‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న తెలుగు వ్యాకరణ పండితులు కొందరు ‘తెలుగుకు ఉన్న వ్యాకరణ దీపం చిన్నది’ అన్నారు. సంస్కృత భాషా వ్యాకరణ కౌముది వంటి గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు వ్యాకరణ పండితులు ఈ మాట అని ఉంటారని చెప్పవచ్చు.
తెలుగు వ్యాకరణ గ్రంథాలు అనగానే చాలామంది తెలుగు పండితులకు చిన్నయసూరి రాసిన ‘బాల వ్యాకరణం’, బహుజనపల్లి సీతారామశాస్త్రి రాసిన ‘ప్రౌఢ వ్యాకరణం’ వంటి గ్రంథాలు మొదటగా గుర్తుకువస్తాయి. ఆపై నన్నయ్య విరచితమని చెప్పబడుతున్న ఆంధ్ర శబ్ద చింతామణి, మల్లియరేచన కవి జనాశ్రయం, అధర్వణుని అధర్వణ కారికావళి, కేతన ఆంధ్రభాషా భూషణము, విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి, అనంతామాత్యుని ఛందో దర్పణం, వెల్లంకి తాతంభట్టు కవి చింతామణి, ముద్దరాజు రామన్న కవిజన సంజీవని, బాలసరస్వతి బాల సరస్వతీయం, అప్పకవి అప్పకవీయం, గణపవరపు వెంకటకవి ఆంధ్రకౌముది, అహోబలపండితుని అహోబల పండితీయం కూచిమంచి తిమ్మకవి లక్షణసార సంగ్రహం, అడిదం సూరకవి కవిసంశయ విచ్చేదం, శిష్ట్లాకృష్ణమూర్తి శాస్త్రి హరికారికావళి వంటి తెలుగు వ్యాకరణ గ్రంథాలు యాదికివస్తాయి.
తెలుగు వ్యాకరణ గ్రంథాలు పూర్వ కవుల పద ప్రయోగాల వ్యాకరణ కార్యాల గురించి చెప్పినంతగా వ్యావహారిక భాషా ప్రయోగాల వ్యాకరణాంశాల గురించి చెప్పలేదు. మాండలిక భాషలోని యాసనందలి ఉదాత్తానుదాత్త గణిత ధర్మాల గురించి అసలు చెప్పలేదు.
తెలుగు ప్రబంధాదులందే గాక తెలుగు వ్యాకరణ గ్రంథాలలో సైతం అనువాద శాతమే అధికంగా కనపడుతుంది. చిన్నయసూరి బాల వ్యాకరణం హరికారికావళి వ్యాకరణ గ్రంథానికి మక్కికి మక్కీ అని కొందరంటారు. నన్నయ విరచితమని చెప్పబడుతున్న ఆంధ్ర శబ్ద చింతామణి ఆయన రచన కాదని చెప్పేవారే అధిక శాతం ఉన్నారు. చిన్నయసూరి రాసిన బాల వ్యాకరణానికి అనుబంధంగా రాసిన ఫ్రౌఢ వ్యాకరణాన్ని త్రిలింగ లక్షణ శేషం అని కూడా అంటారు. ఇలా తెలుగు వ్యాకరణ గ్రంథాలు అనువాద మార్గానికే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనపడుతుంది. సంస్కృత వ్యాకరణాన్ని తెలుగుకు అనువాదం చేసేటప్పుడు మన తెలుగు వ్యాకరణ పండితులు వ్యాకరణ పారిభాషిక పదజాలానికి అనేక అశాస్త్రీయ అర్థాలను కల్పించారు.
మనిషి నోరు, నాసికల నుంచి జనించే అక్షర ఉత్పత్తి ఆధారంగా సశాస్త్రీయంగా సంస్కృతంలో సంధులు మొదలైన వ్యాకరణాంశాలను చెప్తుంది. దాన్ని బట్టి ఆదేశం, ఏకాదేశం, ఆగమం వంటి వ్యాకరణ పారిభాషిక పదాలకు సశాస్త్రీయంగా అర్థాలను చెప్తుంది. వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పములలో వ్యాకరణ మూలాలు బాగా తెలియాలంటే, శిక్ష, నిరుక్తములు కూడా కొంత తెలియవలసిన అవసరం ఉన్నది. లేకుంటే ఆదేశానికి, ఏకాదేశానికి తేడా తెలియకుండా పోతుంది. చిన్నయసూరి తన బాల వ్యాకరణంలో ‘ఆర్య వ్యవహార దుష్టంబు గ్రాహ్యంబు’ అని అంటారు. నిజానికి తెలుగు వ్యాకరణ మూలాలు అటు సంస్కృత వ్యాకరణ మూలాల్లోకి, ఇటు వ్యావహారిక తెలుగు భాషా మూలాల్లోకి వెళ్లకపోవడం వల్ల, సశాస్త్రీయ మార్గాన్ని అనుసరించక పోవడం వల్ల అలా చెప్పవలసిన అవసరం ఏర్పడింది.
