‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల…’ గోరటి వెంకన్న రాసిన ఈ గీతం ఒకనాటి తెలంగాణ పల్లెల దుస్థితికి అద్దం పట్టింది. వెట్టినీ, బానిసత్వాన్నీ నిలదీసి అందుకు నెత్తురుతో మూల్యం చెల్లించిన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం అన్యాయాలూ, అవమానాలనే చవిచూసింది. చెంతనే జీవజలాలు పారుతున్నా పంటపొలాలు బీడు వారి, ఉపాధి అవకాశాలు కనుచూపు మేరలో లేకపోవడం వల్ల ఊళ్లకు ఊళ్లు వలసబాట పట్టాయి.
ఇదేమని నిలదీస్తే, తిరగబడితే ప్రాణాలపై ఆశ వదులుకునే దారుణమైన స్థితి. సరిగ్గా ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. పల్లెపల్లెనూ ఒక్కటి చేసింది. శాంతియుత పంథాలో సమరభేరి మోగించింది. ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ సాకారమైంది. తొమ్మిదేళ్ల చిరుప్రాయంలోనే తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించి, అభివృద్ధి ఫలాలను రుచిచూస్తోంది. ఇతర రాష్ర్టాలు అసూయ పడేంతగా విజయపతాకమై రెపరెపలాడుతోంది.
ఇంకా పదేండ్లు నిండలేదు. అంతర్బహిర్ కుట్రల పరంపర ఇప్పటికీ పూర్తిగా సమసి పోలేదు. అయినా విభజనానంతరం కొత్తగా ఏర్పడిన తెలంగాణ ధైర్యంగా అడుగులేసింది. ఈ క్రమంలో పెనుసవాళ్లను సైతం చిరునవ్వుతో, చెదరని సంకల్పంతో స్వీకరించింది. సరిదారి మనదైతే దరిచేరటం ఏమంత కష్టం కాదని దృఢంగా నమ్మింది. కేవలం తొమ్మిదంటే తొమ్మిది సంవత్సరాల్లో బహుముఖ రంగాల్లో అభివృద్ధి సాధించి చూపింది. దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయమైంది. అందుకే వివిధ రాష్ర్టాలు తమతమ ప్రతినిధి బృందాలను పంపి తెలంగాణ ఎదుగుదలను అధ్యయనం చేస్తున్నాయి.
సంపద పెరిగిందని చెప్పడానికి, సామాన్యులకు ఉపాధి అవకాశాలు దండిగా లభిస్తున్నాయని రుజువు చేయడానికి అపారంగా పెరిగిన పన్నువసూళ్లే ప్రత్యక్షసాక్ష్యం. హైదరాబాద్ చూస్తుండగానే ఎయిరోస్పేస్ హబ్‌గా, సాఫ్ట్వేర్ కేంద్రంగా, ఫార్మాసిటీగా కొత ్తఅందాలు సంతరించుకుని హొయలు పోతోంది. అలాగని నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురికాలేదు. ఒక్క కాళేశ్వరంతోనే అదనంగా లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. అటు సాగుకు తోడ్పడటంతో పాటు ఇటు తాగునీరు లభ్యత పెరగటం, భూగర్భ జలాల మట్టం పెరగటం వంటి ప్రయోజనాలను ఆశించి చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు రూపొందించింది. కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ కింద రూ.5,249 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 27.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరాయంగా ఉచితవిద్యుత్తు అందుతున్నది.
