 
                                                            ‘విశ్వాన్ని ధరించియున్న విశిష్ట శక్తి ధర్మం. అందువల్ల ధర్మాన్ని రక్షించుకుంటే, అది సమాజాన్ని, విశ్వాన్ని విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తుంది!’- ‘దేహాన్ని ధరించియున్న విశిష్ట కవచం చర్మం! చర్మాన్ని కాపాడుకుంటే, అది దేహాన్ని ఛిద్రం కాకుండా కాపాడుతుంది!’ ఇది సార్వత్రిక సత్యం. అలాగే ‘తెలంగాణను ధరించియున్న ఆత్మీయ పార్టీ బీఆర్ఎస్. కాబట్టి, బీఆర్ఎస్ను బలపరిస్తే, అది తెలంగాణను బలోపేతం చేస్తుంది!’ ఇది చారిత్రక సత్యమంటున్నారు రాజకీయ పరిశీలకులు.
బీఆర్ఎస్ హయాంలో శుక్ల పక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందిన తెలంగాణ, రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో కృష్ణ పక్ష చంద్రునిలా నానాటికీ దిగజారడాన్ని పరస్పరం చెప్పుకుంటూ వాపోతున్నారు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా ఓటర్లు. నాడు ‘కూలీ మీడియా’ ద్వారా బీఆర్ఎస్పై విసిరిన గోబెల్స్ అభాండాలకు, అబద్ధాల వాగ్దాన కర్ణుడు రేవంత్ హామీలకు, ఊకదంపుడు ఉపన్యాసాలకు భ్రమించి, తల్లి వంటి బీఆర్ఎస్ను వదిలి ఎండమావి లాంటి కాంగ్రెస్ వెంటపడి దాహార్తులం అయ్యామంటూ పశ్చాత్తాప పడుతున్నారు వివిధ వర్గాల ప్రజలు. అంతేకాదు, తెలంగాణ ఆవిర్భావం నుంచి అనన్య సామాన్యమైన కేసీఆర్ కృషి గురించి చెప్పుకుంటున్నారిలా.
నాడు తెలంగాణ శిశువు పురిట్లోనే పోతే బాగుండు అని వెయ్యి కండ్లతో ఎదురుచూశారు ప్రత్యర్థి పార్టీల నేతలు. వాళ్లు ఆశించినట్టే విద్యుత్తు, వ్యవసాయం, పారిశ్రామిక సంక్షోభాలు చుట్టుముట్టాయి తెలంగాణను. నీళ్లు లేక పంటలెండి అన్నదాతలు ఆత్మహత్యలపాలయ్యారు. విద్యుత్తు చాలక పరిశ్రమలు మూతపడ్డయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అన్నదాతలతో సహా కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు పొట్టచేతబట్టుకొని పొరుగు రాష్ర్టాలకు వలసపోయారు. నాటి దుర్భర పరిస్థితిని ఎత్తిచూపుతూ, ప్రత్యేక తెలంగాణ ఒక విఫల ప్రయోగం అన్న ప్రచారానికి కొందరు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు కుట్రలు ప్రారంభించారు. అలాంటి కుట్రలు, సంక్షోభాల ఉప్పెనలోనూ పెనుగాలికి ఊగిపోతున్న కొమ్మ మీద ధైర్యంగా కూర్చున్న పక్షిలాగే, నిబ్బరాన్ని కోల్పోలేదు కేసీఆర్. ఎందుకంటే, ఆ పక్షి తన రెక్కల్ని నమ్ముకున్నట్టే, కేసీఆర్ తన జ్ఞాపకశక్తిని నమ్ముకున్నారు. జ్ఞానాన్ని మించిన శక్తి లేదంటున్నది భగవద్గీత.
తక్షణమే కేసీఆర్ పొరుగు రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొన్నారు. క్రమంగా విద్యుత్తు స్వయంసమృద్ధి సాధన దిశగా పరిశ్రమించారు. మిషన్ కాకతీయలో భాగంగా వేలాది చెరువుల పునరుద్ధరణ, గొలుసుకట్టు రిజర్వాయర్లు, కాలువలు, భారీ ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించారు. వర్షాభావం, పర్యావరణ కాలుష్యాల బారినుంచి తెలంగాణను కాపాడేందుకు అడవుల పునరుద్ధరణకు పూనుకున్నారు.
