కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలల్లోనే తెలంగాణ ఆగమాగమైపోయింది. మొన్నటిదాకా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారిపోతున్నది. నిరాశ నీడల్లో కొట్టుమిట్టాడుతున్నది. కాంగ్రెస్ ఊదరగొట్టినట్టు మార్పు అయితే వచ్చింది. కానీ, అది మంచికి మాత్రం కాదని తేలిపోతున్నది. కాంగ్రెస్ పాలనలో జనజీవనం అతలాకుతలం అయిపోతున్నది. ఉచితాల హామీలు గుప్పించి, అవకాశం ఇస్తే అందలం ఎక్కిస్తామని ఊరించి, ఉబ్బించి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అధికారపు యావతో ఇచ్చిన హామీల పర్యవసానాలను ఆ పార్టీ ఊహించలేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రజల్లో వ్యక్తమవుతున్న నిస్పృహే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కావచ్చు. కానీ, ఆటోడ్రైవర్ల బతుకులు ఏం కావాలనేది ప్రభుత్వ పెద్దలెవరూ ఆలోచిస్తున్నట్టు లేదు. వారి వృత్తి మీద పిడుగుపడటంతో చాలామంది ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా ఆటోడ్రైవర్లు బలవన్మరణం పాలయ్యారు. మరోవైపు నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. చేతివృత్తులతో సహా అన్ని రంగాలకు చెందిన సామాన్య ప్రజలు మారిన పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మన సమాజ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగం చుట్టే అల్లుకుని ఉంటుంది. అందుకనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా దృష్టి నిలిపింది వ్యవసాయంపైనే. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సక్రమ సరఫరా, చివరి గింజ దాకా పంటల కొనుగోలు వంటి సమగ్ర చర్యల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సాగును బాగు చేసింది. దిగుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చింది. అయితే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు వ్యవసాయమే నిరాదరణకు గురవుతున్నది. కరెంటు, సాగునీరు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసేదేమీ లేక రైతులు ఎండిపోతున్న పొలాల్లోకి పశువులను తోలుతున్నారు. పెట్టుబడి సాయం అందక, అప్పులు పెరిగిపోయి రైతన్నలు ప్రాణాలు బలిపెట్టుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైపోవడం విషాదకరం. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను తప్పులుగా చూపించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ తన అనాలోచిత విధానాలతో సాగు సడుగులు విరగ్గొట్టింది. నిన్నటిదాకా నిండుకుండల్లా కళకళలాడిన చెరువులు, కాలువలు ఎండిపోతున్నాయి. ఉబికి వచ్చిన భూగర్భజలాలు మళ్లీ లోతుల్లోకి జారిపోతున్నాయి. బోర్లతో అదృష్టాన్ని పరీక్షించుకునే పాత రోజులు మళ్లీ దాపురించాయి. రకరకాల సమస్యలు చుట్టుముట్టడంతో సాగు విస్తీర్ణం మూడు నెలల్లోనే దారుణంగా పడిపోయింది. ఉన్న ఆ కాస్త పంటలకూ కరెంటు, నీళ్లు ఇవ్వలేక కాంగ్రెస్ సర్కారు చతికిలపడుతున్నది. చేతులెత్తేస్తున్నది.
కరెంటు కష్టాలు వ్యవసాయాన్నే కాదు, మొత్తంగా రాష్ర్టాన్నే చుట్టుముట్టాయి. మంత్రులు పాల్గొనే సభలు, సమావేశాల్లోనూ కరెంటు కోతలు వెక్కిరిస్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఈ సమస్యలకు తోడు తాగునీటి సమస్య తలుపు తడుతున్నది. గత పదేండ్లుగా నీటి సమస్య చూడని రాజధాని నగరం హైదరాబాద్ తాగునీటి సమస్య ముంగిట్లో నిల్చున్నది. బెంగళూరు దుస్థితి మనకు రావద్దని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చేసిన హెచ్చరికలు ప్రభుత్వం చెవికెక్కాయో లేదో తెలియడం లేదు. అన్నిటికీ గత ప్రభుత్వంపై నిందలు వేసి పబ్బం గడుపుకొనే సమయం దాటిపోయిందని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. లంకెబిందెల గురించి చౌకబారు సాకులు మాని, సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలి. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సాగుకు ఊపిరిపోయాలి. ప్రజలకు ఊరటనిచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. డంబాచారపు హామీల సంగతి తర్వాత, కనీస సౌకర్యాలను సక్రమంగా సమకూర్చడంపై పాలకులు దృష్టిపెట్టాలి.