తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ‘ఇచ్చింది సోనియమ్మ’ అని కాంగ్రెస్, ‘తెచ్చింది కేసీఆర్’ అని తెలంగాణ సమాజం ఇరువైపులా మోహరించాయి. ఉద్యమకారులు ఒక అడుగు ముందుకేసి ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటే విక్టోరియా మహారాణి వల్ల అంటామా? గాంధీజీ వల్ల అంటామా?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రజలు కూడా ఇచ్చినవాళ్ల కంటే తెచ్చినవాళ్లకే ఆ ఎన్నికల్లో పట్టం కట్టారు. ఇన్నాళ్లకు మళ్లీ అలాంటి సందర్భమే ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోట్లాది ప్రజల భావోద్వేగాల, భక్తి విశ్వాసాల ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించకుండా తెలంగాణతో ఏ రకమైన ప్రత్యేకానుబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని అర్భక కాంగ్రెస్ నేతలు కేరింతలు కొట్టారు. తెలంగాణ ఉద్యమ కారులకు మాత్రం ఎక్కడో పేగు కదిలింది. గుండె ద్రవించింది.
స్వర్గీయ రాజీవ్‌గాంధీ చిరస్మరణీయుడే. కానీ, తెలంగాణ తల్లి విగ్ర స్థాపనకు ఉద్దేశించిన స్థలంలో పంతానికి పోయి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడం, పరిహారంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్టిస్తామని నష్ట నివారణ ప్రకటనలు చేయడం ఒక ప్రహసనాన్ని తలపించింది. ఇంతకీ తెలంగాణ తల్లి రూపురేఖలు అట్లాగే ఉంటాయా? లేదా వచ్చే డిసెంబర్ 6న ఇంకో తల్లి రూపురేఖలను పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించి అదే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అని దబాయిస్తారా? అన్న సందేహం తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నది. అందుకు కారణమూ ఉన్నది. 40 ఏండ్ల కిందట హైదరాబాద్ ట్యాంకుబండ్ మీద కొలువైన విగ్రహాల రూపురేఖలు నాటి ముఖ్య నేత ముఖ కవళికలను తలపిస్తున్నాయని ఆ రోజుల్లో చాలామంది చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్దేశించిన చోటే ప్రతిష్టించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఎందరో మేధావులు, రచయితలు, కళాకారులు విన్నవించుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కానీ, తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కాలం కలిసి రానప్పుడు నివురు గప్పిన నిప్పు కణికల్లా అవకాశం కోసం ఎదురుచూస్తాయి. గాలి తోడైనప్పుడు ఎగిసిపడే అగ్నికీలలవుతాయి. అది చరిత్ర. 1956 నుంచి 2001 దాకా వివిధ సందర్భాల్లో ఎగసిపడ్డ ఉద్యమ నిప్పు కణికలను ఆరిపోకుండా కాపాడుకుంటూ ఒక్కొక్కరికి అందించుకుంటూ వచ్చింది నాటి తరమైతే, కేసీఆర్ స్వరాష్ట్ర సాధన జెండా ఎత్తినరోజు నుంచే తెలంగాణ సమాజం ఏకంగా ఎక్కడికక్కడ నిప్పును సృష్టించడమే నేర్చుకుంది. అగ్నితో చెలగాటం కూడదని నేటి పాలకులకు తెలియదా?
తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ భావోద్వేగాల అగ్గి రవ్వ ఎక్కడ పుడుతుందో ఎలా విస్తరిస్తుందో సమైక్య పాలకులు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఎక్కడో పాల్వంచ ఉద్యోగుల్లో తలెత్తిన ప్రశ్న 1969 ప్రత్యేక తెలంగాణ మహోద్యమానికి బీజం వేసి 1971 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసింది. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి టి.అంజయ్య తన ప్రోటోకాల్ పక్కనపెట్టి కేవలం లోకసభ సభ్యుని హోదాలో వస్తున్న రాజీవ్‌గాంధీని స్వాగతించడానికి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లినప్పుడు జరిగిన అవమానం 1983లో సమైక్య రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ఘోర పరాజయానికి దారితీసింది. చంద్రబాబు మొదలుకొని కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారం అండతో, ధన కనక వస్తు వాహనాల ప్రలోభాలతో గెలవాలనుకున్న రాజకీయ తులాభారంలో కేసీఆర్ సమర్పించిన తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవమనే తులసీదళంతో అవేవీ సరితూగలేకపోయాయి. మహాత్మాగాంధీ కుటుంబం సంగతేమో కానీ, ఇందిరాగాంధీ కుటుంబ భజన మరీ తెలంగాణలో శ్రుతిమించిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ వరకే పరిమితమైతే అభ్యంతరం లేదు కానీ, ప్రజల భావోద్వేగాల మీద ప్రభుత్వ వేదికలపై దాడిచేసే స్థాయికి రావడం ఆందోళనకరం. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా ఈ వైపరీత్యం కనిపించదు. విశేషమేమంటే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అంతర్జాతీయ విమానాశ్రయానికి 2008లో అదే రాష్ర్టానికి చెందిన రైతు నేత, మాజీ ప్రధాని స్వర్గీయ చౌదరి చరణ్‌సింగ్ పేరుపెట్టారు. కారణం? అప్పుడు ఆ రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్సేతర ప్రభుత్వం. అదే ఏడాది హైదరాబాద్‌లో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అప్పటికే తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దివంగతులైనప్పటికీ వారి పేరు పెట్టలేదు. సరి కదా రాజీవ్‌గాంధీ పేరు పెట్టారు. కారణం? అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది అంతటితో ఆగలేదు. రాజీవ్ రహదారి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ట్రిపుల్ ఐటీ వంటి పేర్లతో రాష్ట్రం తడిసి ముద్దయి తరించింది. పేర్లు విగ్రహాలు పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకే చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయులు, త్యాగధనులు ఎంతమంది లేరు?.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అందర్నీ గౌరవించారు. కొత్త వాటికి మాత్రమే స్థానిక దేవతల పేర్లు, తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టారే తప్ప ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు అపచారం తలపెట్టలేదు. తెలంగాణ ప్రజలూ అంతే. సంస్కారమంటే అది. చరిత్రలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ పాలనలో, కేంద్రంలో గాని కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో గాని పేర్లు, విగ్రహాల విషయంలో వల్లమాలిన కుటుంబారాధన లేదు. వారి హయాంలో నిర్మించిన బహుళార్థసాధక నీటి ప్రాజెక్టులకు, ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఆ మకిలి అంటలేదు.
