దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్‌ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మంత్రి ఇచ్చిన సమగ్ర వివరణ, ఇందుకు తెలంగాణను ఉదాహరణగా చూపిన తీరు ప్రశంసనీయం. దేశాన్ని అన్ని రంగాలలో ఉన్నతస్థితికి తెచ్చే విషయమై వర్చువల్‌గా సాగిన గోష్ఠిలో కేటీఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ర్టాన్ని ఏడేండ్లలోనే శరవేగంగా అభివృద్ధి పథంలో పయనింపచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేశాభివృద్ధికి పథక రచన, కార్యాచరణ గావిస్తున్న తరుణంలో కేటీఆర్ ప్రసంగం ఆలోచింపచేసేదిగా ఉన్నది. 2030 నాటికి భారత్ అన్ని రంగాలలో ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించాలని కేటీఆర్ కాంక్షించారు.
కేటీఆర్ తన ప్రసంగంలో లేవనెత్తిన అంశాలపై దేశవ్యాప్తంగా మేధావులు చర్చ జరుపవలసి ఉన్నది. అభివృద్ధికి కావలసిన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ దేశం అభివృద్ధికి నోచుకోవడం లేదంటే అది విధానపరమైన లోపమే. ప్రపంచంలోనే అత్యంత భారీగా మనదేశంలో పత్తిని పండిస్తున్నా, దుస్తుల ఉత్పత్తిలో పక్కనే ఉన్న చిన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌కన్నా మనం వెనుకబడి ఉండటమేమిటి? తయారీ రంగంలో వియత్నాం, తైవాన్ వంటి చిన్న దేశాలకు సాటిగా నిలువలేకపోతున్నామే! నీళ్ళు సముద్రం పాలవుతుంటే, మరోవైపు బీడు భూములుంటాయి, వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంటుంది. చైనా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం. కేటీఆర్ లేవనెత్తిన సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవాలంటే ఏడేండ్లలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సాధించిన అభివృద్ధిని అధ్యయనం చేయవలసిందే!
వ్యవసాయం, పరిశ్రమలు, గ్రామీణ రంగం, మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి మొదలైన అన్ని రంగాలలో తెలంగాణ సమున్నత విజయాలను సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల సముదాయాన్ని మూడేండ్లలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ వేగవంతమైన అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన విధానాలే కారణం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత సాధిస్తూ, సామాజికంగా సమ్మిళిత ప్రగతిని సుసాధ్యం చేశారు. కేటీఆర్ చెప్పినట్టు – సంకుచిత భావనలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షించవలసి ఉన్నది. పాలకులకు చిత్తశుద్ధి, సమర్థత ఉంటే దేశాభివృద్ధి సాధ్యమనడానికి తెలంగాణ నమూనా ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నది. సమాజంలో విభజన రేఖలు గీస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేవారా? లేక మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేవారా? పరిపాలకులుగా ఎవరు తగినవారనేది దేశ ప్రజలు నిర్ణయించుకోవలసిన తరుణమిది.