నేడు ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలుంటే అందులో ‘ఏ, ఈ, ఐ, ఓ, యూ’ అనే అక్షరాలను అచ్చులని అంటారు. తెలుగు వ్యాకరణం ప్రకారం తెలుగు భాషకు అచ్చులు 16. అందులో ‘అలు, అలూ’ అనే రెండక్షరాలు వాడుకలో లేవు. వాటిని తీసివేస్తే తెలుగు భాషకు అచ్చులు 14 అవుతాయి. ఆధునిక కాలంలో ‘ఋషి’ అని రాయడానికి ‘రుషి’ అని హల్లును ఉపయోగించి రాసేస్తున్నారు. అలా ఋ, ౠలను తీసివేస్తే తెలుగులో 12 అచ్చులే ఉంటాయి. శిక్ష, వ్యాకరణ ధర్మాలను అనుసరించి అ+ఇ=ఏ, అ+ఉ=ఓ, ఆ+ఏ=ఐ, అ+ఓ=ఓ ఇలా ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔలను మినహాయిస్తే తెలుగులో అచ్చులు 6 మాత్రమే మిగులుతాయి. ఇందులో దీర్ఘాచ్చులను తీసివేస్తే తెలుగుభాషకు మూడంటే మూడు అచ్చులుంటాయి. మన తెలుగు వ్యాకరణ పండితులు కొంత సంస్కృత వ్యాకరణ సంప్రదాయాలను, కొంత తెలుగు వ్యాకరణ సంప్రదాయాలను అనుసరించడంతో తెలుగు భాషకు అచ్చులు 16 అయ్యా యి. వాటికి లిపి పుట్టుకువచ్చింది. తెలుగు అజంత భాష అయ్యింది. అవసరాన్ని బట్టి పరభాషా వ్యాకరణ సంప్రదాయాలను స్వీకరించడం తప్పు కాదు. కానీ, పరభాషా వ్యాకరణ సంప్రదాయాల మూలాలను గ్రహించకుండా వాటిని స్వీకరిస్తే భాషకు మేలు కంటే కీడే ఎక్కువ.
నేడు తెలుగు భాషలో ఇంగ్లిష్ పదాల జోరు పెరిగింది. ఇంగ్లిష్ భాషా పదాలు అధికశాతం హలంతాలుగా ఉంటాయి. దానితో పద ప్రయోగంలో వేగం పెరుగుతుంది. ఈ వాస్తవాలను గమనించి తెలుగు వ్యాకరణాన్ని రూపొందించుకోవాలి.
కానీ, మనవారు ఆర్య వ్యవహార దుష్టంబు గ్రాహ్యం బు అంటూ పాత పద్ధతుల్లోనే వెళ్తున్నారు. తెలుగు వ్యాకరణ పండితులు సంస్కృత వ్యాకరణ మూలాలను కూ డా గ్రహించి ఉంటే.. అచ్చుల సమితి, హల్లుల సమితి, వక్రముల సమితి, వక్రతమాల సమితి, కపటయాది సూత్రాలు, సంయుక్త వర్ణ సమితి, విచ్ఛేద వర్ణ సమితి, ప్రత్యాహార అక్షర సమితి అనే అంశాలు తెలుగు వ్యాకరణంలో ఉండేవి. పాణిని వంటి మహర్షులు సంస్కృత వ్యాకరణాన్ని గణిత ఛాయాబద్ధంగానే చెప్పారు. తెలుగు వ్యాకరణ పండితులు మాత్రం సంస్కృత వ్యాకరణంలోని గణిత ఛాయలకు తిలోదకాలిచ్చారు.
సంస్కృత వ్యాకరణ గ్రంథం కౌముదిలోని మహేశ్వర సూత్రాలలో మొదటి సూత్రం ‘అ ఇ ఉ ణ్’ వీటిని వ్యాకరణ పారిభాషిక పదం ప్రకారం అణ్ణులు అని అంటారు. నిజం చెప్పాలంటే ఈ అణ్ణులు మూడే తెలుగు భాషలో ప్రధాన అచ్చులు అని చెప్పవచ్చు. కంప్యూటర్లోని ఫైల్ సిస్టం ఈ అణ్ణులు అనే పద ప్రయోగంలో ఉన్నది. ఇలా నేడు ఎంతమంది సంస్కృతాంధ్ర వ్యాకరణాలను బోధిస్తున్నారు? సంస్కృతం సంగతి అలా ఉంచి తెలుగు భాషాభిమానులు జర ఆలోచించండి. విదేశీ శాస్త్రవేత్తలు ఏదన్న కొత్త విషయాన్ని కనిపెడితే చాలు.. మనవారు ఇదంతా మా వేద పురాణేతిహాసాలలో పూర్వమే ఉన్నదంటారు. ఉంటే వారికంటే ముందే మనవారు ఎందుకు చెప్పరు? మనవారి పాండిత్యం ఎదుటివారిని విమర్శించడానికి తప్ప నవీన విజ్ఞాన రూపకల్పనకు పనికిరాదా? నిజం చెప్పాలంటే పాణిని విరచిత కౌముదిలోని మహేశ్వర సూత్రాలను సశాస్త్రీయంగా పాణిని మహర్షి ఆలోచించిన విధంగా వివరిస్తే చాలు. అక్కడే అచ్చులు, హల్లులు, అణ్ణులు వంటి వ్యాకరణ పారిభాషిక పదాలు ఎలా పుట్టాయో తెలియడమే గాక కంప్యూటర్లోని ఫైల్ సిస్టం, ద్విసంఖ్యా మానాది గణితం వంటి అంశాలూ ఎరుకకు వస్తాయి. పరీక్షల కోసం తెలుగు, తెలుగు వ్యాకరణం, మార్కుల కోసం సంస్కృతం ఉన్న ఈ రోజుల్లో ఇదంతా జరుగుతుందా? అంటే సమాధానం శూన్యం.