ట్యాంక్ బండ్ మీద ఉన్న 34 విగ్రహాల్లో కేవలం 8 మాత్రమే తెలంగాణ ప్రముఖులవి ఉన్నప్పటికీ మిగతా విగ్రహాలను ఎక్కడో ప్రతిష్టించాలని ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రజలు కోరనూ లేదు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త వివాదాన్ని సృష్టించనూ లేదు. ఢిల్లీలో గుంటెడు జాగ దక్కనీయకుండా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించిన కాంగ్రెస్ కనీసం ఆయన భౌతికకాయం పూర్తిగా కాలని దుస్థితిలో దహన సంస్కారాలు కూడా సవ్యంగా జరపకపోవడం కంటే… మా తెలంగాణ తల్లి విగ్రహం కోసం అనుకున్న జాగ ఇది. వదిలేయండి. రాజీవ్‌గాంధీ విగ్రహం మరి ఎక్కడైనా మంచి చోట ప్రతిష్టించండి. నగరంలో, రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలున్నాయి. ఈ ఒక్కచోటే మీకు తక్కువైందా అని ఉద్యమకారులు వేడుకోవడం మహాపరాధమైంది. తెలంగాణ తల్లి విగ్రహం బదులుగా రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడే ఉండాలని ప్రజలెవరూ కోరలేదు. వారు ఆకాంక్షించని, ఆమోదించని, లేనిపోని వివాదాన్ని తెరపైకి తెచ్చి పైగా పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందనే వితండవాదాన్ని కాంగ్రెస్ నేతలు ముందుకుతెచ్చారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం 15 ఏండ్లు కాంగ్రెస్సే కదా పరిపాలించింది. మరి అప్పుడెందుకు రాజీవ్‌గాంధీ గుర్తుకురాలేదు? అన్న ఉద్యమకారుల ప్రశ్నకు సమాధానం లేదు. కానీ, పదేండ్లలోనే ఆ పరిసరాల్లో ఒక అద్భుత సచివాలయం, అమరులజ్యోతి, అంబేద్కర్ మహా విగ్రహం నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. వాటిమధ్యలో చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ తల్లి దేవాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ సంకల్పించారు. అది అందరికీ తెలుసు. ప్రజలు, పర్యాటకులు హాయిగా వచ్చిపోయే స్థలంలో, చుట్టూ అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా నిరంతరం పోలీసు పహారాలో ఆంక్షలు, తనిఖీలతో కొనసాగే ప్రాంగణంలో కుదించడం కుట్ర కాదా! సామాన్యులకు తెలంగాణ తల్లిని దూరం చేయడం కాదా? కావాలని రెచ్చగొట్టడం తప్ప దీన్నేమనాలి?
అధికారం కోసం జరిగే పోరాటాలు వేరు. వాటి వేదికలు, సందర్భాలు, స్థల కాలాలు వేరు. భావోద్వేగాలు, విశ్వాసాలు వేరు. ఈ తేడా తెలియక రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకారేచ్ఛతో కాకతీయ శిలాతోరణం, చార్మినార్‌ను ముట్టుకొని చేతులు కాల్చుకున్నది. అంతటితో ఆగకుండా తెలంగాణ తల్లి నేలనే ఆక్రమించే సాహసానికి తెగించింది. అదేదో వ్యాపార ప్రకటనలో అన్నట్టు మరక మంచిదే. ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు తూలిన మాటలు, నిందలు, వెక్కిరింతలు, దొంగ దీక్షలు, ఉత్తుత్తి ఉద్యమాలు, ఒకరకంగా తెలంగాణ భావోద్వేగాలకు మరింత ఆజ్యం పోశాయి. ఇదీ అందుకేనేమో. అయితే, కాలం కలిసిరావాలి. కేటీఆర్ అన్నట్టు నాలుగేండ్లు ఆగాలి. అంతవరకు కాళోజీ చెప్పినట్టు..