తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్ర పాలన పగ్గాలు కాంగ్రెస్ చేతుల్లో ఉండటం కాల మహిమగానే భావించాలి. ఒకరి కష్టం మరొకరి పాలైనట్టుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగనున్నాయి. రాష్ట్ర సాధనలో ఏ మాత్రం పాత్ర లేని కాంగ్రెస్ ఇప్పుడు చిలువలు పలువలుగా చెప్పుకోవచ్చు. పదిహేనేండ్ల అలుపెరుగని ప్రజల పోరును తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నానికి కాంగ్రెస్ ఒడిగడుతోంది.
ఆకలిని సైతం లెక్కచేయకుండా అటుకులు బుక్కి, పట్టు వదలక తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసినవారు కాంగ్రెస్ నిర్వాకంతో ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన 2014 ఫిబ్రవరిలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవమే కానీ, ఒక అనివార్య దశలో ఆ బిల్లును హస్తం పార్టీ ప్రవేశపెట్టిందనేది కాదనలేని వాస్తవం. తెలంగాణ ప్రజల ఉత్తుంగ ఉద్యమానికి తలొగ్గి తీసుకున్న నిర్ణయమది. ఆ మాత్రం దానికే ‘తెలంగాణ ఇచ్చిన పార్టీ’ అనే ట్యాగ్‌లైన్ తగిలించుకొని కాంగ్రెస్ గొప్పలకు పోతోంది. అంతేకాకుండా ‘సోనియమ్మ మనసు కరిగి తెలంగాణ ఇచ్చారు’ అనే దిగజారుడు మాటతో పాటు తెలంగాణ వాళ్లంతా ఆమెకు ఎంతో ఋణపడి ఉండాలి, నిత్యం కృతజ్ఞతా జపం చేయాలనే స్థాయిలో కాంగ్రెస్ నేతల మాటలు ఉంటున్నాయి. సోనియా తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ వారు భజన చేస్తున్నారు తప్ప నిజానికి ఈ మాటను ఉద్యమ చరిత్ర తెలిసిన ఏ తెలంగాణ బిడ్డ కూడా అంగీకరించడు.
2004 నుంచి 2014 దాకా కేంద్రంలో కాంగ్రెస్ పాలనే సాగింది. ఆ కాలమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. విద్యార్థులు సమ్మెలు, ఆందోళనలు చేశారు. కవులు, కళాకారులు వేదికలెక్కి ప్రజల ఆకాంక్షను లోకానికి చాటారు. కాలయాపన వల్ల, గుండె కరగని పాలకుల వైఖరికి యువకులు బలిదానాల బాటపట్టారు. రోడ్లపై వంటావార్పులు, ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్, 42 రోజుల సకలజనుల సమ్మె మొదలైనవి తెలంగాణ సాధనకు మైలురాళ్లు. కేసీఆర్ నాయకత్వంతో పాటు ఉద్యోగులు, మేధావుల జేఏసీల మొక్కవోని పట్టుదల వల్లే కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తమ అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణను తేలేకపోయారు. కాంగ్రెస్ పెద్దలను నిలదీసే దమ్ము ఎవరికీ లేకుండే. రేవంత్‌రెడ్డి అప్పుడు కాంగ్రెస్‌లో లేరు, తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు వెంట ఉన్నారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగంపై ఆంధ్రా నాయకులదే పెత్తనం. వారిని ఎదిరించే శక్తి తెలంగాణలోని ఏ కాంగ్రెస్ నాయకుడికి ఉండేది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వారు కనీసం అసెంబ్లీలోనైనా లేవనెత్తలేకపోయారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఢిల్లీ పెద్దలను గట్టిగా అడగలేకపోయారు. తెగించి మాట్లాడితే తమ పదవికే ఎసరు వస్తుందని భయపడిపోయారు. వారి చేతగానితనం వల్లనే తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి వచ్చింది. యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు, సాయుధ బలగాలను ఉపయోగించారు అప్పటి పాలకులు. వేలాదిమంది లాఠీ దెబ్బలు తిన్నారు. వందలాది మంది జైలు జీవితం గడిపారు. యుద్ధం ముగిసి, విజయం సాధించాక తమ వల్లనే ఆ విజయం సాధ్యపడిందని అనడంలో ఔచిత్యమే లేదు.
