పభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం జూన్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం అన్ని శాఖల అధిపతులు, పెన్షన్ చెల్లింపు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందులో సమగ్ర వైద్య చికిత్స నిబంధనలు, 1971లోని పేరా 7లో తెలిపిన విధంగా కుటుంబ వివరాలు, ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని కోరింది. అయితే, ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈలోగా వివరాలు అడగటంతో ఉద్యోగులు, పెన్షనర్లలో అభద్రత మొదలైంది. స్పష్టమైన మార్గదర్శకాలేవీ లేకుండా ప్రవేశపెడుతున్న క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల స్కీమ్ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిస్థితి దయనీయంగా ఉన్నది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటం వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స చేయటం లేదు. ప్రభుత్వానికి ఆసుపత్రులపై నియంత్రణ లేనప్పుడు ఈ కొత్త ట్రస్టు మెరుగైన సేవలు అందిస్తుందా? అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో అభద్రతా భావం పెంచుతున్నది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మినహాయింపు మొత్తానికి ప్రైవేటు రంగంలో ఉత్తమ ఆరోగ్య పాలసీలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పథకంలో ఉన్న గొప్పతనం ఏమున్నది? ఆరోగ్య కార్డు ఉన్న ప్రతి ఉద్యోగి రెఫరల్ హాస్పిటల్లో చేరినప్పుడు సాధారణ రోగుల మాదిరిగా చికిత్స జరగాలి. అంతేకానీ ఈహెచ్ఎస్ రోగి అని వివక్ష ఉండకూడదు.
ఉద్యోగి ప్రాణరక్షణే ధ్యేయంగా ఆసుపత్రులు అన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స జరిపేలా మార్గదర్శకాలు రూపొందించాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయింపు ఉండేలా స్పష్టమైన నిబంధనలు ఉండాలి. భార్యాభర్తల్లో ఇద్దరూ పెన్షనర్లు అయితే ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే మినహాయింపు ఉండి, ఇద్దరికీ వైద్య చికిత్స అందించే విధంగా 2013లో ఇచ్చిన ఉత్తర్వులో తెలిపిన వివరణ కూడా ఉండాలి. ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటాతో కూడిన ఆరోగ్య పథకం నిధుల పారదర్శక నిర్వహణకు చర్యలు వివరంగా రూపొందించాలి.
ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరు ట్రస్టు సీఈవోగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, హోమ్, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సభ్యులుగా ఉన్నారు. వీరందరితో కూడిన ట్రస్టు సమావేశం జరిగినా విధివిధానాలు ఇంకా వెల్లడి కాకపోవటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగి తన సొంత డబ్బును ప్రీమియంగా చెల్లిస్తున్నప్పుడు, గతంలో సౌలభ్యాల కంటే మెరుగైన సేవలు అందాలని కోరుకుంటారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద చికిత్స కోసం అధికారికంగా అంగీకరించిన ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం జరిగినట్లు, ప్రభుత్వం నిర్ణయించిన లేదా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ప్యాకేజీ ధరలకు చికిత్స చేయటానికి ప్రైవేటు ఆసుపత్రులు అంగీకరించిన వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు, హైదరాబాద్ వంటి మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లోని చికిత్స ఖర్చులు, జిల్లాలో ఉన్న ఆసుపత్రుల రేట్లు ఒకేవిధంగా చెల్లిస్తారా? అనేది స్పష్టత ఉండాలి. అంతేకాదు, ఈహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లు ఎప్పటికప్పుడు సవరించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. గతంలో ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయకపోయినా ఖర్చు చేసిన డబ్బులు మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా వెనక్కి వచ్చే మార్గం ఉండేది. కానీ కొత్త విధానంలో ఎలాంటి మార్గదర్శకాలు లేకపోతే అటు రీయింబర్స్మెంట్ ఉండదు, ఇటు క్యాష్‌లెస్ వైద్యమూ దక్కకుండా రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యే అవకాశం ఉన్నది.
ఇంకో ప్రధానమైన సమస్య..ఓపీఎస్ కింద నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే పెన్షన్ వస్తుంది. అదే సీపీఎస్ కింద నియామకమై రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు ఎవరైనా వారికి పెన్షన్ రాదు. ప్రభుత్వమేమో తాను ఇచ్చే నూతన హెల్త్ స్కీంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లకూ హెల్త్ కార్డులు జారీచేస్తామని అంటున్నది. పెన్షన్ రాకుంటే నెలనెలా 1.5 శాతం డబ్బులు మినహాయింపుకాని పరిస్థితిలో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం నుంచి భరోసా లేదని సీపీఎస్ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ ఉండదు. కనుక పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) ఐడీల ఆధారంగానే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో పెన్షనర్ల వివరాలు అప్లోడ్ చేసి హెల్త్ స్కీమ్‌ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఆదర్శ బడులు, కేజీబీవీలు తదితర సంస్థల సిబ్బందికి మొదటివిడతలోనే ఆరోగ్య పథకం అమలు చేయాలి. అదేవిధంగా 5 లక్షలకు పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలి. ఈహెచ్ఎస్ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలి. హడావుడి ప్రకటనలు, పథకాలతో ఉద్యోగులు, పెన్షనర్లు గందరగోళానికి గురికాకుండా చూడాలి.
– కె. వేణుగోపాల్ 98665 14577