హరితహారం, గ్రీన్ చాలెంజ్, నర్సరీల పెంపకం, అడవుల్లో విత్తనాలు చల్లించడం, పండ్ల మొక్కలు నాటించి కోతుల కోసం ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడం, అడవుల చుట్టూ లోతైన కందకాలు తవ్వించడం తదితర కార్యక్రమాలు చేశారు. తద్వారా 19 శాతానికి పతనమైన అడవులను ఏడేండ్లలో 29 శాతానికి ఎక్కదీశారు. గ్రామ గ్రామానికి నర్సరీ ద్వారా అటవీ పునరుద్ధరణను నిరంతర ప్రక్రియగా రూపొందించారు. తద్వారా వర్షాలు పుష్కలంగా కురిశాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును అందించారు. దాంతో ఏండ్ల తరబడి మూలనపడ్డ బోర్లన్నీ వేగంగా నీళ్లు తోడిపోసినయి. అలా నీళ్ల జలజల, పంటల గలగల, రైతుల ముఖాలు కళకళలతో తెలంగాణ అంతటా సంపద సంగీతం వీనుల విందు చేసింది. ‘నూరు శాతం సాగునీటి వనరులను పెంపొందించుకున్న భారత ఏకైక రాష్ట్రంగా నీతిఆయోగ్ నుంచి ప్రశంసలందుకున్నది తెలంగాణ. పంటలు, పశుగ్రాసం పెరగడంతో పేదలకు సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు అందించారు కేసీఆర్. చెరువుల్లో చేప పిల్లల్ని వదిలి, ఎస్సీ, బీసీలకు వాటిని అప్పగించారు. గిరిజనులకు పోడు పట్టాలిచ్చి, వారితో సాగు చేయించారు. కోళ్ల పరిశ్రమలకు రాయితీలు ప్రకటించారు. అలా మిషన్ కాకతీయను బహుళార్థ సాధక ప్రాజెక్టుగా భాసింపజేశారు. అలాంటి ప్రణాళికాబద్ధమైన నిర్విరామ కృషి ఫలితంగానే చీకటి వెలుగుల ఆకలి తెలంగాణను, అతి స్వల్పకాలంలో వెలుగుల అన్నపూర్ణగా విరాజిల్లేలా చేశారు.
భారత ధాన్యాగారాలుగా ఖ్యాతిగాంచిన పంజాబ్, హర్యానాల కన్నా మిన్నగా వరి ధాన్యాన్ని పండించిన ఘనత దక్కించుకున్నది తెలంగాణ. పంటలు, పాడి, మాంసం ఉత్పత్తులు, వాటికి సమాంతరంగా ఐటీ ఉత్పత్తులు 100 శాతం నుంచి 400 శాతానికి వృద్ధి చెందాయి. దాంతో ప్రజల కొనుగోలు శక్తి బాగా పెరిగింది. జీఎస్టీ వసూళ్లలో టాప్ టెన్ రాష్ర్టాల్లో తెలంగాణ చేరడమే అందుకు నిదర్శనం. తలసరి ఆదాయ గణనలో రూ.3,08,732తో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది తెలంగాణ.
ప్రజల కొనుగోలు శక్తి ఎక్కడో, పరిశ్రమలక్కడ. అంతేగానీ, మోదీ, బాబు, రేవంత్‌ల ముఖాలను చూసి పరిశ్రమలు రావని బక్కచిక్కిన కేసీఆర్ నిరూపించారు. బీఆర్ఎస్ హయాంలో దేశదేశాల నుంచి 23 వేల పరిశ్రమలు రివ్వున వచ్చి తెలంగాణలో వాలాయి. 22.50 లక్షల మందికి ఉపాధి కల్పించినయి. అంతేకాదు, దేశం నలుమూలల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణకు క్యూ కట్టారు. అందుకే నాడు తెలంగాణ భూముల ధరలు బంగారంతో పోటీ పడ్డయి. అందుకే, ‘ది ప్లానింగ్ లీడర్ కేసీఆర్’, ‘ది ప్రొగ్రెసివ్ పార్టీ బీఆర్ఎస్’ అన్న నానుడి దేశమంతటా మారుమోగింది. అందుకే ‘దేశ్ కీ నేత’ అని కేసీఆర్‌ను దేశం పిలిచింది.