తెలంగాణ పదేండ్ల పండుగ కాంగ్రెస్ చేతులమీదుగా జరగడం తెలంగాణవాదులు, ఉద్యమకారులు జీర్ణించుకోలేని విషయం. అసలు ఈ విజయం తాలూకు ఘనత దక్కాల్సింది కాంగ్రెసేతరులకే. తెలంగాణ ఇచ్చింది తామేననే వల్లింపును పక్కనబెట్టి.. తెలంగాణ సాధనకు కృషి చేసిన వ్యక్తులను గుర్తించి, ఈ సందర్భంగా వారిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈ పండుగను రాజకీయాలకు అతీతంగా అందరి పండుగలా జరుపుకోవాలి.
తెలంగాణ పదేండ్ల పండుగ నిర్వహణకు అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఒక ఆహ్వాన కమిటీ వేయాలి. ఎలా నిర్వహించాలి, ఎవరిని సత్కరించాలనేది ఆ కమిటీ నిర్ణయించాలి. అధికారంలో కాంగ్రెస్ ఉన్నంత మాత్రాన ఆ పార్టీ గుత్తాధిపత్యం చెల్లదు. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా హర్షించరు. అయితే కాంగ్రెస్ పెద్దల ఆలోచన మరోలా ఉంది. తెలంగాణ ఆవిర్భావం రోజు తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాగాంధీని రాష్ర్టానికి రప్పించి, ప్రజల తరఫున ఆమెను ఘనంగా సన్మానించాలన్న తన తలంపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల బయటపెట్టింది. తెలంగాణ రాకలో సోనియా పాత్ర ఎంత, ఏమిటి? అనే ప్రశ్నలకు భిన్నమైన వాదనలున్నాయి. పదేండ్లుగా యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె తెలంగాణ ఉద్యమంపై ఏనాడూ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఆంధ్రా నేతల మాటలకే విలువనిచ్చారు. వారి అదిరింపులకు బెదిరిపోయారు కూడా. అందువల్లే తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు. చివరికి 2014 ఎన్నికల్లో నష్ట నివారణ కోసం తెలంగాణను ప్రకటించారు. ఇదంతా స్పష్టంగా తెలిసిన తెలంగాణ ప్రజలకు సోనియా పట్ల నిరసన భావమే తప్ప ప్రత్యేక గౌరవమేమీ లేదు. ప్రభుత్వపరంగా, ప్రజాధనంతో ఆమెను సత్కరించాలని ప్రజలు కోరుకోవడం లేదు.
రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఆయనకు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం పట్ల పూర్తి అవగాహన లేదనిపిస్తోంది. 2006 నుంచి రేవంత్‌రెడ్డిది సొంత రాజకీయ విధానమే. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు ఆయన ఎన్నడూ మద్దతు పలకలేదు. అవకాశవాదిగా, వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తూ, తన ఉన్నతికి అనుగుణంగా పార్టీలు మారుతూ నేడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఏదో కసితో అర్థం పర్థం లేని మార్పులను చేపడుతున్నారే తప్ప ఒక్కో తెలంగాణ చిహ్నం వెనుక ఉన్న చరిత్ర ఏమిటనే ఆలోచన ఆయనకు ఉన్నట్టు అనిపించడం లేదు. ఈ సందర్భంగా ‘రాష్ట్ర ఏర్పాటు ఎవరి వల్ల సాధ్యపడింది?’ అని తెలంగాణ ప్రజలను అడిగి.. వారిలో ఎక్కువమంది ఎవరి పేరు చెబితే వారిని సత్కరించడం సముచితం.
– బి.నర్సన్
94401 28169