ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధన సేవల కోసం రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఆరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఒక్కో సంస్థ ఒక్కో విధమైన సేవలు అందించనున్నది. ఇప్పటికే 540 పాఠశాలల్లో పనిచేస్తున్న ఓ సంస్థ 33 జిల్లాల్లో కృత్రిమమేధ ఆధారిత ప్లాట్‌ఫామ్‌తో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, గణితంలో ప్రాథమిక అంశాలను బోధించనున్నది. మరో సంస్థ ఇంటర్ నీట్, జేఈఈ, క్యాట్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తూ, పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో శిక్షణ ఇవ్వనున్నది. ఇంకొక సంస్థ 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు బాల సురక్ష, రక్షణ కార్యక్రమాల సేవలను అందించనున్నది.
ఇంకో సంస్థ 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణ ఇవ్వనుండగా, మరొకటి పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేల మంది విద్యార్థులను తిరిగి బడిలో చేర్పిస్తూ బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేయనున్నది. ఇక మరో సంస్థ 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) శిక్షణను అందించనున్నది. అయితే, ఇప్పటికే 540 పాఠశాలల్లో పనిచేసిన సంస్థ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు, అభ్యసన ఏ మేరకు అభివృద్ధి చెందాయో విద్యాశాఖ సమీక్షించిందా? దాని ఫలితాలెలా ఉన్నాయి? అన్నవి ఇక్కడ ప్రశ్నలు.
ఒప్పందం చేసుకున్న సంస్థలన్నీ విద్యకు సంబంధించిన టెక్నాలజీ రూపొందించి, అందించే వ్యాపారంలో ఉన్నవే. ప్రస్తుత ఒప్పందం ప్రకారం అవి ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలు అందిస్తున్నప్పటికీ, ఈ సేవలను వినియోగదారులైన ప్రైవేటు విద్యాసంస్థలకు శాంపిల్‌గా చూపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో వాటిని విజయవంతంగా వినియోగిస్తున్నామని ప్రచారం చేసుకుంటూ, తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే అవకాశం ఉంది.
సాంకేతిక విప్లవం విద్యారంగంలోనూ అనేక మార్పులు తీసుకువచ్చింది. విద్యా వ్యవస్థలో డిజిటల్ లెర్నింగ్ ప్రాధాన్యం పెరిగింది. గతంలో సాంప్రదాయ విధానంలో ఉండే బ్లాక్ బోర్డు, చాక్ పీస్ లెర్నింగ్ స్థానంలో డిజిటల్ స్క్రీన్లు తరగతి గదుల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే పుస్తకాల స్థానంలో కంప్యూటర్లను తీసుకొచ్చి దాదాపు 15 ఏండ్లపాటు డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించి, అమలు చేసిన స్వీడన్ దేశం డిజిటల్ ఫస్ట్ విధానం వల్ల విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించింది. దీంతో తమ దేశంలో సాంప్రదాయ విద్యా విధానంలో పాఠాలు బోధించాలని పాఠ్యపుస్తకాలు, చేతిరాత కోసం పేపరుకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. విద్యార్థుల స్క్రీన్ టైమ్ గురించి స్వీడన్ విద్యా శాఖ మంత్రి లోటా ఎడోమ్ గతేడాది ఆందోళన వ్యక్తం చేశారు.
మొదటి ఐదేండ్ల కాలంలో పిల్లలకు బొమ్మలతో బోధించి కథలు చెప్పే విధంగా ప్రాథమిక విద్య అభ్యసనా ప్రక్రియ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడం, వస్తువుల అమరిక ద్వారా భాష, గణిత నైపుణ్యాలకు సంబంధించిన పూర్వజ్ఞానాన్ని ఆర్జిస్తారు. కాబట్టి, వీటికి సంబంధించిన కృత్యాలను జట్టుగా, వ్యక్తిగతంగా పిల్లలతో ఉపాధ్యాయులే భౌతికంగా చేయించడం ముఖ్యం. అప్పుడే వారిలో జ్ఞానేంద్రియాల సమన్వయం జరిగి అభ్యసనం ఆరంభమవుతుంది.
