ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు, యువకుడిగా ఉన్నప్పుడు గోడ మీద ఎన్నికల నినాదాలు రాసేవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గోడల మీద చిన్నారెడ్డి కోసం నినాదాలు రాశారు. తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ పనిచేశారు. ఎన్నికలు ముగిశాక ఇంటి మీద రాతలు చెరిపేయాలి. స్క్రీన్ ప్రింటింగ్‌లో సైతం అంతే. అయితే, ఆ రాతలు చెరిపివేసినంత ఈజీగాతెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపివేయవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా ఉంది.
Telangana Movement | చాయ్ వాలా ప్రధాని అయినా, గోడల మీద రాత లు రాసేవాళ్లు సీఎం అయినా అది ప్రజాస్వామ్య గొప్పతనం. ప్రజాస్వామ్యం వల్లే తామీ స్థాయికి వచ్చామని అనుకోవాలి కానీ, తాము నియంతలమనో, రాజకుటుంబాల నుంచి వచ్చామనో భావించి సామాజిక బహిష్కరణ వంటి ఫ్యూడల్ భావాలను వ్యక్తం చేయకూడదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ‘సికింద్రాబాద్ మార్కెట్లో ఆలుగడ్డలు అమ్ముకున్న వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కేసీఆర్ వ్యతిరేకత అనే ఏకైక భావనతో మేధావులు, మీడియా రేవంత్‌రెడ్డి సామాజిక బహిష్కరణ పిలుపుపై నోరు ఎత్తలేని పరిస్థితి. ‘నన్ను ఏమైనా అనండి భరిస్తాను.. తెలంగాణను అవమానిస్తే గొయ్యి తీసి పాతి పెడ తా’ అని కేసీఆర్ అంటే మీడియాపై దాడి అని నాడు గగ్గోలు పెట్టిన మీడియా.. నేడు సామాజిక బహిష్కరణకు పిలుపు ఇచ్చినా, మీడియా డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని తిట్టినా, ప్రకటనల పేరుతో గొంతు నొక్కినా మౌనంగానే భరిస్తున్నది.
కేసీఆర్ నాయకత్వం వల్లనే తెలంగాణ సాకారమైంది. తెలంగాణపై అవగాహన లేనివారు, కేసీఆర్‌ను చిన్నచూపు చూడాలనుకునే వారు, వ్యక్తిగత వ్యతిరేకత ఉన్నవారు దీన్ని అంగీకరించకపోవచ్చు.
కానీ ‘కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని మరో పార్టీలో ఉన్నా నేనూ అంగీకరించాల్సిందే’ అని మహా టీవీలో ఐ.వెంకట్రావుతో జరిగిన ఇంటర్వ్యూలో గతంలో రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ స్థానంలో దేవేందర్‌గౌడ్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమం అయితే, మీడియా చేతిలో ఉంటే మనకు నచ్చినవారి నాయకత్వంలోనే తెలంగాణ సాకారమైందని నమ్మించవచ్చు. దేవేందర్‌గౌడ్ కాదు, చంద్రబాబు వల్లే అని కూడా నమ్మించవచ్చు. కానీ, 2001లో ఉద్యమం మొదలైంది. 23 ఏండ్లు అవుతున్నది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఆ ఉద్యమ కాలంలో ఉన్నవాళ్లే. చరిత్రను గోడ మీద ఎన్నికల రాతల్లా సున్నం వేసి చెరిపేయలేరు. ఇప్పుడున్న ప్రజల్లో అత్యధిక శాతం ఏదో ఒక విధంగా ఉద్యమంలో పాలు పంచుకున్నవాళ్లే. ఉద్యమంలో ఏం జరిగింది? ఎవరు ఎటు వైపు నిలిచారో ఉద్యమ చరిత్ర వారి మనోఫలకంపై లిఖించి ఉన్నది. దాన్ని చెరిపేయలేరు .
