మన దేశ అస్తిత్వ ఉద్యమాల చరిత్రలో ఒక పుట తెలంగాణ జర్నలిస్టులది. తటస్థత, నిష్పాక్షికత పేరిట జర్నలిస్టులు ప్రాంతీయ అస్తిత్వ పోరాటాల్లో పాల్గొనలేదు. కానీ తెలంగాణ జర్నలిస్టులు ఈ భ్రమను బద్దలు కొట్టి ‘జై తెలంగాణ జంగ్ సైరన్’ మోగించారు. తెలంగాణ తొలి పోరాటంలో పాల్గొన్న జర్నలిస్ట్ యోధుల వారసత్వంతో మలి దశ ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నది తెలంగాణ జర్నలిస్టు ఫోరం. టీజేఎఫ్ అంటేనే ఒక సంకల్పం. ఒక పోరాటం. ఒక వ్యూహం. ఒక ఎత్తుగడ. స్వప్న సాకారానికి ప్రత్యక్ష పోరాటంలో కలం కవాతులు నడిపింది టీజేఎఫ్. ప్రసార సాధనాల నిండా ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ బతుకు చిత్రాలను గీసింది టీజేఎఫ్. ఆంధ్ర యాజమాన్యాలను ధిక్కరించి, పత్రికల నిండా, చానళ్ల గుండా తెలంగాణ చరిత్ర, వివక్ష, అన్యాయం, అవహేళన, దోపిడీని ఎత్తిపట్టి చిత్రిక పట్టి ఉద్యమానికి ఇచ్చింది. భావవిప్లవంలో జర్నలిస్టులదే సింహభాగం.
అసెంబ్లీలో తెలంగాణ మాట వినపడకూడదంటే మాక్ అసెంబ్లీ పెట్టి జై తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చేసింది టీజేఎఫ్. హైదరాబాద్‌లో 144 సెక్షన్ పెడితే, అన్నింటినీ ధిక్కరించి, ఐదు వేల మందితో అమరుల స్థూపం నుంచి ఆర్టీసీ కల్యాణమండపం వరకు ధిక్కార యాత్ర చేసింది టీజేఎఫ్. భారతదేశ చరిత్రలోనే జర్నలిస్టులు ఎవరూ అస్తిత్వ ఉద్యమ ఆకాంక్షలతో ఢిల్లీ గడప తొక్కలేదు. 2000 మందితో ఢిల్లీ పురవీధుల్లో జై తెలంగాణ నినాదంతో ఊరేగి పార్లమెంట్ పక్కన అతిరథ మహారథులైన తెలంగాణ అఖిల పక్ష నేతలతో ఆగ్రహ ప్రదర్శన చేసింది టీజేఎఫ్.
ఆర్టీసీ కల్యాణ మండపంలో అందరు నాయకులను ‘అలయ్ బలయ్’ చేయించింది టీజేఎఫ్. రాజీనామా చేయని నాయకులను నిలదీసింది.. నిర్బంధంలో నిశ్చలన తటాకంలో రాయినిగూడెం రాయి విసిరింది.. ఉస్మానియాలో ఉరిమిన విద్యార్థి ఉద్యమ కారులతో కదం కదం కలిపింది.. కాకతీయలో ముళ్లకంచెల్లో రక్తమోడింది.. సింగరేణి కార్మికులతో కలిసి కడుములు కట్టిన వాళ్ల గాయాలను తడిమి నిర్బంధంలో వాళ్లతో నిలబడింది తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్. అసెంబ్లీలో బిల్లు పెట్టాలని శాసనసభ, మండలి సభ్యులను ఏకతాటిపైకి తెచ్చింది.. టీజేఎఫ్.
ఔర్ ఏక్ దక్కా తెలంగాణ పక్కా అని టీజేఎఫ్ బయలుదేరి పాతికేండ్లు గడిచింది. మనం ఒక కల గన్నం. అది సాకారం అయ్యింది. తెలంగాణ వచ్చింది.. సకల జనులు, సబ్బండ వర్ణాలు పాల్గొన్న తెలంగాణ పోరాటంలో మూడున్నర కోట్ల మంది ఏకైక ఆత్మగా మారిన గమనంలో, చరిత్రలో మొత్తంగా జర్నలిస్టు ఉద్యమాల చరిత్రలోనే మనది ఒక అధ్యాయం. యూనియన్లకు రాజకీయాలకు అతీతంగా ఒక లూజ్ ఫోరమ్‌గా పని చేసి ఉమ్మడి పని విధానానికి ఒక మచ్చు తునకగా మనమే నిలబడ్డాం. అదొక చరిత్ర.
అందుకే 10వేల మంది జర్నలిస్టులతో జర్నలిస్ట్ జాతర చేసి కనీవినీ ఎరుగని ప్రవాహ గానాన్ని వినిపించాం. ఇప్పుడు వేర్వేరుగా మన పనుల్లో మనం ఉన్నాం. ఎవరికి ఇష్టమైన అభిప్రాయాలతో వాళ్లం ఉన్నాం. కానీ మనది ఉమ్మడి గతం, చరిత్ర, ఉద్వేగం, చెరిగిపోని బంధం. అందుకే ఒకసారి కలుద్దాం, మాట్లాడుకుందాం. మన వీర గాథలను మన ఉద్యమ సాహసాలను గుర్తు చేసుకుందాం. సోమవారం కలుద్దాం. మనకూ త్యాగాల నెత్తుటి చరిత్ర ఉన్నది. మిర్యాల్కర్ సునీల్ కుమార్, గంధమల్ల రాములు.. మన అమరవీరుల నెత్తుటి సాహసాలను స్మరించుకుందాం. కలుద్దాం. కలె బోసుకుందాం. గుండెల నిండా తెలంగాణ నింపుకుందాం. జై తెలంగాణ.
– అల్లం నారాయణ టీజేఎఫ్ అధ్యక్షుడు