సమర్థవంతమైన ప్రభుత్వం, ఎంతో ముందుచూపుతో ప్రాజెక్టులకు పథకరచన చేయగల పాలకులు ఉన్నప్పుడు నీళ్లూ పారతాయి.. నిధులు వెల్లువెత్తుతాయి. ఉపాధిరంగం సైతం వెలుగులీనుతుంది. అందుకే రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15 నాటికి 1,12,162 కాగా, తాజా అంచనాల ప్రకారం అది రూ.3,17,115కు చేరుకుంది. 2014లో తెలంగాణ ప్రాంతంలో కేవలం 65 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ధాన్యం దిగుబడి దాదాపు నాలుగురెట్లు పెరిగింది. ఇంతవరకూ 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ఇతర పంటలకు రూ.11,437.55 కోట్లు వ్యయంచేశారు. ఇంత చేస్తున్నా రైతులకు అదునుకు చేతిలో డబ్బు లు ఉండాలని, వారు వడ్డీవ్యాపారుల విషవలయంలో చిక్కుకోరాదని భావించి రైతుబంధు పథకం కింద ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ పద్దు కింద ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం అక్షరాలా రూ.65,190 కోట్లు. ఇదిగాక పంటలబీమా, వివిధరకాల సబ్సిడీలు, నకిలీ విత్తనాలు అరికట్టడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవటం, ప్రభుత్వమే పంటవిత్తనాలను సరఫరా చేయటం, వ్యవసాయ యాంత్రీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలస్థాపన, గోడౌన్ల నిర్మాణం వంటి అనేకానేక చర్యలు తీసుకుని అన్నదాతను కంటికి రెప్పలా చూసుకోవటంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ నెల 16న జాతికి అంకితమవుతున్నది. ఈ ప్రాజెక్టులో రెండోదశ పూర్తిగా బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించారు. ఈ దశ పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 2.50 లక్షలఎకరాల భూముల్లో బంగారం పండుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎకరా సాగుభూమి రూ.25 నుంచి రూ.30 లక్షల వరకూ ధర పలుకుతున్నది. రియల్ ఎస్టేట్ పరంగా బుద్వేల్ భూములూ అంతే. అక్కడ అత్యధికంగా ఎకరా రూ.41.75 కోట్లకు అమ్ముడుపోయింది.
తాజాగా మరో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కావటం లక్షలాది మంది బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఒక వరం. తక్కువ ఖర్చుతో వారు చదువు పూర్తి చేసి జీవితంలో స్థిరపడేందుకు అవకాశం ఏర్పడింది. ఈ కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటయ్యే దవాఖానల వల్ల నిరుపేద రోగులకు అత్యుత్తమ వైద్యసేవలు లభించే అదృష్టం కలిగింది.
విభజనానంతరం ఐటీ ఎగుమతుల్లో కూడా తెలంగాణ కొత్తపుంతలు తొక్కుతున్నది. 2022-23 సంవత్సరంలో రూ.2,41,275 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులతో తెలంగాణ కొత్తరికార్డు సృష్టించింది. ఇది విభజనకు ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎగుమతులతో పోలిస్తే అయిదురెట్లు ఎక్కువంటే రాష్ట్రంలో ఐటీ ప్రగతి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.
వాగ్దానాలు చేయడం సులభం. వాటికి అనుగుణంగా పథకాలను పట్టాలెక్కించి త్వరితగతిన పూర్తిచేయటానికి తగిన కార్యాచరణ రూపొందించటం, సమస్త విభాగాలనూ సమన్వయపరుచుకుంటూ సకాలంలో పూర్తయ్యేలా చూడటం చాలా కష్టం. దాన్ని తెలంగాణ ప్రభుత్వం సునాయాసంగా చేయగలిగింది. పెట్టుబడులను ఆకర్షించటం, సాఫ్ట్వేర్ కంపెనీలను ఒప్పించటం అంత సులభమేమీ కాదు. గత దశాబ్ద కాలంలో కుల, మత ఘర్షణలు లేకపోవటం వంటివి బహుళజాతి కంపెనీలను విశేషంగా ఆకర్షించబట్టే ఎయిరోస్పేస్ రంగం మొదలుకొని ఐటీ వరకూ అన్నిరకాల సంస్థలకూ తెలంగాణ కూడలిగా మారింది. అభివృద్ధిలో ఉరకలెత్తుతున్నది. రాగల కాలంలో ఇది మరిన్ని రెట్లు విస్తరిస్తుందన్న ఆశ, శ్వాస అందరిలోనూ కలిగిస్తున్నది.
-ఆర్.శైలేష్ రెడ్డి
77991 77997