మహాత్మాగాంధీ స్థానంలో పటేల్‌ను నిలిపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల స్ఫూర్తితో కేసీఆర్ స్థానంలో ఉద్యమ నాయకుడిగా దేవేందర్‌గౌడ్‌ను నిలిపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరిస్తూ దశాబ్దం క్రితం నేను ఓ వ్యాసం రాస్తే ప్రస్తుత బీజేపీ నాయకుడు, అప్పటి దేవేందర్‌గౌడ్ పీఏ ఫోన్ చేసి తెలంగాణ ఉద్య మ చరిత్రలో దేవేందర్ గౌడ్‌కు స్థానమే లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం పార్టీ పెట్టి, ప్రజారాజ్యంతో పొత్తు, స్వయంగా ఓడిపోయి తిరిగి టీడీపీలో చేరారు దేవేందర్‌గౌడ్. ‘నన్ను ఎదిరించి ఎవరు బయటకు వెళ్లినా దేవేందర్ గౌడ్‌లా తిరిగి నా వద్దకు రావలసిందే’ అని బాబు చెప్పినట్టుగా ఉన్నదని, ఇది మిగిలిన నాయకులను భయపెట్టడానికి ఉపయోగపడింది తప్ప తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదని ఆయనకు వివరించా ను. టీడీపీ నుంచి బయటకు వెళ్లాలనుకున్న తెలంగాణ నాయకులు సైతం దేవేందర్‌గౌడ్ ఉదంతంతో ఆందోళన చెందారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రేవంత్‌రెడ్డి ప్రధానంగా చెరిపేసే పని చేపట్టారు. ‘కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తాను’ అని శాసనసభలోనే ప్రకటించారు. తెలంగాణ అధికార చిహ్నం మార్పుతో శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. అధికార చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించాలని నిర్ణయిస్తే బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయానికి బ్రేక్ వేసింది. పరువు నిలుపుకోవడం కోసం వాయిదా అని ప్రకటించారు. డిసెంబర్లో అధికార చిహ్నం మారుస్తామని ఆరు నెలల కిందట ప్రకటించారు. డిసెంబర్ వెళ్లి మూడు నెలలవుతున్నది. వీరికి మాత్రం ఇంకా డిసెంబర్ రాలేదు. వచ్చే అవకాశాలు కూడా లేవు. ఏడాదిన్నర గడుస్తున్నా రేవంత్‌రెడ్డికి ఇంకా పాలనపై పట్టు రాలేదు. సహజంగానే కాంగ్రెస్‌లో అందరూ సీఎంలే. ఈసారి సీనియర్లు మంత్రులు అయి తే, కాంగ్రెస్‌లో అందరికంటే తక్కువ సీనియారిటీ ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం. ఒక్క వైఎస్ఆర్ను మినహాయిస్తే ఒకటిన్నర సంవత్సరాలు సీఎం అంటే కాంగ్రెస్ చరిత్రలో చాలా ఎక్కువ కాలం అనే అనుకోవాలి.
చెరిపేసే పనులపై దృష్టి పెట్టిన సీఎంకు పాలనపై పట్టు చిక్కడం లేదు. టీడీపీ, కాంగ్రెస్‌ల్లో రేవంత్‌రెడ్డి అతి తక్కువ కాలంలో ఎదగడానికి బూతులు, దూకుడు ఉపయోగపడ్డాయి. రాజకీయ మెట్లు ఎక్కడానికి ఉపయోగపడిన బూతులు సీఎం పదవిలో సైతం ఉపయోగపడతాయని భావిస్తున్నారు. పిడుక్కీ, బియ్యానికి ఒకే మంత్రం పని చేయదు. రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిడితే మీడియాలో హైలైట్ కావచ్చు కానీ పాలనపై పట్టు చిక్కదు, విషయ పరిజ్ఞానం వచ్చి వాలదు.
అనుభవం ఉన్న వైద్యులు మనిషి ఇంకెంత కాలం బతుకుతారో చెప్పగలరు. కాంగ్రెస్ హైకమాండ్ ఇంకెంత కాలం రేవంత్‌రెడ్డిని సీఎంగా ఉంచుతుందో ఎవరికీ తెలియదు. బీసీ సీఎం అని పీసీసీ అధ్యక్షుడు అప్పుడే మాట్లాడుతున్నారు. తెలంగాణ అధికార చిహ్నాన్ని నిర్ణయించే కనీస అధికారం కూడా ఇక్కడ ఎవరికీ లేదు. అంతా హైకమాండ్ చూసుకుంటుంది. రేవంత్‌రెడ్డి ఎంతకాలం ఉంటారు? బీసీని నియమిస్తారా? బీసీ అనేది వచ్చే ఎన్నికల్లో అని చెప్తారా? అన్న నిర్ణ యాలు హై కమాండ్ తీసుకుంటుంది. తనకు లభించిన అవకాశాన్ని రేవంత్ ఇప్పటికైనా ఉపయోగించుకొని తెలంగాణకు నేనిది చేశాను, ‘ఇది నా ముద్ర’ అని చెప్పుకునేట్టు చేయాలి.