పైగా వారిలో బెరుకు స్వభావం తొలగిపోయి, తార్కిక జ్ఞానం, సృజనాత్మకత పెరుగుతాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో మాత్రం డిజిటల్ ఎడ్యుకేషన్ విధానం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం కొత్త, కొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. పలక, బలపం, పేపర్, పెన్ను స్థానంలో నర్సరీ నుంచే విద్యార్థుల చేతుల్లోకి డిజిటల్ గ్యాడ్జెట్లు వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ఎడ్యుకేషన్ విషయంలో స్వీడన్ ప్రభుత్వ అనుభవాల రీత్యా మన దేశంలోనూ డిజిటల్ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలనే డిమాండ్లు విద్యారంగ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
2008లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఉమ్మడి ఏపీలోని వెయ్యి పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు పునాది వేసింది. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లతోపాటు, ఇన్స్ట్రక్టర్ను సమకూర్చింది. తీరా ఆ స్వచ్ఛంద సంస్థ కాలపరిమితి ముగిసిపోగానే, ఆయా పాఠశాలల్లో చెడిపోయిన కంప్యూటర్లను కనీసం మరమ్మతులు చేయించడం గాని, ఇన్‌స్ట్రక్టర్ల నియామకం గాని చేయకపోవడం వల్ల ఆ వ్యవస్థ మూలకు పడిపోయింది.
స్వచ్ఛంద సంస్థలు తాము రూపొందించిన ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తాయే గానీ, తిరిగి ఆ ప్రణాళిక అమలు పరచాల్సింది విద్యాసంస్థలు, విద్యా శాఖనే. స్వచ్ఛంద సంస్థలు పనిచేసిన కాలంలోని మంచి పనులు, సాధించిన ఫలితాల గురించి విద్యాశాఖ వద్ద ఏమైనా సమాచారం ఉందా? జవాబుదారీతనం లేకుండా ఇటువంటి సంస్థలు పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జరిగే బోధనకు ఆటంకం కల్పిస్తున్నాయనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి.
మన రాష్ట్రంలో పాఠశాలలకు భౌతిక వసతులు, మౌలిక వసతుల కొరత, విద్యార్థులను ఆకర్షించే పాఠశాల పరిసరాలు లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులకు బోధనా కార్యక్రమాలు కాకుండా యాప్‌లతో ఆన్లైన్లో రిపోర్టులను సమర్పించడం, ముఖ గుర్తింపు హాజరు వంటి అనవసర కార్యక్రమాలతో కీలక బోధనా సమయం వృథా కావడం వంటి సమస్యలున్నాయి. వాటిని తీర్చడానికి శాశ్వత విధానాలను తక్షణమే అభివృద్ధి చేయాలి. ఈ వసతులు కల్పించడానికి బడ్జెట్లో విద్యారంగానికి ఇతోధికంగా నిధులను కేటాయించాలి.
రాష్ట్రంలో పాఠశాల విద్య అభ్యసన, పర్యవేక్షణ, విద్యా సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. ఈ సమస్యలపై విద్యావేత్తలతో, విద్యా కమిషన్ సభ్యులతో, విద్యాశాఖ అధికారులతో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని, వాటిని శాశ్వతంగా అమలు చేసే చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యపై ముందుచూపుతో సమగ్ర, శాశ్వత నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం డిజిటల్ బోధన లాంటి చిట్కాలతో సమస్యను పరిష్కరించడానికి సిద్ధపడటం శోచనీయం.
ప్రభుత్వ విద్య ఆదరణ కోల్పోవడానికి కారణాలను అన్వేషించి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు వేసిన విద్యా కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవాలి. డిజిటల్ విద్యపై పాశ్చాత్య దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం. అంతేగానీ పుండొకటైతే మందొకటి అన్న చందంగా పాపులిస్ట్ విధానాలతో సమస్యలకు సమూల పరిష్కారం లభించదు.
-విద్యారంగ విశ్లేషకులు కె.వేణుగోపాల్ ,98665 14577