం చరిత్రకెక్కలేదు.
పాల్కుర్కి సోమనాథుని కాలనిర్ణయమునకు పనికివచ్చు మరొక శాసనం ఉంది. అది పిల్లలమర్రి శాసనం. దీనిని బేతిరెడ్డి భార్య ఎరుక సానమ్మ వేయించినది. కాలం శా.శ.1137 అనగా క్రీ.శ.1215కు సరైనది. శ్రీ ఎరకేశ్వర, బేతేశ్వర దేవరలను ఇవటూరి సోమనాథుడు ప్రతిష్ఠించినాడని దీనిలో రాయబడ్డది. ఈ ఇవటూరి సోమన పండితారాధ్య చరిత్రలో పేర్కొనబడినవాడే. ఈ విషయాన్ని సోమన కాల నిర్ణయం చేసినవారందరూ అంగీకరించారు. కానీ, వీరంతా పాల్కుర్కి సోముడు పండితారాధ్య చరిత్రను ఈ శాసనకాలానికి తర్వాతి రాసినదిగా భావించినారు. కానీ, ఇది అవసరం లేదు. క్రీ.శ.1170లో మల్లికార్జునుడు మరణించగా పండితారాధ్యుని పుత్రుడు కేదార పండితుడు పీఠమెక్కగా అతని వద్ద దీక్ష తీసుకొన్న ఇవటూరి పండితారాధ్యుడు, పాల్కుర్కి సమకాలికుడై, ప్రసిద్ధుడై పండితారాధ్య చరిత్ర, పిల్లలమర్రి శాసనములందు పేర్కొనబడుటకు పౌర్వాపర చర్చ అక్కరలేదు. ఉభయులు వృద్ధులే. సమవృద్ధులే. సమకాలికులే. పండితారాధ్య చరిత్ర సోముని ప్రౌఢఃకాలపు రచన, కనుక పాల్కుర్కి సోమన క్రీ.శ.1170-1240 ప్రాంతాన జీవించి ఉన్నాడు.
ఇక రెండో ప్రతాపరుద్రునికి పాల్కుర్కి సోమన సమకాలం వాడని చెప్పే గ్రంథములలో ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర ఒకటి. రెండోదైన పిడుపర్తి సోమన బసవ పురాణము రెండవది కానీ, ఇది తొలి గ్రంథాంశములనే తిరిగి చెప్పినది. మూడోది కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర. ప్రతాప చరిత్రలో నాగనాథుడు నమస్కరింపబడినాడు. అతడు విష్ణుపురాణాంధ్రీకరణ చేసి అయ్యనవోలు శాసనాలు రాసిన రాచకొండ తొలిరాజుల కాలపు కవి. క్రీ.శ.1369 నాటి (శాసనకాలము) వాడైన ఇతనికి ఏకామ్రనాథుడు సమకాలికుడు. ఏకామ్రనాథుడు పాల్కుర్కి సోమన బసవ పురాణాన్ని రాజు ప్రతాపరుద్రుడు విన నిరాకరించినాడని రాసినాడు. పిడుపర్తి సోమనాథుని పద్య బసవ పురాణములో కూడా ఓరుగంటి స్వయంభూ దేవాలయ మంటపంలో పాల్కుర్కి సోమన బసవ పురాణాన్ని ప్రవచిస్తుంటే దర్శనార్థం వెళ్లిన ప్రతాపరుద్రుడు వివరాలు అడుగగా ‘పాల్కుర్కి సోమపతితుడీ మధ్య ప్రావళ్ళు పెట్టి’ ద్విపదలో పురాణం రాశాడని, అది తేలికపాటిదని పక్కనగల ధూర్త విప్రుడు వివరించగా, రాజు మరలిపోయినాడన్న ఘట్టాన్ని రాసినాడు. పాల్కుర్కి సోమన మహా మహిమాన్వితుడైనట్టు, అంగవికలురకు అంగములు ఇచ్చినట్టు మరిన్ని పుక్కిటి పురాణాలు రాసినారు. ఇవి అసత్య చారిత్రక కథనాలు. కాలం కుదరనివి.
పాల్కుర్కి సోమన ప్రతాపరుద్రునిపై కినిసి, ఓరుగల్లును తురుష్కా క్రాంతం అవుతుందని భవిష్యవాణి (శాపం) చెప్పినట్టు కూడా పిడుపర్తి గ్రంథంలో పేర్కొనబడటం జరిగింది. కనుక ఇవి కల్పిత కథల సమాహారాలు. మహాకవులు తిక్కన, మొల్ల, పాల్కుర్కి ఈ రెండవ ప్రతాపరుద్రుని అస్థానమునకు వచ్చినట్టు రాసినారు. అవి, అసంగతాలు. కాలౌచిత్యదూరాలు. కనుక ఈ చరిత్ర గ్రంథ కథనాలు తిరస్కరించదగినవి. చరిత్రకు పనికివచ్చే అంశాలు కావివి. ఈ గ్రంథాలను ప్రమాణంగా స్వీకరించలేం. ఈ కవులు పాల్కుర్కి సోమనకు రెండు శతాబ్దులు తర్వాతి వారు. ఈ రెండు కావ్యములు కాకతీయుల చరిత్రకు ఏ మాత్రం సత్యప్రతిష్ఠ చేసేవి కావు. కనుక ఈ గ్రంథాలాధారంగా పాల్కుర్కి సోమనను రెండో ప్రతాపరుద్రుని సమకాలికుడనరాదు.
ఈ విధంగా పాల్కుర్కి సోమన క్రీ.శ. 12వ శతాబ్దివాడుగా నిర్ధారింపవచ్చు. క్రీ.శ.1170-12 50 సోముని కాలంగా (ఒక దశాబ్ది అటుఇటుగా) భావించాలి. మొదట రుద్రుని కాలమున జన్మిం చి, గణపతి దేవుని కాలంలో శివైక్యం చెందినాడనవచ్చు.
– డాక్టర్ సంగనభట్ల నరసయ్య 94400 73124