సివిల్ సర్వీస్ అధికారులకు రాజకీయ నాయకుల మీద చాలా చిన్న చూపు ఉంటుంది. పైకి వినయంగా కనిపించినా నాయకులు లేనప్పుడు వారిపై జోకులు వేసుకొని నవ్వుకోవడం అధికారులకు సర్వ సాధారణం. అదే విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుల ముందు అధికారులు తోక జాడించరు. తమ హద్దుల్లో ఉండి పనిచేస్తారు. అధికారంలో ఉన్న నాయకుల ప్రాపకం కోసం అధికారులు ప్రయత్నించడం సర్వ సాధారణం. కానీ నాయకుల వద్ద విషయ పరిజ్ఞానం లేకపోతే వారి ప్రాపకం కోసం ప్రయత్నించే అధికారులు సైతం తమ అంతర్గత చర్చల్లో విషయ పరిజ్ఞానం లేని నాయకులను చిన్న చూపు చూస్తారు.
అధికార వ్యవస్థపై స్వయంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పోలీస్ అధికారులు ట్రైనింగ్ పూర్తి కాకముందే యూనిఫాం ధరించి పోలీస్ స్టేషన్లలో కూర్చొని ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని, అధికారులు ఏసీ గదులు వీడటం లేదని, ఒక తప్పు చేయమని చెప్తే మూడు తప్పులు చేద్దామంటున్నారని అధికార వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. పరిపాలన సాగేది మొత్తం అధికార వ్యవస్థ చేతుల మీదుగానే. ఆ వ్యవస్థ పైనే సీఎంకు అసంతృప్తి ఉంటే ప్రజలకు ఎలా ఉంటుందో అర్థమవుతూనే ఉన్నది. అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు కావస్తున్నా పాలన మీద సీఎంకు పట్టు లభించలేదు .
రేవంత్‌రెడ్డి టీడీపీలో చాలా స్వల్ప కాలంలో ఎదిగారు. అప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎదురులేని నాయకుడిగా ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డిని వెనక్కి నెట్టి స్వల్ప కాలంలో బాబుకు దగ్గరయ్యారు. జిల్లా పరిషత్తు సమావేశంలో ఒకసారి అదే జిల్లాకు చెందిన డీకే అరుణ పైకి ఏకంగా దూసుకువెళ్లారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి వెనక్కి తీసుకువచ్చారు. నిజానికి డీకే అరుణ కూడా అలా దూకుడు గా వ్యవహరించే నాయకురాలు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాహనం ఎదురుగా బైఠాయించి అడ్డుకున్నారు. అలాంటి డీకే అరుణ మంత్రిగా ఉండటం వల్ల రేవంత్‌రెడ్డి స్థాయిలో దూకుడు ప్రదర్శించలేకపోయారు. మంత్రిగా ఉన్న అరుణ హుందాగా ఉండాలని భావిస్తే, సీఎంగా ఉండి రేవంత్ బూతులు నమ్ముకున్నారు.
వార్తలు వస్తుంటే ఇంట్లో టీవీలు మూసేస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్పింది అక్షర సత్యం. అయితే అలా మూసేస్తున్నది ఆయన బూతులు వినలేకనే. ఇటీవల ఒక టీవీ చర్చలో రాజకీయ విశ్లేషకుడు పాపారావు మాట్లాడుతూ బూతులు రేవంత్‌రెడ్డికి మాత్రమే కాదని, ప్రజలకు కూడా వస్తాయని, ఒకసారి ప్రజల్లోకి వెళ్లి వినాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిది.
-బుద్దా మురళి