దిష్టిబొమ్మల్లాంటి కాల్వలు దిగ్గున దునికెగా
తుమ్మల్ల చెరువులు దమ్ముతీరగ తాగె
గొట్టాల బాయిల గోసలన్నీ పోయె
కోలెడు లోతునే ఊట దున్కవట్టె
చేండ్లన్నీ పైర్లతో ఉయ్యాలలూగె
నెర్రెలువాసిన నేల నవ్విడ్వకుండె…
చెప్పుల లైన్లన్నీ చెల్లాచెదరాయె
ఎరువుల షాపోడు పిల్సియ్యవట్టె
భూముల గడబిడలు గంగలో కల్సే
రైతన్న సంబురంగా సాగువైపు నడ్సే..
గుడ్డి కొంపల్లోకి జిలుగు వెలుగులు జేరె
అక్కరున్నోళ్లందరికి ‘రెండు పడక’లొచ్చె
పిల్లపెండ్లి దిగులు ‘మేనమామ’ తీర్చె
చీరె సారెతోటి సకలం ఇంటికె పంపె..
కాన్పుకెళ్లే తల్లికి పాన్పులియ్యవట్టె
పురుడు పోసి మరీ ఇంట్ల దించవట్టే
పింఛన్తో ముసలోళ్ల పంచె మెర్వవట్టె
చెట్ల నీడతో కచ్చీర్ బండ ముర్వవట్టె…
దిగవడే రోడ్ల దిగులు మొత్తం పాయె
కాలుకింద వెట్టక కదిలె మంచి రోజులొచ్చె
ఆఫీసుల చుట్టు తిర్గే రోజులన్నీ పోయె
ఆఫీసర్లే ఇండ్లకొచ్చి పనులు జేసిపెట్టె…
చెప్పుకుంటవోతె ఎంతకూ ఒడ్వదు
ఎనిమిదేండ్లల్లనే ఇంతకన్నేముంటది..!