సూదిమొనంత పనిచెయ్యనోళ్లు ఏనుగంత అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిమీద రుద్దారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లాడినోళ్లు చేసిన అప్పుల లెక్క చూస్తే గుండె గుబేలనిపించక మానదు. అప్పు చేయడమే తప్పన్నోళ్లు అధికారంలోకి వచ్చి పది నెలలైనా పూర్తికాకముందే చేసిన అప్పు అక్షరాలా రూ.75,118 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సర్కార్లు కలిసి చేసిన మొత్తం అప్పు రూ.72,658 కోట్లే. అది 60 ఏండ్ల అప్పు. ఆ సంగతి కాంగ్రెస్ శ్వేతపత్రంలోనే రాసుకున్నది. మరి ఏడాదికి రెండు నెలలు తక్కువ ఉండగానే అంతకుమించి అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడెక్కడో, ఏవేవో జామీనులిచ్చి తెచ్చిన అంతలావు సొమ్ము ఏం చేశారు? ఎక్కడ పోశారు?
ఒక్క ఇటుక పెట్టలేదు. మీటరు గోడ లేపలేదు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు. డీఏ కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. మరి ఏమయ్యాయి అప్పు తెచ్చిన వేల కోట్లు? రైతుబంధు వేశారా? అంటే వేయలేదు. అన్నమాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేశారా? అంటే చేయలేదు. మహిళలకు, వృద్ధులకు పింఛన్లు పెంచలేదు. ఆడబిడ్డలకు తులం బంగారం పంచలేదు. కనీసం పుట్టిన పాపకు కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అతీగతీ లేదు. దళితబంధు జాడే లేదు. ప్రాజెక్టు కట్టడం మాట దేవుడెరుగు, కనీసం కిలోమీటరు రోడ్డు కూడా వేయలేదు. బాండ్లు రాసిచ్చి మరీ తెస్తున్న అప్పునంతా ఎక్కడ ఖర్చు చేశారో చెప్పే నాథుడే కరువయ్యాడు. రూ.80 వేల కోట్ల కాళేశ్వరంలో లక్ష కోట్లు చేతులు మారాయని వితండవాదం చేసినవాళ్లు దాదాపుగా అంతే మొత్తాన్ని తెచ్చి ఏ గొయ్యిలో పోశారో చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ అప్పు తేలేదని ఎవరన్నారు? అప్పుచేసి తెచ్చిన సొమ్మును ఏం చేశారనేది అసలు సంగతి. ఆ సొమ్మును కేసీఆర్ సంపదను పెంచేందుకు వినియోగించడం వల్లే రాష్ట్రం అభివృద్ధిలో అంగలు వేసిందనేది ప్రత్యక్షర సత్యం. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించారు. మిషన్ కాకతీయతో వేల చెరువుల పూడిక తీశారు. కాంగ్రెస్ సర్కారు కనీసం తట్టెడు మట్టి ఎత్తలేదు. చెంబెడు నీళ్లు ఇవ్వలేదు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదైనా కొత్త పని ఒక్కటీ మొదలుపెట్టలేదు. అభివృద్ధి ఆగమైంది. సంక్షేమం సడుగులు ఇరిగినై. అప్పులు మాత్రం తుప్పల్లా పెరిగినై. ఏమయ్యాయి అప్పు చేసి తెచ్చిన నిధులు? అని ప్రజలు అడుగుతున్నారు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీస్తున్నరు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో కోటి రతనాల వీణ కోటి ఎకరాల మాగాణంగా రూపు సవరించుకుంది. రాష్ట్రం పచ్చగా కళకళలాడింది. ప్రజల బతుకులు మారాయి. మరి మూటల కొద్దీ పైసలు తెచ్చి కాంగ్రెస్ ఏం కట్టిందీ? అంటే సమాధానం సున్నా. తెచ్చిన అప్పులపై ప్రజలకు పైసా పైసా లెక్క చెప్పాల్సి ఉంటుందని కాంగ్రెస్ సర్కారు పెద్దలు గుర్తుంచుకుంటే మంచిది. సంపద పెంచి అందరికి పంచిన చరిత్ర కేసీఆర్‌ది. అధికారమే సోపానంగా, అడ్డగోలు హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్‌కు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలువదని ప్రజలకు మరోసారి తెలిసివచ్చింది.