శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడితో ఇలా చెప్తాడు..‘అర్జునా.. యుద్ధంలో సర్వస్వం కోల్పోయే పరిస్థితి వచ్చినా అవమానానికి తీసుకునే ప్రతీకారచర్య విషయంలో కాంప్రమైజ్ ఉండకూడదు’. ఈ మాటలు వింటే నాలుగున్న దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌లో ఉంటూ రెండున్నరేండ్ల ఆ పార్టీ పాలనలో తాను అనుభవించిన ఎన్నో అవమానాలను ఏకరువు పెట్టిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డికి సరిపోతాయని అనిపిస్తున్నది.
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్‌రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు నానావిధాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. జీవన్‌రెడ్డికి 40 ఏండ్లకుపైగా అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీని వదిలి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారని, తన ఆత్మాభిమానాన్ని వదిలి కేసీఆర్‌ను కౌగిలించుకున్నారని దెప్పిపొడుస్తున్నారు. అయితే, బీఆర్ఎస్లో చేరి, ఇపుడు కనిపించకుండా పోయిన పలువురు సీనియర్ నాయకులను జీవన్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికిన కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ గొప్పతనం గురించి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కె.కేశవరావు, డి.శ్రీనివాస్ లాంటి వాళ్లకు రాజ్యసభ సభ్యులుగా అత్యున్నత పదవులిచ్చి సాకింది కేసీఆర్. ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని ద్రోహం చేసి వారు వెళ్లారే తప్ప ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. అయినా వారిని కేసీఆర్ ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు. ‘శరణన్న వారిని చేరదీయడమే క్షత్రియుల ప్రథమ లక్షణం’ అన్నట్టు ఆ విషయంలో కేసీఆర్ ఎప్పుడూ హుందాగానే ఉంటారన్న విషయం మర్చిపోయి కాంగ్రెస్ నేతలు అక్కసెల్లబోస్తున్నారు. కానీ అలాంటివారు సమకాలీన రాజకీయాల దురంధర్ కేసీఆర్ అనే విషయం గుర్తెరగాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో అధికారం కోసం ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ, ఇపుడు ఇందుకు భిన్నంగా జరుగుతున్నది. జీవన్‌రెడ్డి చాలా రాజకీయాల్లో తలపండిన నాయకుడు, ప్రజలతో మిళితమైన మనిషి. అలాంటి నేతను సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేయడం దారుణం. రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డురోజులు ఎదుర్కొన్న సమయంలో ఆ పార్టీకి ఎంతో ఆసరాగా ఉన్న వ్యక్తి జీవన్‌రెడ్డి. అలాంటిది ఇప్పుడెందుకు ఆయన స్వంత పార్టీని వీడారు? అధిష్టానం బుజ్జగించినా ఎందుకు ఆయన వినలేదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకిచ్చిన హామీలు.. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ సీఎంపై ఒత్తిడి తీసుకువచ్చినందుకు, ప్రజల గొంతుకై నిలదీసినందుకు కుట్ర పన్నారా? కొత్తగా వలస వచ్చిన నాయకులతో కలిసి కుట్రలు పన్ని, నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీని వీడకుండా ఉన్న సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డిని ‘పొమ్మనలేక పొగపెట్టినట్టు’ నిరక్ష్యం చేయడం భరించరానిది. ఒకరకంగా చెప్పాలంటే తల్లిలా భావించే పార్టీలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యవైఖరి అవలంబించినపుడు, తన పార్టీ లోనే బలి అనివార్యమైనపుడు తెగింపే శరణ్యం అవుతుంది. అలాంటప్పుడు ప్రతీకారమే ప్రత్యామ్నాయం వైపు పయనమై ఏకైక లక్ష్యంగా మారుతుంది. ఆ కోవలోనే జీవన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నది కాదనలేని నిజం.
నిజానికి జీవన్‌రెడ్డి నిబద్ధత గల వ్యక్తి. 40 ఏండ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన జీవనశైలి అవకాశవాద తిరోగమన క్షతగాత్రుని మాదిరిగా ముగియకూడదు. క్షత్రియుడిలా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పురోగమించాలి. రాజకీయాలు ఎన్నేండ్లు చేశామన్నది ముఖ్యం కాదు. ఎలాంటి విలువలు కలిగిన రాజకీయాలు చేశామన్నది ప్రధానం. నిబద్ధత, కమిట్మెంట్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. అందుకే కాబోలు ‘అన్నా నీతో కలిసి పనిచేసేందుకు ఆ దేవుడే నన్ను పంపించిండే. నీ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందే’ అంటూ కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా జీవన్‌రెడ్డి భావేద్వేగానికిలోనై ఉంటారు. నిన్నటిదాకా అందరికీ జీవన్‌రెడ్డి మామూలు నాయకుడిలా అగుపించారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరితే కోహినూర్ వజ్రంలా మారుతారనేది నమ్మదగిన సత్యమే. కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నారని, దానిని పునర్నిర్మించటమే తెలంగాణ బంగారు భవిష్యత్‌కు ఏకైక మార్గమని జీవన్‌రెడ్డి సహా ఎంతోమంది మేధావులు భావిస్తున్నారు.
అదేవిధంగా, 45 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వపక్షంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరానని చెప్పుకున్న పోచారం ఇప్పుడు తన నియోజకవర్గమే కాదు..ఏ నియోజకవర్గాన్ని చూసినా ఇదే పరిస్థితి ఉండడం పట్ల తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కడం గమనార్హం. ‘నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఈ వయసులో మంత్రుల కాళ్లు మొక్కాల్నా..మంత్రికి 20సార్లు చెప్పా..అయినా పట్టించుకోలేదు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదు..బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవి’ అంటూ పోచారం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన మాట తప్పిండని, ఈ ప్రభుత్వంలో మంత్రులు..ఎమ్మెల్యేల ఫోన్లు లేపరని, అసలు ప్రభుత్వం ఉన్నదా? ఉంటే అది పనిచేస్తుందా? అనే అనుమానం కలుగుతున్నదని పోచారం శ్రీనివాస్‌రెడ్డి మదనపడ్డారంటే మూడేండ్లకు దగ్గరకొస్తున్న ప్రజాపాలనను చూస్తే మిగిలిన కాలం ఎలా ఉండబోతున్నదో చెప్పకనే తెలుస్తున్నది.
ఇదిలావుండగా, యావత్ తెలంగాణ ప్రజానీకం మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని, మరోసారి ఆయన పాలన కోసం తపించిపోతున్నారు. ఇందుకు సూచనగా జగిత్యాలలో ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్ భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలోనే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్వంత పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రభుత్వానికి వణుకు పుడుతున్నది. అందుకే జగిత్యాల జిల్లా క్యాడర్‌ను కాపాడుకునేందుకు రేవంత్‌రెడ్డి నానాపాట్లు పడుతున్నారు. ఈనెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆ మార్పులు ప్రతిపక్షానికి మరింత బలంగా మారనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.