ప్రతివారినీ ఆత్మవిమర్శ చేసుకోవాలని డిమాండ్ చేసే తెలంగాణ ‘పౌర సమాజం’ ఇప్పుడు తానే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలేమో! ఒక పౌర సమూహంగా తెలంగాణ ఎక్కడో ఒకచోట ఒక ఫైన్ బ్యాలెన్స్ కోల్పోయినట్టు మాత్రం గత ఏడాదిగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎలాగో ప్రతి అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వంతో పోల్చటం ఇష్టం కాబట్టి, వివిధ అంశాల పట్ల మార్పు తర్వాత, మార్పు ముందు వారి వైఖరిని కూడా పోల్చుకుంటే, పరిశీలించుకుంటే బాగుంటుందేమో.
కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడానికి అనేక ప్రశ్నించే గొంతుకలు ఏ పారామీటర్స్ ఐతే నిర్మించుకున్నాయో, అవే ప్రమాణాలను ఇప్పుడున్న ప్రభుత్వానికి వర్తింపజేస్తున్నారా? ‘సరే, రాజకీయాలు స్తబ్ధంగా ఉండవు, వేర్వేరు కారణాల వల్ల ఒక పార్టీకి అంతో ఇంతో మద్దతుగా, లేదా ఒక భావజాలానికి మద్దతుగా నిలబడవలసి వస్తుంది.’ కనీసం ఇటువంటి వివరణ అయినా ఇవ్వాలి కదా? ఒకవేళ ఇటువంటి వైఖరి తీసుకున్నా కూడా కాస్త నర్మగర్భితంగా కూడా ఉండొచ్చు. అయినా, పౌర సమాజానికి మన సొసైటీలో ముఖ్యమైన స్పేస్ ఉన్నది. ఇందుకు కారణం వారొక ప్రజాస్వామిక దృక్పథంతో ప్రజల శ్రేయస్సు, ఆకాంక్షల గురించి ఆలోచిస్తారు, కోరుకుంటారు. అందుకోసం అవసరమైతే ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు కాబట్టి. తెలంగాణ సాధనలో, నిర్మాణంలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో, పౌర హక్కుల విషయంలో ఇప్పటిదాక మన పౌర సమాజం సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఇప్పుడున్న నేపథ్యంలో మాత్రం, వ్యక్తిగత ద్వేషం, కక్షపూరితమైన ధోరణే వారి వైఖరిని డిఫైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారు ప్రదర్శించే వైఖరికి ఇంకొక కారణం కూడా ఉండొచ్చు.
వారు ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వమే అతి తక్కువ సమయంలో ఇంత దివాలాకోరుతనం ప్రదర్శిస్తున్నప్పుడు, నిరాశా నిస్పృహలకు గురై ప్రజలకు వారి జవాబుదారీతనాన్ని దాటవేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందినప్పుడల్లా దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఆపాదించడం తప్ప వారు చేయగలిగింది ఇంకేముంటుంది? నిజానికి ఇదొక ఆత్మ సమర్థన వైఖరి. ఇటువంటి వైఖరి వారి పక్షపాత ధోరణికి నిదర్శనం. ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి ప్రభుత్వంలో ఉండే పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు లేదనటం వారి మేధో సంక్షోభానికి ప్రతిబింబం. గత పదేండ్లుగా వీరే కదా ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే రాజకీయ వ్యవస్థ మెరుగ్గా ఉంటుందన్నది! ప్రభుత్వ ఒంటెత్తు పోకడలకు పొలిటికల్ కౌంటర్ నెరేటివ్‌ను ప్రతిపక్షమే ఇవ్వగలుగుతుందని పదేపదే చెప్పారు కదా? ఇప్పుడేమో ప్రతిపక్షానికి మాట్లాడే నైతిక హక్కే లేదనటం హేతుబద్ధమేనా?, అస లు అది ప్రజాస్వామ్య దృక్పథమేనా?
ఇదే లాజిక్ జాతీయ రాజకీయాలకు వర్తిస్తే, కాంగ్రెస్‌కు ఈ దేశంలో, ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ప్రశ్నించే నైతిక హక్కుంటుందా? దేశంలో బీజేపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది బీజేపీని ప్రశ్నించినప్పుడల్లా నెహ్రూను, లేదా కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేసిన అఘాయిత్యాలను ఎలాగైతే ఎత్తిచూపించి వారి ప్రభుత్వ మనుగడను సమర్థించుకుంటారో, ‘చైతన్యవంతమైన మన పౌర సమాజం’ కూడా అదే మోడల్‌ను ఫాలో అయితే ఎలా? అధికారం లో ఉన్నదా! లేదా! అన్నదానితో సంబంధం లేకుండా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని పదే పదే టార్గెట్ చేస్తుంటే, అది అహంకారం, కక్ష అవుతుంది. అదే అధికారంలో ఉన్నవారితో చేస్తే అది ప్రజల కోసం పోరాటం అవుతుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటమవుతుంది. మన మహా మేధావులకు ఈ మౌలికమైన సూత్రం అర్థం కాకపోతే తెలంగాణ రాష్ర్టానికి, ప్రజలకు హాని కలగక తప్పదు.
పౌర సమాజం పేరుతో 1980ల నుంచి అవలంబించి న సంకుచితమైన ఆలోచనల వల్ల, అహంకారం వల్ల, ఎలక్టోరల్ పాలిటిక్స్, రాజకీయ వ్యవస్థలో ఉన్న స్పేస్‌ను కాం ప్రమైజ్ చేసుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో బీజేపీ అనే భూతం కాచుకుని కూర్చుని, ఎదుగుదలకు ఎదురుచూస్తున్న సమయంలో రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల అస్తిత్వంలో పునాదులున్న ప్రాంతీయ పార్టీని ఖతం చేద్దాం అనుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణ మేధావులు, తెలంగాణ పౌర సమాజం అనధికారికంగా ప్రభుత్వ పర్సెప్షన్ సేవకులుగా, తమ వైఖరిని ప్రదర్శించుకోవటం హాస్యాస్పదం, స్వయంకృతాపరాధం!
(పౌర సమాజపు మేధావుల తీరు తెన్నులపై సంపూర్ణ వామపక్ష భావజాలం నుంచి వచ్చిన ఒక యువ మిత్రుడి ప్రతి స్పందన ఇది..)