అంతేగాదు, వేలాది గురుకులాలు, జిల్లాకో మెడికల్ కళాశాల, ఒక పాలనా భవనం, ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలను సమర్థవంతంగా తీర్చిదిద్దడం, సర్కారీ విద్య, వైద్య రంగాలకు ప్రజాదరణను పెంపొందించడం లాంటి ఎన్నో పనులు చేశారు కేసీఆర్. ఆధ్యాత్మిక రంగంలోనూ పలు ఆలయాలు, మసీదులు, చర్చీల నిర్మాణాలకు, సుందరీకరణకు గణనీయంగా నిధులందించి, మతసామరస్యతను ప్రదర్శించింది బీఆర్ఎస్. శాంతిభద్రతల పటిష్ఠత ద్వారా మత కల్లోలాలు, ఉగ్ర విధ్వంసాలకు తావులేని ప్రశాంత తెలంగాణను రూపొందించారు. అలా సర్వతోముఖాభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా విరాజిల్లింది బీఆర్ఎస్. నిర్మలమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ రూపకల్పన, తరతరాలుగా ఫ్లోరైడ్ బాధిత నల్గొండను, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడం, సువిశాల ఎడ్యుకేషన్ హబ్‌లను ఏర్పాటు చేయడం, అపూర్వమైన ఐటీ హబ్, సురుచిర సుందర కళాత్మక సచివాలయం, సుందరవనంలో మహోన్నత అంబేద్కర్ విగ్రహం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు, టీపాస్-ఐపాస్ పారిశ్రామిక విధానం, అపూర్వ ఆధ్యాత్మిక శిల్పకళా క్షేత్రంగా అపర తిరుమలగా యాదాద్రి రూపకల్పన, రాజధాని హైదరాబాద్‌ను హరితహారాలతో అలంకరించి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డును పొందడం, అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణకు ప్రపంచ ఖ్యాతిని సంపాదించడం, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర మానవీయ పథకాల సృష్టి వంటి అపూర్వ, అద్భుతాలను చేయగలిగిన ఏకైక పార్టీ బీఆరెస్సే. అలాంటి అద్భుతాల ప్రణాళికా రూపశిల్పి ఒక్క కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్ అన్నది కుల, మత, పార్టీలకతీతంగా మెజారిటీ ప్రజల అభిప్రాయమంటున్నారు కొందరు పరిణతి చెందిన ఓటర్లు.
కాంగ్రెస్ గురించి ఓటర్ల నోట వినిపిస్తున్న మాటలివీ. ‘రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల హామీల ఎగవేతలు, నిత్యం అప్పులు-అమ్మకాలు, హైడ్రాతో చీకట్లో కూల్చివేతలు, కబ్జాలు-కమీషన్లు, కమీషన్ల వాటాల కోసం మంత్రుల మధ్య కొట్లాటలు, ప్రశ్నించేవారిపై కేసులు, ప్రతిపక్షాల మీద విచారణ కమిషన్లు, గల్లీ టు ఢిల్లీ విమాన ప్రయాణాలు, బీజేపీతో పగలు కుస్తీ, రాత్రిళ్లు దోస్తీ, ఓట్ల చోరీలు, నిత్యం డైవర్షన్ పాలిటిక్స్.. ఇవి తప్ప సగర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటైనా ఉందా రేవంత్-కాంగ్రెస్ పాలనలో?’ అని నిట్టూరుస్తున్నారు ఓటర్లు.
నాడు విల్లెక్కుబెట్టిన అర్జునుడు ‘గురువు గారూ నాకు చెట్టు కొమ్మ మీది పిట్ట, దాని కన్ను తప్ప మరేమీ కనిపించడం లేదు’ అన్నాడు. అలాగే నేడు జూబ్లీహిల్స్‌లో మెజారిటీ ఓటర్లు ‘మాకు కేసీఆర్, కారు గుర్తు తప్ప, మరేమీ కనిపించడం లేదు’ అని అంటున్నారు. నిజంగా ఇది శుభ పరిణామమే. ఎందుకంటే, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ విజయమంటే ఒక్క సునీతమ్మ విజయమే కాదు, భావి తెలంగాణ ప్రజా విజయానికి శుభ సూచికంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు.
కాంగ్రెస్ గురించి ఓటర్ల నోట వినిపిస్తున్న మాటలివీ. ‘రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల హామీల ఎగవేతలు, నిత్యం అప్పులు-అమ్మకాలు, హైడ్రాతో చీకట్లో కూల్చివేతలు, కబ్జాలు-కమీషన్లు, కమీషన్ల వాటాల కోసం మంత్రుల మధ్య కొట్లాటలు, ప్రశ్నించేవారిపై కేసులు, ప్రతిపక్షాల మీద విచారణ కమిషన్లు, గల్లీ టు ఢిల్లీ విమాన ప్రయాణాలు, బీజేపీతో పగలు కుస్తీ, రాత్రిళ్లు దోస్తీ, ఓట్ల చోరీలు, నిత్యం డైవర్షన్ పాలిటిక్స్.. ఇవి తప్ప 
సగర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటైనా ఉందా రేవంత్-కాంగ్రెస్ పాలనలో?’ అని నిట్టూరుస్తున్నారు ఓటర్లు.
– పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889
 
                            