తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించి 2025, ఏప్రిల్ 27తో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గా ఉద్యమ సారథి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రజతోత్సవ సభ జరుగనున్నది. ఈ సభకు ఉద్యమ ఖిల్లా అయిన ఓరుగల్లు వేదిక కావడం ఆహ్వానించదగిన పరిణామం. సమైక్య రాష్ట్రంలో నాడు ఎక్కడ చూసినా దుఃఖమే.. తడారిన గొంతులు, బీడువారిన భూములు, ఎండిన పంటలను చూసి గుండె బరువెక్కిన తెలంగాణ ప్రాంత రైతులు ఉరికొయ్యలకు శవాలై వేలాడారు.
పురుగుల మందు కలిపిన పెరుగన్నం తిని ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇలాంటి దురాగతాలెన్నింటినో చూసి చలించిపోయి పురుడుపోసుకున్నదే టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీ. ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజలను, తెలంగాన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నాడు గులాబీ జెండా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది.
పిడికెడు మందితో కదిలిన గులాబీ జెండా నేడు కోట్లాది మందికి నీడనిస్తున్నది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంతేకానీ, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పనయిపోయిందనుకోవడం, అలా ప్రచారం చేయడం జాతీయ పార్టీల అవివేకానికి, అజ్ఞానానికి పరాకాష్ఠ. కింద పడినప్పుడల్లా గోడకు కొట్టిన బంతిలా రెట్టింపయిన వేగంతో లేచి నిలబడింది గులాబీ జెండా. ఆ జెండా నీడన ఉన్నది తెలంగాణ కోసం రక్తాన్ని సైతం చిందించే లక్షలాది మంది సైనికులు. అలాంటి సైనికులున్న బీఆర్ఎస్ పార్టీ తన ప్రతాపం ఏమిటో ఈ నెల 27న ఓరుగల్లు వేదికగా చూపించబోతున్నది. ఆ జన సందోహం మధ్యన రానున్న రోజుల్లో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడనున్నదనే సందేశాన్ని చూసి రెండు జాతీయ పార్టీల నాయకులు బెంబేలెత్తడం ఖాయం.
– తెలంగాణ విజయ్
94919 98702